Leading News Portal in Telugu

కారు పార్టీ అధినేతకు కారే లేదు.. కేసీఆర్ ఆస్తులివే! | kcr dont have a car| brs| president| land| combined| asset| deposits| double


posted on Nov 10, 2023 9:00AM

తెలంగాణ ముఖ్యమంత్రి, ఎన్నికల గుర్తే కారుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సొంత కారు కూడా లేదు. ఈ విషయం ఆయన తాజాగా సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. తమది వ్యవసాయ కుటుంబం అనీ, తాను రైతుననీ, తన ఫామ్ హౌస్ లో సాగు చేసి కోట్ల ఆదాయం సంపాదించాననీ చెప్పుకున్న ఆయన పేరు మీద సెంటు భూమి కూడా లేదు. ఇది కూడా ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ పేర్కొంది.  

ఉన్న భూములన్నీ కుటుంబ ఉమ్మడి ఆస్తులుగానే ఉన్నాయని ఆయన అఫిడవిట్ లో పేర్కొన్నారు. అయితే గడచిన ఐదేళ్లలో కేసీఆర్ బ్యాంకు డిపాజిట్లు మాత్రం రెట్టింపయ్యాయి.  2018 డిసెంబరు అంటే గత ఎన్నికల సమయానికి ఆయనకు బ్యాంకులో ఉన్న డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలు కలిపి మొత్తం 5 కోట్ల 63 లక్షల రూపాయలు ఉంటే.. ఇప్పుడు అంటే 2023 నవంబర్ నాటికి  బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ కలిపి   రూ. 11.16 కోట్లకు పెరిగాయి. ఇక ఆయన సతీమణి  శోభ కు గతంలో  సుమారు రూ.94 వేలు ఉన్న డిపాజిట్లు ఇప్పుడు  రూ. 6.29 కోట్లకు పెరిగాయి. ఇక బంగారు ఆభరణాలు  2.8 కిలోలు ఉన్నట్లు తాజాగా సమర్పించిన అఫిడవిట్‌లో కేసీఆర్ పేర్కొన్నారు.

తాను పెదకాపుననీ, రైతుననీ, వ్యవసాయం చేస్తున్నాననీ చెప్పే కేసీఆర్ పేరు మీద సెంటు భూమి కూడా లేదు. ఉన్నదంతా కుటుంబ ఉమ్మడి ఆస్తే.. అయితే  ఇటీవల అంటే ఈ ఏడాది జూలైలో   మర్కూక్ మండలం వెంకటాపురం గ్రామంలో  పది ఎకరాల సాగుభూమిని కేసీఆర్ కొన్నారు. దీని విలువ సుమారు రూ. 28.47 లక్షలుగా అఫిడవిట్ లో పేర్కొన్నారు. స్థిర, చరాస్తుల రూపంలో కేసీఆర్‌కు రూ. 17.83 కోట్లు, 9.67 కోట్ల చొప్పున ఉంటే ఆయన భార్య పేరు మీద 7.78 కోట్ల చరాస్తులు మాత్రమేఉన్నాయి. ఉమ్మడి ఆస్తిగా రూ. 9.81 కోట్ల మేర చరాస్తులు ఉన్నాయి. ఇక అప్పుల విషయం చూస్తే కేసీఆర్ పేరు మీద రూ. 17.27 కోట్లు, కుటుంబం పేరు మీద రూ. 7.23 కోట్ల మేర ఉన్నాయి.

సొంతంగా కారు, బైక్ లేకపోయినా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జేసీబీ తదితర 14 వాహనాలున్నాయి. వీటి విలువ రూ. 1.16 కోట్లుగా తేలింది. మొత్తంగా కేసీఆర్ కుటుంబానికి 53.30 ఎకరాల సాగుభూములు, 9.36 ఎకరాల మేర వ్యవసాయేతర భూములున్నాయిని ఆయన తన తాజా అఫిడవిట్ లో పేర్కొన్నారు.