Leading News Portal in Telugu

Viral News: రూ. 1000 తిరిగి ఇవ్వడం లేదని.. హోర్డింగ్‌ ఎక్కిన యువకుడు!


Viral News: రూ. 1000 తిరిగి ఇవ్వడం లేదని.. హోర్డింగ్‌ ఎక్కిన యువకుడు!

A man put up a hoarding in Nizamabad for not returning Rs 1000: సాధారణంగా అప్పుగా ఇచ్చిన డబ్బు లేదా చేబదులుగా ఇచ్చిన డబ్బును ఇవ్వకుంటే.. బ్రతిమిలాడుతారు లేదా బెదిరిస్తారు. ఎక్కువ మొత్తం అయితే పంచాయితీ కూడా పెడుతారు. అయితే ఓ యువకుడు కేవలం రూ. 1000 తిరిగి ఇవ్వడం లేదని పెద్ద సాహసమే చేశాడు. ఓ వ్యక్తి తనకు వెయ్యి రూపాలను తిరిగి ఇవ్వడం లేదని ఏకంగా భారి హోర్డింగ్‌ ఎక్కాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం… నిజామాబాద్‌ మూడో ఠాణా పరిధిలో రవీందర్‌ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడు పెయింటింగ్‌ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రవీందర్‌ తన నివాసం దగ్గరలో రోడ్డు పక్కనే ఉన్న ఓ పెద్ద హోర్డింగ్‌ ఎక్కాడు. హోర్డింగ్‌పై కాలుమీద కాలేసుకుని పడుకున్నాడు. ఇది చూసిన జనాలు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడి చేరుకుని రవీందర్‌తో మాట్లాడారు.

సీఐ కూడా ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బంది సాయంతో రవీందర్‌ను హోర్డింగ్‌ పైనుంచి కిందకు దింపారు. హోర్డింగ్‌ ఎందుకు ఎక్కావని సీఐ అడగగా.. ఓ వ్యక్తి రూ. 1000 ఇవ్వాల్సి ఉందని, కానీ ఆ డబ్బు తిరిగి ఇవ్వడం లేదని చెప్పాడు. ఇది విన్న అక్కడున్నవారు ఒక్కసారిగా విస్తుబోయారు. సీఐ రవీందర్‌కి కౌన్సిలింగ్‌ ఇచ్చి.. ఇంటికి పంపించారు. రవీందర్‌ గతంలోనూ హోర్డింగ్‌ ఎక్కినట్లు స్థానికులు చెప్పారు. అతడు మద్యానికి బానిసైనట్లు కూడా తెలిపారు.