Leading News Portal in Telugu

Hardik Pandya Note: చాలా కష్టంగా ఉంది.. హార్దిక్‌ పాండ్యా భావోద్వేగం!


Hardik Pandya Note: చాలా కష్టంగా ఉంది.. హార్దిక్‌ పాండ్యా భావోద్వేగం!

Hardik Pandya express his emotion after Ruled Out of ODI World Cup 2023: గాయం కారణంగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా భావోద్వేగానికి గురయ్యాడు. ప్రపంచకప్ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమవుతున్నాననే నిజాన్ని తాను జీర్ణించుకోవడం కష్టంగా ఉందన్నాడు. తనపై ప్రేమ కురిపించి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాడు. ప్రస్తుత జట్టు ప్రత్యేకమైనదని, ప్రతి ఒక్కరినీ గర్వపడేలా చేస్తుందని హార్దిక్ ధీమా వ్యక్తం చేశాడు. పుణెలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా హార్దిక్ చీలమండకు గాయం కాగా.. నేడు మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు.

వన్డే ప్రపంచకప్ 2023 నుంచి తప్పుకున్న అనంతరం హార్దిక్‌ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగపూరిత నోట్‌ షేర్‌ చేశాడు. ‘ప్రపంచ కప్‌లో మిగిలిన మ్యాచ్‌లకు నేను దూరం అయ్యాననే వాస్తవాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. నేను ప్రతి మ్యాచ్‌లో, ప్రతి బంతికి భారత జట్టును ఉత్సాహపరుస్తుంటాను. నాకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. ఈ జట్టు ప్రత్యేకమైనది. భారత జట్టు ప్రతి ఒక్కరినీ గర్వపడేలా చేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మీ ప్రేమ, అభిమానాలు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలి’ అని హార్దిక్‌ నోట్‌లో పేర్కొన్నాడు.

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా బంతిని ఆపే క్రమంలో హార్దిక్‌ పాండ్యా చీలమండకు గాయమైంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న హార్దిక్‌.. సెమీస్‌ నాటికి కోలుకుంటాడని అంతా భావించారు. కానీ దురదృష్టవశాత్తూ గాయం తీవ్రంగా ఉండటంతో టోర్నీ మధ్యలోనే నిష్క్రమించాల్సి వచ్చింది. హార్దిక్‌ స్థానంలో యువ పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ జట్టులోకి వచ్చాడు. ఆల్‌రౌండర్‌గా సేవలు అందిస్తోన్న హార్దిక్.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే బ్యాటింగ్ చేశాడు. నాలుగు మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేసి.. ఐదు వికెట్లు తీశాడు.