Leading News Portal in Telugu

లబ్ధిదారులకు తెలియకుండానే టిడ్కో ఇళ్లు తాకట్టు.. జగన్మాయ! | jagan sarkar deceive tidco beneficiary| mortigage| house| loan


posted on Nov 8, 2023 12:24PM

ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ చేసిన మరో భారీ మోసం బయటపడింది. పేదలను నమ్మించి ముంచిన ప్రభుత్వం చివరికి ఇప్పుడు ప్రజల ఇళ్లను కూడా వేలానికి తెచ్చింది. ఒక్క రూపాయికే ఇల్లు అంటూ గొప్పలు చెప్పుకున్న జగన్ సర్కార్.. వక్ర మార్గంలో వాళ్ళకు ఇప్పుడు లక్షలకు లక్షలు కట్టాలని నోటీసులు ఇచ్చింది. డబ్బులు కట్టకపోతే మీ ఇల్లు వేలం వేస్తామంటూ బ్యాంకు అధికారులు నోటీసులు ఇవ్వడంతో గగ్గోలు పెడుతున్న పేద బాధితులు బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. దీంతో పేదల ఇళ్ల పేరిట జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మరో భారీ మోసం బయటపడింది. బాధితుల తరపున ప్రతిపక్ష పార్టీల నేతలు బ్యాంకు అధికారులు, ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ఇప్పటికిప్పుడు లక్షలు తెచ్చి కట్టమంటే ఎక్కడి నుండి తెచ్చి కట్టాలని బాధితులు వాపోతున్నారు. ఇల్లు ఇచ్చినట్లే ఇచ్చి సీఎం జగన్ ఇంతటి మోసానికి ఒడిగడతాడని ఊహించలేదని బాధితులు సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఈ టిడ్కో ఇళ్ల పేరిట జగన్ ప్రభుత్వం చేసిన మోసం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది.

గత ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో పలు జిల్లాలలో టిడ్కో ఇళ్ల సముదాయాల నిర్మాణం చేపట్టారు. ఈ ఇళ్ళు ప్రభుత్వం నిర్మించినా అందులో ప్రజల భాగస్వామ్యం కూడా ఉంటుంది. కొంత మొత్తం లబ్ధిదారులు కడితే మిగతా మొత్తాన్ని ప్రభుత్వం భరించేలా ఈ గృహాల నిర్మాణం మొదలు పెట్టారు. పలు జిల్లాలలో 80 నుండి 90 శాతం గత ప్రభుత్వంలోనే నిర్మాణాలు పూర్తవగా.. మరికొన్ని వంద శాతం పూర్తయి లబ్దిదారులకు అందించడమే మిగిలింది. ఈ లోగా ఎన్నికలు ముంచుకొచ్చాయి. కాగా, ఎన్నికల సమయంలో లబ్ది దారుల భాగస్వామ్యం కూడా ప్రభుత్వమే చెల్లించేలా అన్ని పార్టీలు హామీలు ఇచ్చాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అయితే.. కేవలం ఒకే ఒక్క రూపాయితో టిడ్కో ఇళ్లను లబ్ది దారులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక అంతా రివర్స్ అయింది. 10 నుండి 20 శాతం పెండింగ్ ఉన్న గృహా సముదాయాల నిర్మాణాన్ని పూర్తిగా పక్కన పెట్టేసిన జగన్ ప్రభుత్వం నిర్మాణం పూర్తయిన గృహాలను రంగులు మార్చి మూడేళ్ళ తర్వాత లబ్ది దారులకు అందించారు. 

ముందుగా చెప్పినట్లే ఒక్క రూపాయికే లబ్ధిదారులకు అధికారులు ఇళ్లను అప్పగించారు. అంతకు ముందు ఈ ఇళ్ళు కేటాయించిన వారికే అధిక భాగం ఇళ్లను కేటాయించారు. ఇంత వరకూ అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఈ లబ్ది దారులకు బ్యాంకుల నుండి నోటీసులు అందాయి. మీ ఇంటి బాకీకి గాను ఏడాది నుండి ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయని.. ఏడాది కాలంగా ఉన్న ఈఎంఐలను ఇప్పటికిప్పుడు చెల్లించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులలో పేర్కొన్నారు. ఇదేంటి ప్రభుత్వం ఒక్క రూపాయికే ఇళ్ళు అప్పగిస్తే ఈ బ్యాంకు అధికారులేంటి ఇలా నోటీసులు ఇచ్చారని బ్యాంకుకు వెళ్తే అసలు విషయం బయటపడింది. ఒక్క రూపాయికే ఇళ్ళు ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఆ ఇళ్లను బ్యాంకులలో తాకట్టు పెట్టి లోన్ తీసుకుంది. ఆ లోన్ బకాయిలను లబ్దిదారులు కట్టేలా ఒప్పందం చేసుకుంది. ఈ బండారం బయటపడకుండా రెండేళ్ల పాటు లబ్ధిదారులను ఈఎంఐ అడగకుండా ఉండాలని బ్యాంకులను కోరింది. అప్పటికి ఎన్నికలు పూర్తవుతాయని ప్రభుత్వం భావించింది. కానీ, బ్యాంకు అధికారులు ఏడాదికే ఈఎంఐ చెల్లించాలని నోటీసులు ఇవ్వడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఇలాంటి వ్యవహారాన్ని టీడీపీ నేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వెలుగులోకి తీసుకొచ్చారు. పాలకొల్లులో జగన్ ప్రభుత్వం 59 మందికి గృహాలను మంజూరు చేసింది. అయితే ఇటీవల వారికి నోటీసులు అందాయి. దీంతో బాధితులు పరుగు పరుగున బ్యాంకుకు చేరుకున్నారు. రూపాయి కడితే చాలు ఇల్లు ఇస్తామని ఈ రోజు లక్షల రూపాయలు కట్టాలంటూ నోటీసులు ఇవ్వడం ఏంటని నిలదీశారు. అయితే, ప్రభుత్వం పేదల పేరుపై బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుందని.. అది కూడా నేరుగా లబ్ధిదారుడికి చేరకుండా ప్రభుత్వ ఖాతాకు వెళ్లిందని అధికారులు వివరణ ఇచ్చారు. లబ్ధిదారులు రెండేళ్ల తర్వాత ఈఎంఐ కడతారని ప్రభుత్వం చెప్పినా.. బ్యాంకులు ససేమీరా అంటూ గడువు సంవత్సరానికి కుదించి ఏడాది ఈఎంఐలను ఒకేసారి కట్టాలని నోటీసులు పంపించారు. దీంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఒక్కో గృహ లబ్ధిదారుడు రూ. లక్షల్లో డబ్బులు చెల్లించాలని లేదంటే ఇల్లు  వేలం వేస్తామని అధికారులు బెదిరిస్తున్నారు. ఫస్ట్ ఈఎంఐ నుంచి నోటీసులు ఇస్తే కట్టే వారమని, ఇప్పుడు నోటీసులు ఇస్తే లక్షలు ఒక్కసారే ఎలా కట్టాలని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు తమకు చెప్పకుండానే తమ సంతకాలు తీసుకొని తమ పేరుమీద  లోన్లు తీసుకోవడం ఏంటని బాధితులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.