Leading News Portal in Telugu

SL vs BAN: శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్లో అనూహ్య ఘటన


SL vs BAN: శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్లో అనూహ్య ఘటన

ప్రపంచకప్ 2023లో భాగంగా ఈరోజు ఢిల్లీలో శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకకు.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఓవర్లలోనే కుశాల్ పెరీరా (4) పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ పథుం నిస్సాంకా 41 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత కుశాల్ మెండీస్ 19, సమర విక్రమ 41 పరుగులు చేశారు.

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సమర విక్రమ ఔట్ తర్వాత క్రీజులోకి వచ్చిన మాథ్యూస్.. టైం ఔట్ కారణంగా బ్యాటింగ్ చేయకుండానే ఔట్ అయ్యాడు. మాథ్యూస్ హెల్మెట్ క్లిప్ ఊడిపోవడంతో మరో హెల్మెట్ తెప్పించుకునేందుకు కొంత సమయం తీసుకున్నాడు. అయితే అప్పటికే టైం అయిపోతుందని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అప్పీల్ చేశాడు. దీంతో టైమ్ ఔట్ కారణంగా బ్యాటింగ్ చేయకుండానే వెళ్లిపోయాడు. అయితే బంగ్లాదేశ్ తన అప్పీల్ ని వెనక్కి తీసుకుంటే మాథ్యూస్ బ్యాటింగ్ చేయొచ్చని అంపైర్లు చెప్పారు. కానీ.. బంగ్లాదేశ్ తన అప్పీల్ ని వెనక్కి తీసుకోకపోవడంతో.. బ్యాటింగ్ చేయకుండానే మాథ్యూస్ ఔట్ గా వెనుదిరిగాడు.

ప్రస్తుతం శ్రీలంక స్కోరు 30 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో చరిత్ అసలంక (47), డి సిల్వ (8) ఉన్నారు. ఇక బంగ్లా బౌలర్లలో కెప్టెన్ షకీబ్ ఇప్పటివరకు 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత తంజీమ్ హాసన్, షోరిఫుల్ ఇస్లాం తలో వికెట్ తీశారు.