Leading News Portal in Telugu

జగన్‌కు సుప్రీం నోటీసులు.. సీన్ సితారేనా?! | supreme notices to jagan| disappropriate| assets| cases| raghu. rama| raju| petitiom| cbi| another


posted on Nov 3, 2023 4:45PM

ఏపీ సీఎం జగన్‌ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆర్ఆర్ఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పైన సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటి వరకూ 3,041 సార్లు వాయిదా పడ్డాయని, ఈ కేసులో విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐలో కనిపించటం లేదని రఘురామ ఆరోపించారు. ఇందులో జగన్ కు ఇష్టానుసారం వాయిదాలు కోరే స్వేచ్ఛ ఇచ్చారని.. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కేసుల విచారణ ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించటం లేదని రఘురామ తన పిటిషన్ లో పేర్కొన్నారు. తమిళనాడు  ముఖ్యమంత్రిగా పని చేసిన జయలలిత అక్రమాస్తుల కేసుల విచారణను కర్నాటకలో విచారణ జరిపినట్లే.. ఇప్పుడు జగన్ కేసుల విచారణను తెలంగాణలో కాకుండా మరో రాష్ట్రంలో విచారణ జరపాలని ఎంపీ తన పిటీషన్‌లో కోరారు.

 సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిగింది.  ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీఎం జగన్ కు షాకిచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐకి నోటీసు జారీ చేసిన సుప్రీం, కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని ప్రశ్నించింది. ఇదే క్రమంలో రఘురామ వేసిన కేసుల బదిలీ పిటిషన్‌ ను ఎందుకు విచారించకూడదో కూడా చెప్పాలని ఆదేశించింది. ఈ పిటిషన్ కు సంబంధించిన ప్రతివాదులైన సీఎం జగన్ కు సైతం నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు కేసును మాత్రం వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. అంటే ఈలోగా సీబీఐ ఈ కేసును దర్యాప్తు మొదలు పెట్టాలి. లేదా ఎందుకు ఆలస్యమవుతుందో సుప్రీంకు సమాధానం చెప్పాలి. అలాగే  మరో రాష్ట్రానికి ఎందుకు బదిలీ చేయకూడదో కూడా సీబీఐ వివరణ ఇవ్వాలి. సీబీఐ వివరణకు సుప్రీం ధర్మాసనం సమంజసమనుకుంటే జగన్ అక్రమాస్తుల కేసు హైదరాబాద్ లోనే ఉంటుంది. లేకపోతే మరో రాష్ట్రానికి బదిలీ అవుతుంది.

అయితే  జనవరి ఈ కేసులో ఎలాంటి కదలిక వచ్చినా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బేననడంలో సందేహం లేదు. సుప్రీంలో సమాధానం చెప్పుకోవడానికి, తాము వేగం పెంచామని చూపడానికీ..  సీబీఐ ఈ కేసు విచారణలో సీబీఐ వేగం పెంచినా.. లేక జనవరిలో సుప్రీం ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసినా.. వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చినా అది  జగన్ మోహన్ రెడ్డికి ప్రతికూలమే అవుతుంది. వచ్చే ఏడాది జనవరి అంటే సరిగ్గా ఎన్నికల సమయం. మహా అయితే ఎన్నికలకు రెండు మూడు నెలల సమయం మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో అక్రమాస్తుల కేసు విచారణకు వస్తే వైసీపీ పరిస్థితి దారుణంగా మారనుంది. జగన్ కేసులు విచారణకు వస్తే జగన్ అక్రమార్జన, క్విడ్ ప్రోకో, అరెస్టు వంటి అంశాలపై జనంలో చర్చ జరగడం ఖాయం. ఇప్పటికే చంద్రబాబు అక్రమ అరెస్టు తరువాత ఒక్క ఏపీలోనే కాదు.. దేశ వ్యాప్తంగా జగన్ అక్రమాస్తుల కేసు, పదేళ్లుగా బెయిలుపై ఉండటం వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది. జరుగుతోంది. ఇక సుప్రీం నోటీసుల నేపథ్యంలో జగన్ అక్రమాస్తుల కేసులో ఎలాంటి కదలిక వచ్చినా అది జగన్ ప్రతిష్టకు తీవ్రంగా భగం వాటిల్లడం ఖాయం. ఎన్నికల వేళ సీబీఐ ఈ కేసు విచారణ వేగవంతం చేస్తే అది కచ్చితంగా జగన్ కు ఇబ్బందికరంగా మారుతుంది.

ఇప్పుడున్న ఈ కేసు విచారణ ప్రకారం చూస్తే జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. గత నాలుగేళ్లుగా జగన్ విచారణకు హాజరు కావడం లేదు. కనుక జనవరిలో ఈ కేసులో కదలిక వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిందేనని.. హాజరు కాకపొతే అరెస్ట్ చేయాల్సి వస్తుందని తీర్పు వస్తే జగన్ ప్రతిష్ట టోటల్ డ్యామేజ్ కానుంది. ఇప్పుడంటే బీజేపీతో సఖ్యత కారణంగా జగన్ ఈ కేసు విచారణ పరంగా ముందుకెళ్ళకుండా మ్యానేజ్ చేయగలుగుతున్నారన్నది జగమెరిగిన సత్యం. అయితే ఎన్నికల ముందు బీజేపీతో జగన్ మైత్రి ఎలా ఉండబోతుందన్న దానిపై కూడా ఈ కేసు విచారణ ఆధారపడి ఉండనుంది. అయితే, దాదాపుగా ఇప్పటికే సంవత్సరాల తరబడి ఈ కేసు సాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీవ్రంగానే స్పందించే అవకాశం కనిపిస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.