Leading News Portal in Telugu

Chandrababu: ఇసుక స్కామ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్


Chandrababu: ఇసుక స్కామ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్

టీడీపీ అధినేత, మజీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇసుక పంపిణీలో అక్రమాలు జరిగాయని సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక విధానం వల్ల ఏపీ ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందనే ఆరోపణతో తనపై సీఐడీ కేసు నమోదు చేసిందని చంద్రబాబు అన్నారు.

అయితే, తననను పొలిటికల్ గా దెబ్బ తీసేందుకు వరుస కేసులు పెడుతున్నారని పిటిషన్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదులో చోటు చేసుకున్న ఆలస్యానికి తప్పుడు కారణాలు చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉచిత ఇసుక విధానం ద్వారా ఏ ప్రైవేటు సంస్థ లబ్ధి పొందిందో ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడించలేదని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికార విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌ ను పరిశీలిస్తే తెలుస్తుంది.. ఈ నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం ఉందని తెలిపారు.

వైసీపీ పాలనలో ఇసుక అక్రమాలు, అవినీతిపై గళమెత్తుతున్నామని తమపై అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకూ తనను జ్యుడిషియల్‌ కస్టడీలో ఉంచాలని జగన్ ప్రభుత్వం చూస్తోందని చంద్రబాబు పిటిషన్‌లో పేర్కొన్నారు. అధికార పార్టీ చెప్పినట్లే ఏపీ సీఐడీ అధికారులు నడుస్తున్నారని ఆయన అన్నారు. ఇక, ఇసుక కేసులోనూ అక్టోబరు 3న ప్రాథమిక విచారణ ప్రారంభించినా.. వివరాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నం చేయలేదు అని చంద్రబాబు అన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు కోరారు.