కేసీఆర్కు కొత్త చిక్కులు.. ప్రచారం తరువాత.. ముందు బుజ్జగింపులు! | new troubles to kcr| brs| gazwel| kamareddy| nominationsm withdraw
posted on Nov 13, 2023 9:05AM
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పరిస్థితి ఒక అడుగు ముందుకు మూడడుగులు వెనక్కు అన్న చందాన సాగుతోంది. ఊరికి ముందర అన్న చందంగా షెడ్యూల్ విడుదలకు ముందే అభ్యర్థులను ప్రకటించేసి.. విపక్షాలపై పైచేయి సాధించేశాం అని జబ్బలు చరుచుకున్న బీఆర్ఎస్ కు ఆ తరువాత ఏదీ అంతగా కలిసి రావడం లేదు. అసంతృప్తులు, అసమ్మతులు అలా ఉంచితే.. స్వయంగా కేటీఆర్ పోటీ చేసే రెండు స్థానాలలోనూ గెలుపు అంత సులువుగా రాదని పరిస్థితులు గమనించిన ఎవరికైనా ఇట్లే అవగతమౌతుంది. అదే విషయం అర్థమై ఇప్పుడు గులాబి పార్టీలో గుబులు మొదలైంది. విషయానికి వస్తే.. తెలంగాణఅసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. సోమవారం (నవంబర్ 13) నామినేషన్లను పరిశీలన, 15న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఇప్పుడు ఈ తేదీయే కేసీఆర్ అండ్ కోను భయపెడుతోంది. ఎందుకంటే..
తెలంగాణ సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గజ్వేల్లో 154 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అలాగే కామారెడ్డిలోనూ పెద్ద సంఖ్యలోనే నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే గజ్వేల్లో నామినేషన్లతో బీఆర్ఎస్కు, కేసీఆర్ కు కంగారు మొదలైంది. ఇప్పుడు అలా దాఖలైన నామినేషన్ల ఉపసంహరణ విషయంలో బుజ్జగింపులకు, అలవికాని హామీలనైనా ఇచ్చేందుకు కేసీఆర్, బీఆర్ఎస్ ఫోకస్ పెట్టాయి.
సీఎం కేసీఆర్పై నామినేషన్లు వేసిన బాధితులను, నేతలు బుజ్జగించేందుకు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున దృష్టి పెట్టిందని పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తోంది. నామినేషన్లు ఉపసంహరించుకోవాలనీ, ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే వారి సమస్యలు పరిష్కరిస్తామని బీఆర్ఎస్ నేతలు నమ్మబలుకుతూ నామినేషన్లు దాఖలు చేసిన వారి చుట్టూ తిరుగుతున్నారని అంటున్నారు. ఇక నామినేషన్లు వేసిన వారిలో వందకుపైగా రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి ప్లాట్స్ బాధితులు, రైతులు ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో మూతపడ్డ చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించాలని రైతులు నామినేషన్లు వేశారు. నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల తరఫున 30కిపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో, రంగంలోకి దిగిన గులాబీ పార్టీ నేతలు వారిని విత్డ్రా చేసుకోవాలని బుజ్జగిస్తున్నారు.
అదలా ఉంటే.. తెలంగాణలో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెగ్మెంట్లలో కలిపి 5,716 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా గజ్వేల్లో 145 మంది కలిసి 154 నామినేషన్లు దాఖలు చేయగా, 116 నామినేషన్లతో మేడ్చల్ రెండో స్థానంలో, 104 నామినేషన్లతో కామారెడ్డి మూడో స్థానంలో ఉన్నాయి. నారాయణపేట 13 నామినేషన్లతో చివరి స్థానంలో ఉంది. వైరా, మక్తల్లో కూడా 13 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.
మొత్తం మీద ఎన్నికల ప్రచారంపై పూర్తిగా దృష్టి పెట్టాల్సిన సమయంలో అధికార పార్టీ నేతలంతా.. తమ అధినేతకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసిన వారిని బుజ్జగించో, బతిమలాడో వాటిని ఉపసంహరింప చేసే పనిలోనే పూర్తిగా నిమగ్నం కావాల్సి వస్తోంది.