Leading News Portal in Telugu

Chhattisgarh Election 2023: ఛత్తీస్‌ఘడ్‌లో మళ్లీ కాంగ్రెస్‌దే అధికారం.. సునాయాసంగా మ్యాజిక్‌ ఫిగర్‌..!


Chhattisgarh Election 2023: ఛత్తీస్‌ఘడ్‌లో మళ్లీ కాంగ్రెస్‌దే అధికారం.. సునాయాసంగా మ్యాజిక్‌ ఫిగర్‌..!

Congress to Retain Chhattisgarh Says Peoples Pulse Survey: తెలంగాణతో పాటు ఛత్తీస్‌ఘడ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. శాసనసభ ఎన్నికలకు సంబందించిన షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) గత నెలలోనే విడుదల చేసింది. నవంబర్ 7, 17 తేదీల్లో ఛత్తీస్‌ఘడ్‌లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అభ్యర్థులు తమ నామినేషన్‌లను దాఖలు చేశారు. మ‌రో ఐదు రోజుల్లో ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లోని ఇర‌వై స్థానాల్లో తొలి విడత పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ మరోసారి ఛత్తీస్‌ఘడ్‌లో జయకేతనం ఎగురవేస్తుందని సర్వేలు చెబుతున్నాయి.

ఛత్తీస్‌ఘడ్‌లో మరోసారి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ‘పీపుల్స్‌పల్స్‌’ పేర్కొంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 55-60 సీట్లు గెలుస్తుందని పీపుల్స్‌పల్స్‌ నిర్వహించిన ప్రీపోల్‌ సర్వేలో వెల్లడైంది. బీజేపీకి 29-34 సీట్లు.. బీఎస్‌పీ, ఇతరులు 1-2 సీట్లు వచ్చే అవకాశాలను ఉన్నాయని పీపుల్స్‌పల్స్‌ తెలిపింది. కాంగ్రెస్‌ పార్టీకి 47 శాతం, బీజేపీకి 42 శాతం, ఇతరులకు 11 శాతం ఓట్లు పడనున్నాయట.

ఛత్తీస్‌ఘడ్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేష్‌భగేల్‌ అని పీపుల్స్‌పల్స్‌ ప్రీపోల్‌ సర్వేలో చెప్పింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, బీజేపీలోని నాయకత్వం అనిశ్చితి కాంగ్రెస్‌కు మేలు చేకూరుస్తుందని తెలిపింది. రెండు విడతల్లో జరగనున్న ఛత్తీస్‌ఘడ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారం చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 46 సీట్లను సునాయాసంగా దాటుతుందని వెల్లడించింది. అక్టోబర్‌ 15 నుంచి 31 వరకు రెండు వారాల పాటు ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో 6,120 శాంపిల్స్‌తో పీపుల్స్‌పల్స్‌ సంస్థ ప్రీపోల్ సర్వే నిర్వహించింది.