జగన్‌కు మరో బిగ్ షాక్.. అక్రమాస్తుల కేసులో తెలంగాణ హైకోర్టు నోటీసులు! | big shock to jagan| telangana| high| court| notice| iassets| case| hariramajogayya
posted on Nov 8, 2023 1:35PM
సరిగ్గా ఎన్నికలకు ముందు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అక్రమాస్తుల కేసు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. 16 నెలల జైలు తర్వాత బెయిల్ మీద విడుదలైన జగన్.. పదేళ్లుగా లాగోలా కేసు విచారణ నుండి తప్పించుకుంటూ వస్తున్నారు. కానీ, ఇప్పుడు ఎన్నికల ముంగిట ఈ కేసులో కదలిక వచ్చి ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులపై ఇప్పటికే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ హైదరాబాద్ (తెలంగాణ)నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణం రాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పైన సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటి వరకూ 3,041 సార్లు వాయిదా పడ్డాయని, ఈ కేసులో విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలని రఘురామ కోరారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని, కేసుల విచారణ బదిలీ పిటిషన్ ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని సీబీఐని ఆదేశించింది. అలాగే సీఎం జగన్ కు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది.
ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ ఆధారంగా వచ్చే ఏడాది ఎన్నికల సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులు విచారణకు వస్తాయా అన్న చర్చ జరుగుతుండగానే.. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కూడా జగన్ కు షాక్ ఇచ్చింది. జగన్ ఆస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్ పై విచారణకు ఆదేశించింది. తెలంగాణ ఛీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్ వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారణ పిల్‌గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై విచారణకు స్వీకరించింది. హరిరామ జోగయ్య పిల్ లో సవరణలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. హరిరామ జోగయ్య తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో ఏకీభవించి ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు అంగీకారం తెలిపింది. అంతేకాదు, హరి రామ జోగయ్య పిల్ కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశించిన హైకోర్టు.. ప్రతివాదులు జగన్ మోహన్ రెడ్డి, సీబీఐకి నోటీసులు ఇచ్చింది.
సీబీఐ కోర్టులో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని కోరుతూ హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కనుక ఆయనపై అక్రమాస్తుల కేసులు పెండింగ్ లో ఉండకూడదని, జగన్‌పై నమోదైన సీబీఐ, ఈడీ కేసులను 2024 ఎన్నికల్లోగా తేల్చేలా ఆదేశాలివ్వాలని హరిరామ జోగయ్య పిల్ లో కోరారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం కింద జోగయ్య లాయర్ ఈ పిల్ దాఖలు చేశారు. అయితే ఈ పిల్లో ప్రజాప్రయోజనం లేదని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం ఛేయగా ధర్మాసనం విచారణ జరిపింది. అఫిడవిట్‌ను సవరించాలని జోగయ్యను ఆదేశించిన తెలంగాణ హైకోర్టు.. దీని కోసం రెండు వారాల గడువు కూడా ఇచ్చింది. ఈ గడువులోగా డాక్యుమెంట్లపై వివరణతో అఫిడవిట్‌ను సవరించి కేసుల స్థాయి వివరాలను స్పష్టంగా ప్రస్తావించాలని కోర్టు ఆదేశించింది. విచారణలో భాగంగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు ధర్మాసనం.. జోగయ్య పిల్ కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశించింది.
ఇప్పటికే సుప్రీంకోర్టులో ఇదే అక్రమాస్తుల కేసులో జగన్ కు నోటీసులు అందగా.. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని నోటీసులు జారీ చేసింది. దీనిపై వైసీపీ స్పందన ఏమిటన్నది వెంటనే తెలియరాలేదు. అయితే తెలుగురాష్ట్రాలలో ఇప్పుడు జగన్ అక్రమాస్తుల కేసులో కదలికపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. కోర్టులు కూడా జగన్ కేసుల విచారణపై దృష్టి సారించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఎన్నికల సమయంలో ప్రతి వారం కోర్టు విచారణకు హాజరవ్వాల్సి రావడం జగన్ కు కచ్చితంగా ఇబ్బంది కలిగించే అంశమే అవుతుందనడంలో సందేహం లేదు. ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని హైలెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం ఖాయం. అసలే చంద్రబాబు అక్రమ అరెస్ట్ తర్వాత ప్రజలలో సహజంగానే జగన్ కేసులపై చర్చ జరుగుతున్నది. ఇప్పుడు ఆ కేసుల విచారణ కూడా ప్రారంభమైతే జగన్ ఇమేజ్ పాతాళానికి పడిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.