Leading News Portal in Telugu

Mohammed Shami: అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడం సంతోషంగా ఉంది: షమీ


Mohammed Shami: అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడం సంతోషంగా ఉంది: షమీ

Mohammed Shami Says I always try to bowl in good areas: వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉందని టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్‌ షమీ తెలిపాడు. తాను ఎల్లప్పుడూ సరైన లెంగ్త్‌, రిథమ్‌ మిస్‌ కాకుండా బంతిని విసిరేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బంతిని ఏ ఏరియాలో విసురుతున్నామన్నదే కీలకం అని, మెగా టోర్నీలలో ఓ సారి రిథమ్‌ కోల్పోతే చాలా కష్టం అని షమీ పేర్కొన్నాడు. ముంబైలోని వాంఖడే మైదానంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్స్ పడగొట్టాడు. తద్వారా ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు (45) తీసిన భారత బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు.

‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న అనంతరం మహ్మద్‌ షమీ మాట్లాడుతూ… ‘మా బౌలింగ్ మంచి స్థితిలో ఉంది. మేము ఉన్న ఫామ్ పట్ల అందరూ ఆనందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఒకరి విజయం పట్ల మరొకరు సంతోషంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా మేము ఓ యూనిట్‌గా బౌలింగ్ చేస్తున్నాము. ఆ ఫలితం మీరు మైదానంలో చుస్తున్నారు. నేను ఎప్పుడూ మంచి ఏరియాలో బౌలింగ్ చేయడానికి మరియు మంచి రిథమ్‌లో ఉండటానికి ప్రయత్నిస్తాను. పెద్ద టోర్నమెంట్లలో ఒకసారి లయ తప్పిపోతే.. దాన్ని తిరిగి పొందడం చాలా కష్టం. అందుకే నేను ఎల్లప్పుడూ మంచి ఏరియాలో బౌలింగ్ చేయడంపై దృష్టి సారిస్తాను’ అని తెలిపాడు.

‘వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడం సంతోషంగా ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బంతిని ఏ ఏరియాలో విసురుతున్నామన్నదే కీలకాంశం. కొత్త బంతితో బరిలోకి దిగినపుడు పిచ్‌ నుంచి సహకారం ఉంటేనే బాగా బౌలింగ్ చేయగలం. ప్రేక్షకుల నుండి మాకు భారీ మద్దతు లభిస్తోంది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెపుతున్నా. మేము భారతదేశం వెలుపల ఆడినప్పుడు కూడా చాలా మద్దతు లభిస్తుంది. డ్రెస్సింగ్ రూమ్ చాలా బాగా ఉంది. ముందుగా ఫైనల్ చేరి, ఆపై కప్ కొట్టాలని చుస్తున్నాం’ అని మహ్మద్‌ షమీ చెప్పాడు.