Leading News Portal in Telugu

కిషన్ రెడ్డి ఇరుక్కున్నట్లేనా.. కాళేశ్వరం అవినీతిపై బీజేపీ విమర్శలకే పరిమితమా? | bjp limis only criticize| secret| bond| kaleswaram| corruption| kishan


posted on Nov 9, 2023 11:08AM

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి కాళేశ్వరంపై చేసిన వ్యాఖ్యలకు ఊహించని విధంగా గట్టి రాటార్డ్ వచ్చింది.  కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణకు సీఎం కేసీఆర్‌ ముందుకు వచ్చి లేఖ రాస్తే.. తాను రెండుగంటల్లో సీబీఐ విచారణ చేయిస్తానని కిషన్ రెడ్డి  చెప్పారు. అలా చెప్పడం ద్వారా  కేంద్రం నేరుగా కాళేశ్వరం అవినీతిపై చేయగలిగిందేమీ లేదని అంగీకరించేసినట్లైంది. అయితే  సీబీఐ మాజీ డెరెక్టర్ నాగేశ్వరరావు కిషన్ రెడ్డి తప్పించుకోవడానికే ఇలా చెప్పారని కుండబద్దలు కొట్టేశారు. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య బంధాలు ఉన్నాయనీ, అవి పరస్పరం సహకారం అందించుకుంటున్నాయనీ ఇంత కాలం ఉన్న అనుమానాలను బలపరిచే విధంగా నాగేశ్వరరావు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై దర్యాప్తునకు కేసీఆర్ లేఖ అవసరం లేదంటూ ఆయన విస్పష్టంగా తేల్చేశారు.  కాళేశ్వరంపై సీబీఐ విచారణకు  తెలంగాణ సీఎం కేసీఆర్‌ అనుమతి అవసరం లేదనీ, ఆ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చింది కేంద్రానికి చెందిన సంస్థలేననీ, అది కూడా ఒకటీ రెండూ కాదు ఏకంగా పది ఏజెన్సీలు అనుమతులు మంజూరు చేశాయనీ నాగేశ్వరరావు తెలిపారు. కాళేశ్వరం అవినీతిపై కేంద్ర జలవనరుల శాఖ సీబీఐకి ఫిర్యాదు చేస్తే చాలనీ, సీబీఐ దర్యాప్తు ప్రారంభించేయొచ్చనీ స్పష్టం చేశారు.  

దీంతో కేంద్రం కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్ పై, ఆయన ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమౌతుంది తప్ప సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి..నిగ్గు తేల్చే ఉద్దేశంలో లేదని స్పష్టమైపోయింది.  దీంతో  కేసీఆర్ లేఖ రాస్తే తప్ప సీబీఐ దర్యాప్తు కోరలేమంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఆయనను చిక్కుల్లో పడేసినట్లైంది. కేంద్ర మంత్రిగా కేసీఆర్ లేఖ కోసం ఎదురు చూడకుండా ఆయన కేంద్ర జలశక్తి శాఖ  ద్వారా సీబీఐకి లేఖ రాయించడమో, ఫిర్యాదు  చేయడమో ఎందుకు చేయడం లేదన్న ప్రశ్న ఉత్పన్నమైంది.  ఈ ప్రశ్నే బీజేపీ, బీఆర్ఎస్ రహస్య బంధాన్ని బట్టబయలు చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఎన్నికల వేళ ఈ పరిస్థితి కచ్చితంగా కిషన్ రెడ్డికే కాదు, బీజేపీకి కూడా ఇబ్బందికరమే. దీంతో కిషన్ రెడ్డి ఏం చేస్తారన్న ఆశక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు కాళేశ్వరం అవినీతిపై ఏయే సెక్షన్ల కింద రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సిందో వివరంగా వెల్లడించిన తరువాత కూడా మీనమేషాలు లెక్కిస్తే.. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీల బండారం బయటపడిపోవడమే కాకుండా ఆ రెండు పార్టీల ప్రతిష్ట మసకబారడం ఖాయం అన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. మద్యం లిక్కర్ కేసులో ఆప్ నాయకుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను జైలుకు పంపడానికి ఇసుమంతైన సంకోచించని కేంద్ర దర్యాప్తు సంస్థలు కవిత విషయంలో ఎందుకు వెనక్కు తగ్గాయో కూడా కాళేశ్వరం అవినీతిపై సీబీఐ దర్యాప్తు విషయంలో చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైనట్లేనన్న విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి.  

కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లిన బృందానికి కిషన్‌రెడ్డి నాయకత్వం వహించారు. మేడిగడ్డ కుంగుబాటును పరిశీలించారు.   అవినీతిపై ఆరోపణలు గుప్పించారు.  అయినా  సీబీఐ విచారణకు మాత్రం అవినీతికి పాల్పడ్డారని తాము ఆరోపిస్తున్న కేసీఆర్ అనుమతి కావాలనడమేమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్‌ఎస్‌కు బీజేపీ బీ టీము కాబట్టే లిక్కరు కేసులో కవితను ఇప్పటిదాకా అరెస్టు చేయలేదని , ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని   ఆరోపిస్తూ కూడా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం లేదనీ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.  ఈ పరిస్థితుల్లో సీబీఐ మాజీ డైరెక్టర్ కాళేశ్వరంపై దర్యాప్తునకు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమతి అవసరం లేదని సెక్షన్లతో సహా చెప్పిన తరువాత కిషన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమౌతోంది.