బీఆర్ఎస్ గూటికి దత్తన్న కుమార్తె?! | dattanna daughter to join brs| disappoinment| musheerabad| ticket| offer| nominated
posted on Nov 7, 2023 2:35PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మీ బీఆర్ఎస్ గూటికి చేరనున్నారనీ, ఇందుకు ముహూర్తం కూడా ఖరారు అయిందన్న ప్రచారం తెలంగాణ పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. సికింద్రాబాద్ నియోజకవర్గానికి అనుకొని ఉన్న ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగాలని ఆమె ప్రయత్నించినా.. పార్టీ అధిష్టానం మాత్రం.. మరోకరికి టికెట్ కేటాయించడంతో.. దత్తన్న కుమార్తె విజయలక్ష్మీ అలిగి గులాబీ గూటికి చేరాలని నిర్ణయించుకొన్నారనే చర్చ అయితే ఆ సర్కిల్స్ లో హల్‌చల్ చేస్తోంది.
అయితే ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్త్రాత్రేయకు బీజేపీతోనే కాకుండా.. దాని అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్‌తో కూడా దశాబ్దాలుగా మంచి అనుబంధం ఉంది. అంతే కాకుండా బీజేపీలో దత్తాత్రేయకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మంచి పేరు ప్రఖ్యాతలు సైతం ఉన్నాయని.. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. గతంలో వాజపేయ్ కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా దత్తన్న పని చేశారని.. అలాగే మోదీ సైతం ఆయనను గతంలో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా… ప్రస్తుతం హర్యానాకు గవర్నర్‌గా అవకాశం ఇచ్చారనీ అంటున్నారు. అటు వాజపేయ్ హయాంలో.. ఇటు మోదీ హాయాంలో కీలక పదవులు పొందిన వారు బీజేపీలో చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారని.. అటువంటి వారిలో బండారు దత్తత్రేయ ముందు వరుసలో ఉంటారని అంటున్నారు.
అలాంటి పార్టీలో తండ్రి ఉంటే.. జస్ట్ ఎమ్మెల్యే టికెట్ రాలేదంటూ.. ఆయన కుమార్తె ఇలా పార్టీ మారడం సరైన చర్య కాదనే ఓ అభిప్రాయం బీజేపీ సర్కిల్స్ లో వ్యక్తం అవుతోంది. అంతేకాదు దత్తన్న పదవిలో ఉన్నా లేకున్నా.. ప్రాంతాలకు, కుల మతాలకు అతీతంగా భాగ్యనగరం వేదికగా ప్రతీ ఏడాది అలాయ్ బలాయ్ నిర్వహిస్తారని.. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె విజయలక్ష్మీ కూడా చేరుగ్గా పాల్గొంటున్నారని.. ఇంకా చెప్పాలంటే ఈ కార్యక్రమ పర్యవేక్షణంతా ఆమే చేస్తారనే ఓ చర్చ సైతం రాజకీయవర్గాలలో కొనసాగుతోంది. అలాంటి వేళ ఎమ్మెల్యే టికెట్ కేటాయించకపోవడంతో.. పార్టీ మార్పుపై కారు పార్టీ అగ్రనేతలతో విజయలక్ష్మి ముచ్చటించడం.. గులాబీ అగ్రనేత ఆమెకు నామినేటెడ్ పోస్ట్ ఆఫర్ చేయడం… అందుకు విజయలక్ష్మీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. చకచకా జరిగిపోయాయనే ఓ ప్రచారం రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
మరోవైపు గతంలో సికింద్రాబాద్ బీజేపీ ఎంపీగా బండారు దత్తాత్రేయ గెలుపొందారు. ఆ క్రమంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా.. పక్కనే ఉన్న ముషీరాబాద్‌పై మంచి పట్టు సంపాదించడమే కాకుండా.. ఆ నియోజకవర్గ ప్రజల తలలో నాలుకలాగా దత్తన్నతోపాటు ఆయన కుమార్తె విజయలక్ష్మీ వ్యవహరిస్తూ వస్తున్నారని.. దీంతో సదరు నియోజకవర్గం టికెట్ దత్తన్న కుమార్తెకు కేటాయిస్తే.. వారు ఎన్నికల ప్రచారం చేయకపోయినా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఓ చర్చ సైతం స్థానికంగా వైరల్ అవుతోంది. అయితే 2018 ఎన్నికల వేళ ముషీరాబాద్ అసెంబ్లీ టికెట్ కోసం విజయలక్ష్మీ ప్రయత్నించారని.. కానీ ఆ సమయంలో టికెట్ దక్కలేదని.. దాంతో ఈ సారి ఆశించినా.. టికెట్ దక్కకపోవడంతో.. కినుక వహించిన ఆమె పార్టీ మార్పుపై ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారనే ఓ చర్చ జరుగుతోంది.
ఇంకోవైపు గతంలో ముషీరాబాద్ నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రొ.కె. లక్ష్మణ్… ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. దీంతో ఆయన కూడా ఎన్నికల బరిలో లేకపోవడంతో.. తనకు ముషీరాబాద్ ఎమ్మెల్యే టికెట్ పక్కా అనుకొంటున్న తరుణంలో చివరి నిమిషంలో.. తనకు ఇలా మొండి చేయి చూపించారంటూ విజయలక్ష్మీ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు ఓ చర్చ అయితే స్థానికంగా వైరల్ అవుతోంది. అదీకాక.. బీజేపీలోని పలువురు అత్యంత కీలక నేతలు.. భవష్యత్తులో తమకు పోటీ వస్తుందనే విజయలక్ష్మీకి టికెట్ కేటాయించలేదనే ఓ ప్రచారం సైతం సదరు సర్కిల్‌లో నడుస్తోంది.
అయినా.. దశాబ్దాలుగా ఒకే పార్టీని అంటి పెట్టుకొని ఉన్న దత్తన్నకు కమలంపార్టీలో సరైన సమయంలో సరైన గౌరవం ఇచ్చిందని.. అలాంటి పార్టీ.. తనకు టికెట్ ఇవ్వలేదంటూ దత్తన్న కుమార్తె విజయలక్ష్మీ మరోపార్టీలోకి వెళ్లిపోతే.. కన్నతల్లి లాంటి బీజేపీకే కాకుండా.. ఆమె తండ్రి బండారు దత్తాత్రేయను సైతం అవమానించినట్లేనని అవుతుందని.. అలాగే ఓ వేళ విజయలక్ష్మీ గులాబీ గుటికి చేరితే.. కాషాయం పార్టీకి గట్టి దెబ్బేననే చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో కొనసాగుతోంది. ఇక పార్టీ మార్పుపై దత్తన్న కుమార్తె విజయలక్ష్మీ అవునడం కానీ.. లేదనడం కానీ చెప్పడం లేదు.. అలాగే బీజేపీ నేతలు సైతం మౌనంగానే ఉంటున్నారు. అలాంటి వేళ… విజయలక్ష్మీ పార్టీ మార్పు ఉంటుందా లేదా అనే అంశంపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.