Leading News Portal in Telugu

దిశ యాప్.. దిశ ఏంటి?.. బలవంతపు డౌన్లోడ్ల మర్మమేంటి? | disha app compulsary down loads| otp| store| lokesh


posted on Nov 8, 2023 3:59PM

ఏపీలో దిశ యాప్ పేరిట మరో దుమారం రేగుతుంది. మహిళల రక్షణ కోసం అంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ దిశ చట్టానికి చట్టబద్దత లేదని ఎప్పుడో తేలిపోగా.. దిశా పోలీస్ స్టేషన్లు, దిశ యాప్ అంటూ ప్రభుత్వం హడావుడి మాత్రం ఆగలేదు. అసలు ఈ దిశ పోలీస్ స్టేషన్లు ఎక్కడో ఉన్నాయో.. దిశ పోలీసులు ఎలా పనిచేస్తున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు కానీ.. దిశ యాప్ ను ప్రజల మొబైల్ ఫోన్లలో బలవంతంగా ఇన్ స్టాల్ చేయిస్తున్నారు. మగాళ్ల ఫోన్లలో కూడా దిశా యాప్ ఇన్ స్టాల్ చేయాలంటూ పోలీసులతో బలవంతంగా హింస పెడుతున్నారు. దిశ యాప్ మాకెందుకు అంటే పోలీసులు ప్రజలపై దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి ఘటనే అనకాపల్లిలో చోటు చేసుకుంది. ఓ సైనికోద్యోగి దేశసరిహద్దు నుండి సొంత గ్రామానికి వెళ్తుండగా అనకాపల్లి పోలీసులు అతని మొబైల్ లో దిశ యాప్ ఇన్ స్టాల్ చేయమని బలవంతం చేశారు. అతను ససేమీరా అనడంతో నలుగురు పోలీసులు కలిసి అతన్ని చితకబాదారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. దిశ యాప్ ఇంత బలవంతంగా ఇన్ స్టాల్ చేయించడం వెనక మరేదైనా కారణాలున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సయ్యద్ అలీముల్లా అనే వ్యక్తి దువ్వాడలో సెక్టార్ 10లో నివసిస్తూ జమ్మూ కాశ్మీర్ లో 52 రాష్ట్రీయ రైఫిల్ క్యాంప్ సోల్జర్ గా పనిచేస్తున్నాడు. సెలవుపై వచ్చిన ఆయన సొంతూరు ఎలమంచిలి మండలం రేగుపాలెం వెళ్లేందుకు పరవాడ సంతబయల బస్టాప్ లో వేచి ఉన్నాడు. ఆయన వద్దకెళ్లిన ఓ మహిళా కానిస్టేబుల్‌ అతని ఫోన్‌ లో దిశ యాప్ ఇన్ స్టాల్ చేయాలని కోరింది. అతను తనకు అవసరం లేదని చెప్పడంతో మహిళ కానిస్టేబుల్ బలవంతంగా అతని నుండి ఫోన్ తీసుకొని దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసింది. అంతలో అతను అనుమానించి అసలు మీరు పోలీసులేనా ఐడీ కార్డు చూపించండి.. నేమ్ ప్లేట్ లేదు మీ పేరేంటని అడుగగా ఆమె ఫోన్ వెనక్కి ఇచ్చేసింది. అంతలో ఫోన్‌కొచ్చిన వన్‌టైం పాస్‌వర్డ్ చెప్పాలని కానిస్టేబుల్‌ కోరడంతో అతను ససేమిరా అన్నాడు. పాస్‌వర్డ్‌ను తానే ఎంటర్‌ చేస్తానని కానిస్టేబుల్ చేతిలోని ట్యాబ్ ఇవ్వాలని కోరాడు. దీంతో ఆగ్రహించిన మహిళా కానిస్టేబుల్‌ అతడిపై చేయి చేసుకుంది.

దీంతో నిర్ఘాంతపోయిన సైనికుడు దేశ సరిహద్దు కాశ్మీర్లో పనిచేసే తనకు దిశ యాప్ ఎందుకని ఎదురు తిరిగి ప్రశ్నించాడు. స్థానికులు కూడా ఆయనకు సపోర్ట్‌ చేయడంతో మహిళా కానిస్టేబుల్ తో పాటు వచ్చిన మరో కానిస్టేబుల్‌ స్టేషన్ కి ఫోన్ చేశాడు. నలుగురు సిబ్బంది హుటాహుటిన అక్కడకు అటోలో చేరుకుని సైనికుడిపై దాడికి దిగారు. చుట్టుపక్కల ప్రజలు వారించినా వినకుండా అతని చేతులు కాళ్ళు విరిచి ఆటో ఎక్కించే ప్రయత్నం చేశారు. దేశ సరిహద్దులో యుద్ధం చేసే సైనికుడు కదా పోలీసుల ఆటలు సాగలేదు. మరోవైపు చుట్టూ ప్రజలు కూడా అతనికి మద్దతుగా నిలిచారు. మగాళ్ల ఫోన్ లో దిశాయాప్ ఎందుకని, పోలీసులైనా ఓటీపీ చెప్పాల్సిన అవసరం లేదంటూ స్థానికులు వాదించినా మహిళా కానిస్టేబుల్ మా ఇష్టం అనే రీతిలో స్పందించింది. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతుండగా.. సీపీ ఇప్పటికే ఆ నలుగురు కానిస్టేబుళ్లను వీఆర్ కు పంపినట్లు ప్రకటించారు. అయితే, అసలు ఇంత బలవంతంగా దిశ యాప్ ఇన్ స్టాల్ చేయించడం, మగాళ్ల ఫోన్లలో కూడా ఇన్ స్టాల్ చేయాలని బలవంతం చేయడం, ఓటీపీలు స్టోర్ చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై స్పందించిన తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోందని సందేహం వ్యక్తం చేశారు. పురుషుల మొబైల్స్ లో ఆ యాప్ ను బలవంతంగా డౌన్ లోడ్ చేయించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. జగనాసుర పాలనలో రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని.. ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టానికే దిక్కూ మొక్కూ లేదు.. మహిళల భద్రత కోసమని తెచ్చిన దిశ యాప్ ను బలవంతంగా డౌన్ లోడ్ చేయించడమేంటని ప్రశ్నించారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టే సైనికుడు రాష్ట్రానికి వస్తే ఆయన ప్రాణానికే రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. పోలీసులే గుండాల్లాగా దాడులు చేయడం ఏంటని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ ఆరోపణల తర్వాత రాజకీయ వర్గాలలో ఇది చర్చగా మారింది. ఇప్పటికే పలు మార్గాల ద్వారా వైసీపీ సర్కార్ ప్రజల డేటాను స్టోర్ చేసుకుంటుందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ దిశ యాప్ కూడా అందులో మరొకటిగా మారిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.