
CBN Cases: టీడీపీ అధినేత చంద్రబాబుపై వరుసగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.. ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు.. ఇలా వివిధ కోర్టుల్లో చంద్రబాబు పిటిషన్లపై విచారణ సాగుతూనే ఉంది.. అయితే, తాజాగా చంద్రబాబుపై ఉచిత ఇసుక విధానంలో విషయంలోనూ కేసు నమోదు అయిన విషయం విదితమే.. ఇక, ఆ పాలసీ ద్వారా రాష్ట్ర ఖజానాకు చంద్రబాబు నష్టం కలిగించాడని సీఐడీ అభియోగాలు మోపింది.. అయితే, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు.. ఆ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు.
మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ పిటిషన్ పై విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. పీటీ వారెంట్ పై విచారణ ను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఈ నెల 28 వరకు హైకోర్టుకు పొడించటంతో ఈ నెల 29వ తేదీ వరకు తదుపరి విచారణ వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. కాగా, గత ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. కానీ, రాజకీయ కార్యకలాపాలకు తనను దూరంగా ఉంచాలని, న్యాయవిచారణ ప్రక్రియలో మునిగిపోయేలా చేయాలని, వేధించాలన్న ఏకైక ఉద్దేశంతో ఈ కేసు నమోదు చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ నెల 20వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఉచితంగా ఇసుకను ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 1,300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది.. ఇసుక పాలసీపై కేబినెట్ లో చర్చించలేదని పేర్కొంది. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమా పేర్లను సీఐడీ చేర్చిన విషయం విదితమే.