Leading News Portal in Telugu

Kangana Ranaut: ఎన్నికల పోటీలో కంగనా రనౌత్.. ఆయన ఆశీర్వదిస్తే పోరాడుతా అంటూ..


Kangana Ranaut: ఎన్నికల పోటీలో కంగనా రనౌత్.. ఆయన ఆశీర్వదిస్తే పోరాడుతా అంటూ..

Kangana Ranaut: నటి కంగనా రనౌత్ రాజకీయాలకు చాలా దగ్గరగా ఉంటారు. ముఖ్యంగా బీజేపీకి ఫెవర్‌గా వ్యవహరిస్తుంటారు. గతంలో మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఏకంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం చూశాం. ప్రధాని మోడీతో పాటు బీజేపీ ప్రభుత్వాన్ని పొగుడుతూ ఉంటారు. ఇవన్నీ చూసినప్పుడు కంగనా ఏదో రోజు ప్రత్యక్ష రాజకీయాలకు వస్తుందనే వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.

తాజాగా ఆమె వ్యాఖ్యలను చూస్తే త్వరలోనే ఎన్నికల్లో పోటీ చేస్తారనే తెలుస్తోంది. శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని కంగనా రనౌత్ అన్నారు. ఈ రోజు ఆమె దేవభూమి ద్వారకలోని శ్రీకృష్ణుడి ద్వారకాధీష్ ఆలయంలో ప్రార్థనలు చేయడానికి వచ్చిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని విలేకరులు ఆమెను అడిగినప్పుడు, రనౌత్, “శ్రీ కృష్ణ కీ కృపా రాహి తో లడేంగే (శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తే నేను పోరాడతాను)” అని అన్నారు.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 600 ఏళ్ల పోరాటం తర్వాత అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టను సాధ్యం చేసిందని ఆమె ప్రశంసించారు. బీజేపీ కృషితోనే భారతీయులమైన శ్రీరామ ఆలయం సాకారమైందని అన్నారు. సముద్రంగర్భంలో మునిగిపోయిన ద్వారక నగరానికి చెందిన అవశేషాలను యాత్రికులు సందర్శించేందుకు వీలుగా సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. తనకు శ్రీకృష్ణుడి నగరం స్వర్గం లాంటిదని ఆమె అన్నారు.

ఇటీవల కంగనా రనౌత్ నటించిన ‘తేజస్’ మూవీ రిలీజ్ అయింది. ఇండియా తొలి స్వదేశీ ఫైటర్ జెట్ తేజస్ ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కించారు. కంగనా దర్శకత్వం వహించి, నిర్మిస్తున్న ‘ఎమర్జెన్సీ’, ‘తను వెడ్స్ మను 3’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.