Leading News Portal in Telugu

Vijayasai Reddy: పురంధేశ్వరి వర్సెస్ విజయసాయిరెడ్డి.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ


Vijayasai Reddy: పురంధేశ్వరి వర్సెస్ విజయసాయిరెడ్డి.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ

Vijayasai Reddy: బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. సోషల్‌ మీడియాలో రోజుకో రచ్చ అనే తరహాలో ఈ వ్యవహారం సాగుతోంది.. మీడియాతో మాట్లాడే సందర్భంలోనూ ఈ వ్యవహారాన్ని ప్రస్తావిస్తున్నారు.. ఇక, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసేవరకు వ్యవహారం వెళ్లినా.. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు.. తాజాగా మరోసార పురంధేశ్వరిపై హాట్‌ కామెంట్లు చేశారు ఎంపీ సాయిరెడ్డి..

పురంధేశ్వరి పై వరుస ట్విట్లతో కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు విజయసాయిరెడ్డి.. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించింది పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర్రావులే అని ఆరోపించారు సాయిరెడ్డి.. ఎమ్మెల్యేలు వెంటలేకున్నా అంతా తన వైపు వచ్చారని బాబు ఎల్లో మీడియాలో రాయించుకోవడం ఒక ఎత్తయితే, ఎన్టీఆర్ కుమారులను తండ్రిపైకి ఉసిగొల్పిన ఘనచరిత్ర పురందేశ్వరిది అని విమర్శించారు. సిగ్గు విడిచి పదవీ కాంక్షతో అప్పట్లో బాబుగారి ఇంటికి వెళితే తలుపులు తెరవకుండా తరిమికొట్టినా.. మళ్లీ ఆయన పల్లకి మోస్తున్నారు ఈ ఆదర్శ దంపతులు అంటూ దుయ్యబట్టారు.. “అన్న టీడీపీ” అనే పార్టీని పురంధేశ్వరి ప్రేరేపించి నందమూరి హరికృష్ణ చేత ప్రారంభించి, తనే కొబ్బరికాయ కొట్టి, కొంతకాలం గౌరవ అధ్యక్షురాలిగా పనిచేసి, ఆ పార్టీ ఓడిపోవటంతో కాంగ్రెస్ లో చేరి సోనియాగాంధీని పొగడ్తలతో ముంచెత్తిన ఘనురాలు ఈవిడ అంటూ పురంధేశ్వరిపై ట్విట్టర్‌ వేదికగా విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

ఇక, నమ్మకద్రోహం అనేది పురంధేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉంది. తండ్రిని కాటికి పంపిన వ్యక్తికి పార్టీలు మారడం ఒక లెక్కా. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా మారింది. ఇప్పుడు పేరుకు బీజేపీ అధ్యక్షురాలైనా బావ పార్టీ టీడీపీ సేవలో తరిస్తోంది. ఇలాంటి వారినే మోసగాళ్లకు మోసగాళ్లు అంటారు.. అంటూ మరో ఘాటు ట్వీట్‌ సంధించారు. .

మరోవైపు.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి పురంధేశ్వరి. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకోవైపు టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికం అని మరో ట్వీట్‌లో దుయ్యబట్టారు.. తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందని, ఆ అవమానాల పునాదులపైనే ఏర్పాటైన టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీతో అంటకాగి చంద్రబాబు గెంటేసేసరికి అదే తండ్రిని అవమానించిన కాంగ్రెస్ లో చేరి నిస్సిగ్గుగా కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన నీతిలేని చరిత్ర పురంధరేశ్వరిది. ఆంధ్ర ప్రదేశ్ ను అవమానవీయంగా విభజన చేసిన కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా తనవంతు శకుని పాత్ర పోషించి రాష్ట్రాన్ని నాశనం చేసిన మహా గొప్ప మహిళ ఈ పురంధరేశ్వరి.. అంటూ విమర్శలు గుప్పించారు సాయిరెడ్డి..