
Buffalo Scam: ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పాలవెల్లువపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. ఏపీలోని బఫెలో స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక, నవంబర్ 14వ తేదీ నుంచి రోజుకో స్కామ్‌ను ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు.. నా అక్కలు.. చెల్లమ్మలంటూనే జగన్ ప్రభుత్వం మోసం చేస్తోంది. జగనన్న పాల వెల్లువ కాదు.. పాపాల వెల్లువ అని స్పష్టంగా చెప్పాం. జగనన్న పాల వెల్లువ పేరుతో దోపిడీ జరిగింది. జగన్ పాల వెల్లువ.. జగనన్న చేయూత చక్కగా అమలైతే రూ. 14500 కోట్లు మహిళలకు చేరేవి. మా విమర్శలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదు.. కానీ, పార్టీ పరంగా వైసీపీ మాత్రం కౌంటర్ ఇచ్చిందని మండిపడ్డారు.
బ్యాంకులు రుణాలిస్తాయి.. మేం సబ్సిడీ ఇవ్వడం లేదనేది వైసీపీ వాదన. 3.94 లక్షల పాడి పశువుల కోసం రూ. 2350 కోట్లు ఖర్చు పెట్టామని వైసీపీ కౌంటర్ ఇచ్చింది. పశువుల కొనుగోళ్ల నిమిత్తం బ్యాంకులు లోన్లు ఇస్తే.. ఆ వివరాలు వెల్లడించాలి కదా? అని నిలదీశారు నాదెండ్ల.. పాడి పశువులను రీ-సైకిలింగ్ చేశారని ఎస్ఎల్బీసీ సమావేశంలో ప్రభుత్వమే చెప్పింది. 8 వేల పాడి పశువులను మాత్రమే కొనుగోలు చేసి.. వాటినే రీ-సైక్లింగ్ చేస్తూ లక్షల సంఖ్యలో కొనుగోళ్లు చేసినట్టు చూపారు. 3.94 లక్షల పశువులు కొనుగోలు చేసి ఉంటే ప్రభుత్వం ఆ లబ్ధిదారుల వివరాలు ఇవ్వగలదా..? అని సవాల్ చేశారు.
మేం పాడి పశువుల కొనుగోళ్లకు లోన్లు ఇచ్చేదే లేదని బ్యాంకర్లు చెప్పారు. 3.94 లక్షల పశువులు కొనుగోలు చేసి ఉంటే ప్రభుత్వం చేసే పాల సేకరణ సుమారు 14 లక్షల లీటర్లుగా ఉండేది. కానీ, కేవలం 2 లక్షల లీటర్ల మాత్రమే పాలను సేకరిస్తున్నారని దుయ్యబట్టారు మనోహర్.. బఫెలో స్కాంలో బ్యాంకర్ల నుంచి కూడా నిజాలు రావాల్సి ఉంది కాబట్టి.. సీబీఐ విచారణ చేయాలి. లబ్దిదారులను గుర్తించి పశువుల కొనుగోళ్ల కోసం కేబినెట్ ఆమోదంతో నిధులు విడుదల చేశారు.. కానీ, దాదాపు 4 లక్షల పశువుల కోసం డబ్బులు ఖర్చు పెట్టి ఉంటే.. ఆ వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదు? అని సవాల్ విసిరారు.. ఇక, నవంబర్ 14వ తేదీ తర్వాత వరుసగా ఈ ప్రభుత్వం చేసిన స్కాంల వివరాలని రోజుకోకటి చొప్పున వివరిస్తామని ప్రకటించారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.