Leading News Portal in Telugu

కాంగ్రెస్ గూటికి వైఎస్ ఫ్యామిలీ! | ys family to join congress| jagan| alone| political| backlash| mother| sister| ap


posted on Nov 6, 2023 8:55AM

అధికారం అనేది మనిషిని ఎంతగా మార్చేస్తుందో కొంత మంది నేతలు పెర్ఫెక్ట్ ఉదాహరణగా కనిపిస్తారు. రాజకీయ నేతలందరూ అలానే ఉంటారని చెప్పలేం కానీ.. కొందరిలో మాత్రం అధికారానికి ముందు అధికారానికి తర్వాత అనే మార్పు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఆ కోవకి చెందిన నేతగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. స్వతహాగానే మొండి వైఖరి గల జగన్ మోహన్ రెడ్డి కాలేజీ రోజుల నుండే  ఆ వైఖరితో  చాలా చిక్కులు తెచ్చుకున్నారు. తెచ్చిపెట్టారు. అయితే తండ్రి రాజశేఖర రెడ్డి రాజకీయాలలో ఉండడంతో  వాటన్నిటినీ సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత అదే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ అక్రమార్జనకు ఒడిగట్టారు. ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. మొండి వైఖరి, అక్రమార్జన ఇవన్నీ వ్యాపారాలలో ఎలా ఉన్నా రాజకీయాలలో జగన్ వైఖరి ఎలా ఉంటుందన్నది అప్పట్లో పెద్దగా ఎవరికీ తెలియదు.  వైఎస్ హయంలోనే కడప ఎంపీ సీటు విషయంలో తన బాబాయ్ వివేకానంద రెడ్డి మీద చేయి చేసుకున్నారనే ప్రచారం ఉంది.

కాగా తండ్రి మరణానంతరం పూర్తిగా తన సొంత రాజకీయ సామ్రాజ్యాన్ని నెలకొల్పే క్రమంలో అసలు సిసలైన జగన్ మోహన్ రెడ్డి అంటే ఏంటో మెల్ల మెల్లగా ప్రపంచానికి తెలిసింది. బాబాయ్ వివేకా హత్యకేసులో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని  సీబీఐ తేల్చగా.. హత్యచేసిన వారిని జగన్ కాపాడటం కోసం జగన్ ప్రయత్నించడంతో జగన్ నిజస్వరూపం ఏంటో బాహ్య ప్రపంచానికి స్పష్టంగా తెలిసింది. ఈ క్రమంలోనే సొంత కుటుంబం ఆయనకు దూరమయ్యింది. ఎన్నికలకు ముందు జగన్ జైలు పాలైతే  జగన్ కు అండగా నిలవడం బాధ్యతగా భావించిన ఆయన సోదరి షర్మిల ఊరూరా ప్రచారం చేశారు. అప్పటి వరకూ రాజకీయాలు పరిచయం లేని షర్మిల అన్న కోసం.. అన్న వదిలిన బాణాన్ని అంటూ తన స్థాయికి మించి కష్టపడ్డారు. తల్లి విజయమ్మ కూడా అంతే. భర్త మరణానంతరం అన్నీ కుమారుడే అనుకున్న ఆ తల్లి.. జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని ఆశపడ్డారు. అందుకోసం ప్రత్యక్ష రాజకీయాలలోకి కూడా వచ్చి తండ్రి అనుచరులని కుమారుడికి దగ్గర చేశారు. ఆమె కూడా ఎన్నికలలో పోటీ చేశారు.

కానీ, అధికారం దక్కిన అనంతరం జగన్ మోహన్ రెడ్డికి ఒక్కొక్కరు దూరమయ్యారు. తన  విజయం కోసం  కోసం కష్టపడిన సోదరి, తన భర్త స్థానంలో వారసుడిగా కుమారుడిని చూసి మురిసిపోవాలనుకున్న తల్లిని జగన్ దూరం చేసుకున్నారు. ఆస్తి తగాదాలు, రాజకీయ వివాదాలు.. కారణం ఏమైనా కావచ్చు జగన్ ఇప్పుడు ఒంటరి.  సొంత కుంటుంబంతో పాటు బాబాయ్ వివేకా కుటుంబం ఎందుకు దూరమయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు ఒక్కరే. మిగతా వైఎస్ కుటుంబం అంతా ఆయనకు దూరంగానే ఉంటున్నారు. రాజశేఖర రెడ్డి సొంత సోదరుల కుటుంబం, రాజశేఖరరెడ్డి భార్య, కుమార్తె, అల్లుడు ఇలా అందరూ కలిసే ఉంటే జగన్ ఒక్కరే ఏకాకిగా మారారు. సొంత కుటుంబ సభ్యులతో సంబంధాలు తెంచుకొని రాకపోకలు లేకుండా తానో మోనార్క్ అని తనకు తానే భావించుకుంటూ ఏకాకి అయిపోయారు.  

అయితే, ఇప్పుడు వైఎస్ కుటుంబం కాంగ్రెస్ గూటికి చేరువవుతున్నది. షర్మిల ఇప్పటికే తెలంగాణలో పోటీ నుండి తప్పుకొని కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ప్రకటించారు. ఇక  ఏపీ ఎన్నికల నాటికి ఏపీపీసీసీలో షర్మిల కీలకం కానున్నట్లు రాజకీయ వర్గాలు బలంగా భావిస్తున్నాయి. పరిశీలకులు కూడా అదే అంటున్నారు. జగన్, కాంగ్రెస్ మధ్య వైరం తెలిసిందే.  వైఎస్ మరణం తర్వాత సోనియా గాంధీపై వైసీపీ నేతలు దారుణ వ్యాఖ్యలు చేశారు.   ఇంకా మాట్లాడితే  రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక సోనియా హస్తం ఉందని కూడా ఒకానొక సందర్భంలో ఆరోపణలు చేశారు. అలాంటి కాంగ్రెస్ గూటికే ఇప్పుడు వైఎస్ కుటుంబం మళ్ళీ చేరువవుతున్నది.  వైఎస్ఆర్ మరణించే వరకూ అసలు సిసలైన కాంగ్రెస్ నాయకుడు కనుక ఆయన కుటుంబానికి  ఆ పార్టీకి దగ్గరయ్యే నైతిక హక్కు  ఉంటుంది.  కానీ, జగన్ మోహన్ రెడ్డికే ఇప్పుడు అసలైన పరీక్ష  ఎదురుకానుంది. వైఎస్ కుటుంబం కాంగ్రెస్ లో చేరి కీలకమైతే జగన్ కూడా సొంత కుటుంబానికే ప్రత్యర్థి కానున్నారు.  దీంతో జగన్ కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగలక తప్పదని అంటున్నారు.