posted on Nov 13, 2023 11:34AM
తెలంగాణ ఎన్నికల వేళ హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి సుధాకర్ రెడ్డి నివాసంపై ఐటీ దాడులు జరిగాయి. ఓ వైపు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేసే సమయంలోనే ఐటీ దాడులు జరిగాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్నాయి. కేవలం 17 రోజుల్లో పోలింగ్ ఉంది. ఇప్పటివరకు కాంగ్రెస్ నేతల ఇళ్లపై మాత్రమే ఐటీ దాడులు జరిగాయి. కాంగ్రెస్ నేతల మీద బిఆర్ఎస్ , బిజెపి కక్ష్య కట్టాయని ఈ కారణంగా వారి ఇళ్లపై దాడులు జరుగుతున్నట్టు పరిశీలకులు ఆరోపిస్తున్నారు. సోమవారం తెల్లవారు జాము నుంచే నగరంలోని పలు చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 15 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. గచ్చి బౌలి, అమీన్ పూర్, పటేల్ గుడా, ఆర్ సీ పురం , నాగుల పల్లి ప్రాంతాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. గచ్చి బౌలిలోని ప్రముఖ ఫార్మా కంపెనీ మై హోమ్ భూజ టాప్ ఎగ్జిక్యూటివ్ ల ఇళ్లలో దాడులు కొనసాగుతున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ సారి దాడుల్లో ఫార్మా కంపెనీలను ఐటీ అధికారులు టార్గెట్ చేశారు. వారం క్రితం తుమ్మల నాగేశ్వరరావు, జానారెడ్డి, పారిజాత నరసింహారెడ్డి, కేఎల్ఆర్ నివాసాలపై కూడా ఐటీ దాడులు జరిగాయి. తాజాగా సబిత బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగడం కలకలం రేపుతున్నాయి. ఫార్మా కంపెనీ యజమాని ఇల్లుతోపాటు కార్యాలయాలు సిబ్బంది ఇళ్లల్లో సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. బిఆర్ఎస్ బీటీం బిజెపి కాదు అనే అపవాదు తొలగించుకోవడానికే ఈ దాడులు జరుగుతున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు.