posted on Nov 11, 2023 10:12AM
టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు చంద్రమోహన్ శనివారం (నబంబర్ 11) కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్ హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
1966లో రంగులరాట్నం చిత్రం ద్వారా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తరువాత ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు. ఆయన నటనకు గాను రెంుడ ఫిల్మ్ ఫేర్ అవార్డులు, ఆరు నందులు అందుకున్నారు. ఏ కొత్త హీరోయిన్ అయినా తొలుత చంద్రమోహన్ సరసన నటిస్తే ఆమెకు ఇక తిరుగుండదనీ అగ్ర హీరోయిన్ గా దూసుకుపోతారన్న నమ్మకం చిత్రపరిశ్రమలో ఉండేది.
ఏ పాత్రనైనా సునాయాసంగా నటించి మెప్పించగలిగిన ప్రతిభ చంద్రమోహన్ సొంతం. పదహారేళ్ల వయస్సు, ప్రాణం ఖరీదు వంటి చిత్రాలలో ఆయన నటన అనితర సాధ్యం అన్నట్లు ఉంటుంది. చంద్రమోహన్ స్వస్థలం ఉమ్మడి కృష్ణా జిల్లా పమిడిముక్కల. 1943లో జన్మించిన ఆయన తన ఐదున్నర దశాబ్దాల నట జీవితంలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మొత్తం 932 చిత్రాలలో నటించారు.