
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు పెంచింది. కమలం పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్ లను రంగంలోకి దించి జోరుగా ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేయనుంది. ఇక, తాజాగా రేపు రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక మొదటిసారి మోడీ తెలంగాణకు వస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
రేపు (మంగళవారం) ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మ గౌరవం పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ సభలో ప్రధాని మోడీ ఏం మాట్లాడబోతున్నారు అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికంగా మారింది. అయితే, రేపటి మోడీ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రేపు సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5: 25 నుంచి 6: 15 గంటల వరకు ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించే బీసీ గర్జన సభలో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 6.30 గంటలకు బేగంపేట నుంచి ఢిల్లీకి వెళ్లిపోతారు.
అలాగే, ఈ సభకు లక్ష మంది వరకు తరలించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి జనాలను తరలించడానికి కమలం పార్టీ నేతలకు ఇప్పటికే నేతలు దిశానిర్దేశం చేశారు. ఇక, ప్రధాని మోడీ రేపటి సభ తర్వాత మళ్లీ 11వ తేదీన పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.