
ఒడిశాలోని భద్రక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన 24 ఏళ్ల గర్భిణి మృతదేహం లభ్యమైంది. భండారిపోఖరి పోలీస్ స్టేషన్ పరిధిలోని నపంగా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే తన కూతురు హత్యపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన భర్త, అతని కుటుంబ సభ్యులే ఆమెను హత్య చేశారని మహిళ తండ్రి ఆరోపించారు. తన కూతురిని శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని, దీనిపై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని తెలిపాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడాది క్రితమే మహిళకు పెళ్లయిందని.. తన భర్త ఇదివరకే ఒక పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆదివారం రాత్రి ఆమె కనిపించకుండా పోయిందని.. సోమవారం గ్రామ సమీపంలోని రోడ్డు పక్కన మృతదేహం కనిపించిందని పోలీసులు తెలిపారు. మృతదేహంపై కొన్ని గాయాలు ఉన్నాయని, అయితే మరణానికి గల కారణం పోస్టుమార్టం తర్వాత తెలుస్తుందని భండారిపోఖరి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ అజయ్ సుదర్శన్ బాగే తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.