
Mahua Moitra: పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా డబ్బులు తీసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ఆమెను పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ విచారించింది. ఇదిలా ఉంటే మహువా మోయిత్రాపై సీబీఐ విచారణ చేయాలని యాంటీ-కరప్షన్ ప్యానెల్ ఆదేశించిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ మహువా మోయిత్రాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై అవినీతి నిరోధక సంస్థ లోక్‌పాల్ సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినట్లు బీజేపీకి చెందిన ఎంపీ నిషికాంత్ దూబే ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ‘‘ నా ఫిర్యాదు ఆధారంగా జాతీయ భద్రత విషయంలో రాజీ పడిన మహువా మోయిత్రా అవినీతిపై లోక్‌పాల్ సీబీఐ విచారణకు ఆదేశించింది.’’ అంటూ ట్వీట్ చేశారు. ఇదే నిజమైతే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు అవుతుంది.
పార్లమెంట్‌లో అదానీకి వ్యతిరేకంగా ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని మహువా మోయిత్రా ప్రశ్నలు అడిగిందని, అందుకు గానూ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు, గిఫ్టులు తీసుకుందని నిషికాంత్ దూబే ఆరోపించారు. దీనిపై లోక్ సభ స్పీకర్‌కి లేఖ రాశారు. మరోవైపు మహువా తన పార్లమెంట్ లాగిన్ వివరాలను వేరే వారితో పంచుకోవడమే కాకుండా, దుబాయ్ నుంచి లాగిన్ అయిందని దీనిపై విచారణ జరపాలని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ కి లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ముందు ఓ అఫిడవిట్ సమర్పించారు. తన వద్ద నుంచి మహువా గిఫ్టులు తీసుకున్న మాట నిజమే అని అందులో ఒప్పుకున్నారు. ప్రధాని మోడీని, అదానీ గ్రూపును లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు అడిగిందని అందులో పేర్కొన్నారు. తనతో చేయకూడని పనులు చేయించుకుందని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై ఈ నెల2న పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ మహువా మోయిత్రాను విచారించింది. అయితే ఈ సమావేశంలో విపక్ష ఎంపీలు ఆమెకు మద్దతుగా నిలిచారు. ప్యానెల్ చైర్‌పర్సన్ ఆమెను అడగకూడని ప్రశ్నలు అడిగారని విపక్ష ఎంపీలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎంపీ నిషికాంత్ దూబే సీబీఐ విచారణ జరుగుతుందని ట్వీట్ చేయడంతో మరోసారి ఈ కేసు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
लोकपाल ने आज मेरे कम्प्लेन पर आरोपी सांसद महुआ जी के राष्ट्रीय सुरक्षा को गिरवी रखकर भ्रष्टाचार करने पर CBI inquiry का आदेश दिया
— Dr Nishikant Dubey (@nishikant_dubey) November 8, 2023