Leading News Portal in Telugu

Chhattisgarh: ఎన్నికల వేళ.. సుకుమాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు..


Chhattisgarh: ఎన్నికల వేళ.. సుకుమాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు..

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ తొలివిడత ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి. ఎన్నికల వేళ మావోయిస్టులు రెచ్చిపోయారు. ఈ రోజు మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన సుకుమా జిల్లాలోని తాడ్‌మెట్ల, దూలెడ్ గ్రామాల మధ్య పనావర్ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. దాదాపుగా 20 నిమిషాల పాటు కాల్పులు కొనసాగాయి. ఎన్నికల నిర్వహణకు వెళ్లిన బీఎస్‌ఎఫ్ డీఆర్‌జీ బృందంపై నక్సలైట్ల కాల్పులు జరిపారు. ప్రస్తుతం భద్రతాసిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తోంది. ఈ ఘటన బండే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఏకే 47ను స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే నారాయణపూర్ జిల్లా ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడూర్ అడవుల్లో ఎస్టీఎఫ్, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్లు సమాచారం. భద్రతాబలగాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు, అయితే ఇద్దరు ముగ్గురు మావోయిస్టులు చనిపోయినట్లు, వారి మృతదేహాలను తీసుకుని అటవీ ప్రాంతాల్లోకి పారిపోయినట్లు తెలుస్తోంది.

దక్షిణ బస్తర్ దంతెవాడ జిల్లాలోని మన్పా గ్రామంలో ఎన్నికలకు భద్రత కల్పించేందుకు 206 కోబ్రా బెటాలియన్‌కి చెందిన సైనికులు అటవీ ప్రాంతంలో మోహరించారు. ఈ తెల్లవారుజామున సుకుమాలోని తొండమార్క ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన పేలుడులో ఎన్నికల విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ కోబ్రా సిబ్బంది గాయపడ్డారు.

ఛత్తీస్గఢ్‌లోని 90 అసెంబ్లీ స్థానాల్లో 20 స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవన్నీ మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతంలోనే ఉన్నాయి. దీంతో ఎన్నికల నిర్వహణ కోసం దాదాపుగా 60 వేల మంది భద్రతా సిబ్బంది మోహరించారు. 2018లో ఈ 20 సీట్లలో కాంగ్రెస్ 17 స్థానాల్లో విజయం సాధించగా..బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించింది.