ఈసారీ తెలంగాణ వాదాన్నే నమ్ముకున్న కేసీఆర్! | kcr rely on telangana sentiment once again| national| politics| regional| party| safe| gaurd
posted on Nov 7, 2023 10:12AM
బీఆర్ఎస్ కాదు.. టీఆర్ఎస్సే అని కేసీఆర్ ప్రజలను నమ్మించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దేశం మొత్తం తెలంగాణ మోడల్ తీసుకువస్తామంటూ ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చేసి జాతీయ రాజకీయాలలోకి దూకేసిన కేసీఆర్.. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ముందు.. తన జాతీయ రాజకీయ ఆకాంక్షల గురించి ఎక్కడా మాట్లాడటంలేదు. తెలంగాణ వాదాన్నే నమ్ముకున్నారు. తెలంగాణ సాధించిన పార్టీగా మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తన ఎన్నికల ప్రచార సభలలో కూడా ఎక్కడా జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావించకుండా… తెలంగాణ సాధించిన పార్టీగా మరో సారి ఎన్నుకోండంటూ వేడుకుంటున్నారు.
ఇదే కేసీఆర్ కొంత కాలం కిందట పిడుక్కి బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లు కేంద్రంలో మోడీ సర్కార్ ను గద్దె దింపే సత్తా తనకు మాత్రమే ఉందని గల్లీ మీటింగులలో కూడా ఊదరగొట్టారు. ఇప్పుడిక తెరాస కేవలం తెలంగాణకు చెందిన పార్టీ మాత్రమే కాదనీ, బీఆర్ఎస్ గా రూపాంతరం చెంది జాతీయ పార్టీ అయ్యిందనీ, ఇక తాను జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతాననీ చెప్పుకునే వారు. అయితే అదంతా గతం..
ఆయన జాతీయ అడుగులు తడబడ్డాయి. ఆ దిశగా ఆయన వేసిన ప్రతి అడుగులోనూ అడ్డంకులూ, అవాంతరాలూ ఎదురయ్యాయి. బీజేపీ వ్యతిరేక కూటమిలో ఆయనకు స్థానమే లేకుండా చేసింది. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీయేతర పార్టీలన్నీ జాతీయ స్థాయిలో ఏక తాటిపైకి వస్తుంటే.. అదే బీజేపీని గట్టిగా వ్యతిరేకించిన బీఆర్ఎస్ ను మాత్రం ఆ పార్టీలేవీ నమ్మడం లేదు. ఇక ఆయన జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ ప్రకటనలు గుప్పించడంతో.. తెలంగాణ సెంటిమెంటు మాయమైంది. దీంతో కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలలాగే బీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ. తెలంగాణ ప్రజల సెంటిమెంటుతో పెనవేసుకున్న టీఆర్ఎస్ కాదు.
విషయం ఆలస్యంగా గ్రహించిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల ఊసెత్తడం లేదు. ఇప్పుడున్న పార్టీ పేరుకు బీఆర్ఎస్ అయినా పూర్తిగా తెలంగాణ ప్రయోజనాలు, ఆకాంక్షల కోసమే పని చేస్తుందని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రాలకు బలం ప్రాంతీయ పార్టీలేనని నమ్మబలుకుతున్నారు. అయినా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తరువాత కేసీఆర్ ఇతర రాష్ట్రాలలో చేసిన రాజకీయం.. ఇక్కడ సమయానికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోయినా.. ఇతర రాష్ట్రాలలో బాధితులకు నష్టపరిహారం పందేరం చేయడానికి ఆర్భాటంగా చేసిన యాత్రలు, ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ శాఖలను ఏర్పాటు చేయడం.. మహా స్థానిక ఎన్నికలలో పోటీ, ఆయా రాష్ట్రాలలో ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరికలకు ప్రోత్సహించడం తదితర సంఘటలను గుర్తు తెచ్చుకుంటూ… ఇంతలో కేసీఆర్ మాట ఎందుకు మారిందంటూ జనం ఆలోచిస్తున్నారు. చర్చించుకుంటున్నారు.
ఇక కేసీఆర్ గత రెండు అసెంబ్లీ ఎన్నికలలోనూ తనను గెలిపించిన తెలంగాణ వాదాన్ని వదులుకుంటే రాష్ట్రంలో అధికారం జారిపోతుందన్న విషయాన్ని గ్రహించారా అన్నట్లుగా జాతీయ రాజకీయాల ఊసు వదిలేసి పూర్తిగా తెలంగాణ వాదాన్నే నమ్ముకున్నారు. తనకు జాతీయ అంశాలు కాదు, తెలంగాణ సమాజమే ముఖ్యమని పదేపదే చెబుతున్నారు. తెలంగాణ సాధించిన పార్టీగా తమనే గెలిపించాలని చెప్పుకుంటున్నారు. సావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించుకువచ్చానని పదేపదే చెప్పుకుంటున్నారు. మరి మారిన కేసీఆర్ ధోరణిని తెలంగాణ ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుం టారన్నది చూడాల్సిందే.