Leading News Portal in Telugu

Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై యూఏఈ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోడీ..


Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై యూఏఈ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోడీ..

PM Modi: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం పశ్చిమాసియాలోనే కాకుండా ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. తాజాగా ఈ యుద్ధంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్‌తో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. ఇరువురు నేతల భద్రత, మానవత పరిస్థితులను త్వరగా పరిష్కరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వం ప్రతీ ఒక్కరికి ముఖ్యమే అని ప్రధాని మోడీ అన్నారు.

‘‘పశ్చిమాసియా పరిస్థితులపై యూఏఈ అధ్యక్షుడు, నా సోదరుడు మొహమ్మద్ బిన్ జాయెద్‌తో మాట్లాడాను. తీవ్రవాదం, క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులు, పౌర ప్రాణనష్టంపై మేము తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాము. భద్రత, మానవతావాద పరిస్థితుల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని మేము అంగీకరిస్తున్నాము. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వంపై ప్రతీ ఒక్కరి ఆసక్తి ఉంది’’ అని పీఎం మోడీ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.

అక్టోబర్ 7న ప్రారంభమైన యుద్ధం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అని అంతా భయపడుతున్నారు. ఇజ్రాయిల్ భూభాగంలోకి గాజా నుంచి చొరబడిన హమాస్ ఉగ్రవాదులు 1400 మందిని ఘోరంగా చంపేశారు. ఆ తరువాత నుంచి గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. హమాస్ ని పూర్తిగా ధ్వంసం చేసేదాకా తగ్గదే లేదని ఇజ్రాయిల్ చెబుతోంది. ఇప్పటికే గాజా నగరాన్ని ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముట్టింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మరోసారి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో సమావేశమయ్యారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో పాలస్తీనియన్ల మరణాల సంఖ్య 9227కి చేరిందని గాజాలోని హమాస్ నిర్వహిస్తున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.