
Iran: ఇరాన్ దేశంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర ప్రాంతంలోని ఓ డ్రగ్ రిహాబ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం జరిగి 32 మంది మరణించారు. ఉత్తర గిలాన్ ప్రావిన్స్‌లోని లాంగరుడ్ నగరంలోని డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్ లో చెలరేగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 27 నుంచి 32కి పెరిగినట్లు ఆ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ మొహమ్మద్ జలాయ్ తెలిపారు.
ఈ ప్రమాదంలో మరో 16 మంది గాయపడ్డారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అగ్నిప్రమాదానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ కేంద్రం మొత్తం సామర్థ్యం 40 మందిగా తెలిసింది. సెంటర్ మేనేజర్ తో పాటు పలువురు అనుమానితులను ఇప్పటికే అక్కడి ప్రభుత్వం అరెస్ట్ చేసింది.
ఘటన జరిగిన వెంటనే మంటలను అదుపు చేసేందుకు అత్యవసర సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటల ధాటికి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. కిటికీలు పగిలిపోయాయి. ఈ ఘటనకు ముందు ఆగస్టు నెలలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని గ్రాండ్ బజార్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అక్కడి దుకాణాలు దెబ్బతిన్నాయి. ఎటువంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. జనవరి 2017లో, టెహ్రాన్‌లోని 15-అంతస్తుల ప్లాస్కో షాపింగ్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 16 మంది అగ్నిమాపక సిబ్బందితో సహా కనీసం 22 మంది మరణించారు.