Leading News Portal in Telugu

Semifinal Match 2023: భారత్ vs న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్.. 2019 ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం!


Semifinal Match 2023: భారత్ vs న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్.. 2019 ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం!

IND vs NZ World Cup 2023 Semifinal: శ్రీలంకపై భారీ విజయం సాధించిన న్యూజిలాండ్‌.. నాకౌట్‌ చేరేందుకు మార్గం సుగమం చేసుకుంది. వన్డే ప్రపంచకప్ 2023లో భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే సెమీస్ బెర్తులు ఖరారు చేసుకోగా.. నాలుగో జట్టుగా కివీస్‌ ఆడనుంది. భారత్‌తో సెమీస్‌లో న్యూజిలాండ్‌ తలపడటం ఖాయమే అయింది. ఎందుకంటే పాకిస్థాన్‌ నాకౌట్‌లో అడుగుపెట్టాలంటే.. మహా అద్భుతమే జరగాలి. పాక్ సంచలనం కాదు.. అంతకుమించిన విజయాన్ని లంకపై అందుకోవాలి. దాదాపుగా ఇది జరిగే పని కాదు కాబట్టి మొదటి సెమీస్‌లో భారత్ vs న్యూజిలాండ్ తలపడనున్నాయి. 2019 ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇప్పుడు భారత్ ముందుంది.

ప్రపంచకప్‌ 2019లో భాగంగా జులై 10న మాంచెస్టర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ సెమీస్ ఆడింది. లీగ్‌ దశలో వరుస విజయాలతో సెమీస్‌ చేరిన భారత్.. న్యూజిలాండ్‌ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కివీస్ బ్యాటింగ్‌ ఎంచుకుంది. వరుణుడు అడ్డంకిగా మారిన ఆ మ్యాచ్‌ రెండు రోజులు జరగ్గా.. తొలి రోజు కివీస్ 46.1 ఓవర్లలో 211/5 స్కోర్ చేసింది. మరుసటి రోజు మిగిలిన ఓవర్లు పూర్తి చేసిన కివీస్.. 8 వికెట్ల నష్టానికి 239 రన్స్ చేసింది. కేన్ విలియమ్సన్‌ (67), రాస్‌ టేలర్‌ (74) టాప్ స్కోరర్లు. భారత బౌలర్ భువనేశ్వర్‌ 3 వికెట్లు వికెట్స్ పడగొట్టాడు.

మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కివీస్ పేసర్ల ధాటికి టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. కేఎల్ రాహుల్ (1), రోహిత్ శర్మ (1), విరాట్ కోహ్లీ (1), దినేష్ కార్తీక్ (6) త్వరగానే పెవిలియన్ చేరారు. క్లిష్ట స్థితిలో క్రీజులోకి వచ్చిన ఎంఎస్ ధోనీ (50).. హార్దిక్ పాండ్యా (32)తో కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఆపై రవీంద్ర జడేజా (77)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ధోనీ-జడేజా భాగస్వామ్యంతో (116) విజయంపై ఆశలు రేకెత్తాయి. భారత్ విజయం లాంఛనమే అనుకున్న సమయంలో భారీ షాట్‌ ఆడబోయిన జడేజా క్యాచ్ ఔట్ అయ్యాడు. భారత్ విజయానికి 12 బంతుల్లో 31 పరుగులు అవసరం అయ్యాయి. లుకీ ఫెర్గుసన్ వేసిన 49 ఓవర్ మూడో బంతికి మార్టిన్‌ గప్తిల్‌ విసిరిన త్రోకు మహీ బలయ్యాడు. దాంతో భారత్ ఆశలు గల్లంతయ్యాయి.

ఎంఎస్ ధోనీ అనూహ్యంగా రనౌట్‌ కావడంతో అప్పటి కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మతో సహా టీమిండియా క్రికెటర్లందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కోట్లాది మంది భారత అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇప్పుడీ కన్నీళ్లకు బదులు తీర్చుకునే అవకాశం భారత జట్టుముందుంది. ప్రపంచకప్‌ 2023లో భాగంగా సెమీస్‌ పోరులో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడడం లాంఛనమే అయింది. ఈ మ్యాచ్‌లో గెలిచి 2019 ప్రపంచకప్‌ పరాభవానికి బదులు తీర్చుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. భారత్ ఫామ్ చూస్తే విజయం ఖాయమే అనిపిస్తోంది.