ఏపీ పొమ్మంటే.. మేము రమ్మన్నాం..జగన్ పాలనపై కేటీఆర్ మరో బాంబ్! | ktr another comment on jagan rule| welcome| industries| telangana| ap| send
posted on Nov 13, 2023 6:31AM
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏపీలో బూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి అన్నది కానరావడం లేదు. నాలుగేళ్లుగా ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు, మేధావులు మొత్తుకున్నా వైసీపీ నేతలు మాటలతోనే అందరినీ బెదరగొట్టేస్తూ పబ్బం గడుపుకున్నారు. పైగా రాష్ట్రంలో ఉన్న పాత కంపెనీలను రకరకాల వేధింపులతో రాష్ట్రం నుండి వెళ్లగొట్టారు. ఫలితంగా నిరుద్యోగం పెరిగి యువత వలస బాట పట్టారు. పారిశ్రామిక, ఉత్పత్తి రంగాలు దివాళా తీసి రాష్ట్రం ఆర్ధికంగా దిగజారి, దివాళా స్థాయికి చేరుకుంది. కానీ, ఇవేవీ పట్టని ప్రభుత్వం తలకి ఇంత ఇచ్చాం రోడ్లు, కంపెనీలు, అభివృద్ధి లాంటివి ఎందుకు అడుగుతున్నారంటూ ప్రజలనే ఎదురు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల సమయం కావడంతో పక్క రాష్ట్రాల నేతలు కూడా ఏపీ అభివృద్ధి గురించి.. జగన్ మోహన్ రెడ్డి పాలన గురించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. పరువు గంగలో కలిపేస్తున్నారు. అయినా వైసీపీ నేతల నుండి మాత్రం ఉలుకూ పలుకూ ఉండటం లేదు.
ఇప్పటికే ఏపీపై తెలంగాణలో అధికార బీఆర్ఎస్ నేతలు రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రోడ్లెక్కితే మంచాన పడుడే, తెలంగాణలో ఎకరం అమ్మితే ఇప్పుడు ఆంధ్రాలో యాభై ఎకరాలు కొనొచ్చు, పాలన చేతకాదన్న వాళ్ళే ఇప్పుడు దివాళా తీశారు, తెలంగాణ విడిపోతే చీకటైతది అంటే ఇప్పుడు ఏపీనే అంధకారమైంది, ఏపీలో పనితనం లేదు, పగతనం ఉంది అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ నుండి మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ సమయం సందర్భంతో పని లేకుండా సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనను అవహేళన చేస్తూనే ఉన్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ మరోసారి ఏపీ ప్రభుత్వం, జగన్ మోహన్ రెడ్డి పాలన, ఏపీలో పరిస్థితుల గురించి పూసగుచ్చినట్లు వివరించారు. ఎన్నికల నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఏపీలో ఉండలేమని భావిస్తున్నవారికి తెలంగాణ ఫస్ట్ ఎట్రాక్షన్ గా మారింది. పరిశ్రమలకు కూడా అంతేనని.. ఏపీలో ఉండలేక పరిశ్రమలు కూడా తెలంగాణకి వచ్చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.
అమర్ రాజా బ్యాటరీస్ ఎంతటి ప్రతిష్టాత్మక సంస్థనో అందరికీ తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉండే ఈ సంస్థ దశాబ్దాలుగా ప్రత్యక్షంగా వేల మందికి, పరోక్షంగా లక్షల మందికి ఉపాధినిస్తున్నది. సంస్థకు వచ్చే లాభాలలో కూడా ప్రజల కోసం పలు కార్యక్రమాలు చేపడుతుంది. పూర్తిగా విదేశీ టెక్నాలజీలోకి రూపాంతరం చెందిన ఈ కంపెనీ ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతాయి. అలాంటి కంపెనీని వైసీపీ ప్రభుత్వం తీవ్ర వేధింపులకు గురి చేసింది. దీంతో ఈ కంపెనీ ఇక రాష్ట్రంలో ఉండలేమని పొరుగు రాష్ట్రాలకు వెళ్లేందుకు నిర్ణయించుకుంది. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం వారికి సాదరంగా ఆహ్వానం పలికింది. 9500 కోట్ల రూపాయల దశలవారీ పెట్టుబడితో తెలంగాణలో సంస్థను ఏర్పాటు చేసింది. ఈ విషయం అప్పట్లోనే సంచలనంగా మారి.. రాజకీయ దుమారానికి కూడా దారి తీసింది. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ కు తాజాగా ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన కేటీఆర్.. ఏపీలో పెట్టుబడి దారులకు సమస్యలు తలెత్తున్నాయని.. అక్కడ ఉండలేని పరిస్థితిలో.. తొలి గమ్యస్థానం తెలంగాణగా మారిందని చెప్పారు. అలాగే అమరరాజా కంపెనీ కూడా తెలంగాణకు మార్చుకున్నారని చెప్పుకొచ్చారు.
అంతేకాదు, ఏపీ వద్దంది.. మేము రమ్మన్నాం.. మేం కూడా వదిలేస్తే.. ఆయన బెంగళూరుకో.. చెన్నైకో వెళ్లిపోతారు. అందుకే మేం ఆహ్వానించాం.. ఇందులో తప్పేంటి? అని కేటీఆర్ అన్నారు. ఈ వ్యాఖ్యలు చాలు అమర్ రాజా సంస్థను వైసీపీ ఎంతగా వేధించి వెళ్లగొట్టిందో. చిత్తూరు జిల్లాలోనే పుట్టి పెరిగిన తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి ఆ జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది. గతంలో కాంగ్రెస్ లో కూడా కీలక పాత్ర పోషించిన ఈ కుటుంబం ఇప్పుడు తెలుగుదేశంతో ఉంది. అంతమాత్రాన రాజకీయ కారణాలతో వాళ్ళని రాష్ట్రం నుండి తరిమేయాల్సిన అవసరం లేదు. కానీ జగన్ సర్కార్ మాత్రం వ్యాపారాన్ని దెబ్బతీసి ఆ కుటుంబాన్ని దెబ్బకొట్టాలని చూసింది. అయితే తెలంగాణ వారికి రెడ్ కార్పెట్ పరిచి ఆ రాష్ట్ర యువతకి ఉపాధి పెంచుకొని తద్వారా ఆదాయాన్ని పెంచుకుంది. ఇప్పుడు కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.