Leading News Portal in Telugu

విన్నూత్న రీతిలో నిరసన… గాడిదపై వచ్చి నామినేషన్ దాఖలు 


posted on Nov 6, 2023 3:14PM

పురాణాలలో “వసుదేవుడు అంతవాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అంటారు కదా ” అందులో ఉన్న అర్ధం, పరమార్థం  ఏమిటి అనే విషయాలు పక్కన పెడితే కలియుగంలో  మాత్రం ఓ నిరుద్యోగి మాత్రం అదే గాడిదను ఆశ్రయించి తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పాలనను ఎండగడుతూ విన్నూత్న నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వంత నియోజకవర్గంలోనే ఈ తంతు జరిగింది. 

ప్రత్యేక రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చింది. దాదాపు 30 లక్షలు నిరుద్యోగులు ఇక్కడ ఉన్నారు. పోటీ పరీక్షలను కెసీఆర్ ప్రభుత్వం నిర్వహించకపోవడం, పలుమార్లు రద్దు చేయడం నిరుద్యోగుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. వరంగల్ జిల్లాకు చెందిన ప్రవళిక ఆత్మహత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఈ నేపథ్యంలో  ఒక నిరుద్యోగి వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గాడిదతో వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నించాడు. నామినేషన్ కేంద్రం వద్ద గాడిదను అడ్డుకున్న పోలీసులు నిరుద్యోగిని మాత్రం నామినేషన్ కేంద్రంలోకి అనుమతించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి భాస్కర్ అనే నిరుద్యోగి స్వతంత్ర అభ్యర్థిగా సోమవారం (నవంబర్ 6)నామినేషన్ దాఖలు చేశారు.

బీర్కూరు మండలానికి చెందిన భాస్కర్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తనకు ఉద్యోగం రాకపోవడంతో నామినేషన్ కేంద్రానికి గాడిదను ఆటోలో తీసుకువచ్చి నామినేషన్ కేంద్రానికి దానిపైకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోవడంతోనే తాను ఈ విధంగా నిరసన తెలపాలని గాడిదపై నామినేషన్ వేయడానికి వచ్చానని భాస్కర్ అన్నారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సు వాడ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి గాడిదతో వచ్చి నామినేషన్ దాఖలకు ప్రయత్నించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.