
TDP-JSP Meeting: వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ కలిసి ముందుకు నడవాలని నిర్ణయించాయి.. అందులో భాగంగా.. టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ తొలిసమావేశం ఇప్పటికే జరగగా.. ఇప్పుడు రెండో సమావేశానికి సిద్ధం అవుతున్నాయి రెండు పార్టీలు.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమన్వయ కమిటీ రెండో భేటీ జరగనుంది.. ఈ నెల 9వ తేదీన జరిగే టీడీపీ – జనసేన పార్టీల నుంచి చెరో ఆరుగురు సభ్యుల హాజరుకానున్నారు.. అయితే, ఉమ్మడి మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రోగ్రాం రూపకల్పనపై ప్రధానంగా చర్చ సాగనుంది.
కాగా, రాజమండ్రి జైలులో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. టీడీపీ-జనసేన కలిసి నడవాలని నిర్ణయించాయనే విషయాన్ని ప్రకటించిన విషయం విదితమే.. ఇక, అనారోగ్య సమస్యలతో మధ్యంతర బెయిల్పై జైలు నుంచి విడుదలైన చంద్రబాబును హైదరాబాద్లో పరామర్శించిన పవన్ కల్యాణ్.. తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించారు.. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ భేటీ జరిగింది.. సమావేశంలో లోకేష్, నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.. ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలనే అభిప్రాయానికి వచ్చాయి టీడీపీ-జనసేన. ఆ సమావేశంలో చంద్రబాబు పాల్గొన వచ్చో.. లేదోననే అంశంపై న్యాయ నిపుణులతో సంప్రదించనుంది టీడీపీ.. సమావేశంలో పాల్గొనడానికి సాంకేతిక ఇబ్బంది లేదనుకుంటే.. చంద్రబాబు ఆరోగ్యం కుదుటపడ్డాక ఉమ్మడి సమావేశం నిర్వహించే ఛాన్స్ ఉందనే సమాచారం వినిపించినా.. ఆ తర్వాత ఈ నెల 9వ తేదీన సమావేశం నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. మరోవైపు.. దసరా నాటికి పూర్తి స్థాయి మేనిఫెస్టోను ప్రకటించాల్సి ఉండే.. కానీ, జైల్లో ఉన్న కారణంగా ప్రకటించలేకపోయామని చంద్రబాబు తెలపగా.. కొంచెం ఆలస్యమైనా పూర్తి స్థాయి మేనిఫెస్టోను ప్రకటిద్దామనే నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు – పవన్ కల్యాణ్ వచ్చినట్టుగా తెలుస్తోంది.. జనసేన వైపు నుంచి మేనిఫెస్టో రూపకల్పన కోసం అంశాలను ఆరు అంశాలను ప్రతిపాదన వచ్చాయట.. త్వరలోనే మరోసారి బాబు – పవన్ భేటీ కానున్నారు..
అయితే, ఉమ్మడి మేనిఫెస్టో కోసం షణ్ముఖ వ్యూహం పేరిట 6 అంశాలు ప్రతిపాదించింది జనసేన.. సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరిట వివిధ రంగాలకు ఆర్ధిక ప్రోత్సాహం ఇస్తూ పారిశ్రామికంగా- ఉద్యోగాల కల్పన దిశగా అభివృద్ధి చేసే ప్రణాళిక రూపొందిస్తున్నారు.. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ విశాఖ, తిరుపతి, విజయవాడలను క్లస్టర్ల వారీగా మహా నగరాలుగా అభివృద్ధి చేయాలని.. బీపీఎల్ కుటుంబాలు ఇళ్లు కట్టుకోవాలన్నా, లేక ఇళ్ల మరమ్మతులకు ఉచితంగా ఇసుక పంపిణీ చేయాలని.. దాదాపు 30 లక్షల భవన నిర్మాణ కార్మికులకు చేయూత ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని.. సౌభాగ్య పథకం పేరిట ఏటా లక్ష మంది యువ పారిశ్రామిక వేత్తలకు చిరు వ్యాపారాలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నడుపుకునేలా రూ.10లక్షల చొప్పున సాయం అందించాలని.. వ్యవసాయం – బంగారు ఫలసాయం పేరిట ఉద్యాన రైతులకు రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని.. ఉద్యాన పంటలు పండే ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందిస్తామని.. మైనర్ ఇరిగేషన్ రంగాన్ని ప్రోత్సహాం.. ఇబ్బందుల్లేని వ్యవసాయం మన లక్ష్యమని.. మన ఏపీ – మన ఉద్యోగాలు పేరిట ప్రతీ ఏటా ఏపీపీఎస్సీ ద్వారా సకాలంలో పోస్టుల భర్తీ చేస్తామని.. ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు తీసుకుంటామని.. సీపీఎస్ రద్దు చేసి పాత ఫించన్ విధానం అమలు చేస్తామని ఇలా మేనిఫోస్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది జనసేన పార్టీ.