తుమ్మలకు అనుకూలంగా మారుతున్న ప్రభుత్వ వ్యతిరేకత! | anti incumbency turning in favour tummala in khammam| apolitical| professionals| employees| left
posted on Nov 13, 2023 10:17AM
ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగురాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలకు దీటుగా ఖమ్మం అసెంబ్లీ స్థానం కూడా పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ గూటికి చేరిన తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ నుంచి పోటీలో ఉన్నారు.
విశేషమేమిటంటే.. తుమ్మలతో విభేదించే వారు, రాజకీయాలకు సంబంధం లేని ప్రొఫెషనల్స్, అసలు కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి పార్టీల పడే గిట్టని వామపక్ష తీవ్రవాద పార్టీలు కూడా ఖమ్మం విషయానికి వచ్చేసరికి ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా, రాజకీయాలతో సంబంధం లేకుండా తుమ్మలకు మద్దతుగా నిలుస్తామనీ, నిలుస్తున్నామనీ బాహాటంగా చెబుతున్నారు. అందుకు ఎవరికి వారికి వేరువేరు కారణాలుండచ్చు. కానీ లక్ష్యం మాత్రం బీఆర్ఎస్ ఓటమి మాత్రమే అని చెబుతున్నారు. అలా చెబుతున్న వారిలో ఎటువంటి రాజకీయ ఉద్దేశాలూ లేని వారూ, రాజకీయాలతో సంబంధం లేకుండా తమతమ వృత్తులకే ఇంత వరకూ పరిమితమైన వారూ కూడా ఉన్నారు. వీరంతా మొదటి సారిగా బయటకు వచ్చి.. తుమ్మలకు ప్రజామద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వచ్ఛందంగా ఆ పనిలో నిమగ్నమయ్యారు.
అలా పని చేస్తున్న వారిలో వైద్యలు ఉన్నారు. టీచర్లు ఉన్నారు, ప్రొఫెసర్లు, న్యాయవాదులు, రిటైర్డ్ ఇంజనీర్లు, మాజీ ఐఏఎస్ లూ కూడా ఉన్నారు. ఇలా అన్ని వర్గాల వారూ, అన్ని వృత్తుల వారూ ఉన్నారు. వీళ్లలో ఎవరూ ఇప్పటి వరకూ రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నవారు కాదు. అయినా బీఆర్ఎస్ మరో సారి అధికారంలోకి రాకూడదన్న ఏకైక లక్ష్యంతో ఎవరికి వారుగా ముందుకు వచ్చి పని చేస్తున్నారు. మాజీ ఉగ్రవాదులు, వామపక్ష తీవ్రవాద పార్టీలూ కూడా తుమ్మలకు మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు. వీరంతా బీఆర్ఎస్ ను వ్యతిరేకించడానికి వేరువేరు కారణాలు ఉండోచ్చు. అన్నిటికీ ఉన్న సారూప్యత మాత్రం బీఆర్ఎస్ వ్యతిరేకతే కావడం విశేషం.
గతంలో వామపక్ష తీవ్రవాద పార్టీలలో పని చేసి వేరు వేరు కారణాలతో బయటకు వచ్చి.. ఎవరికి వారుగా తమతమ వృత్తులలో ఉన్న వారు కూడా ఇప్పుడు బయటకు వచ్చి తుమ్మలకు మద్దతుగా వారంతట వారుగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల మద్దతును కూడగడుతున్నారు. ప్రజలతో మమేకమౌతూ.. బీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయమేమిటంటే సీపీఐఎంల్ పార్టీలు కూడా ములుగు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉన్న సీతక్క, బీఆర్ఎస్ తరఫున రంగంలో ఉన్న బడే జ్యోతి వంటి మాజీ వామపక్ష తీవ్రవాదులతో కలిసి పని చేసిన వారికి మద్దతు ప్రకటించే విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు.. కానీ వామపక్ష సిద్ధాంతాలతో కానీ, పార్టీలతో కానీ సంబంధం లేని తుమ్మల విషయంలో మాత్రం అంతా ఒకే మాట చెబుతున్నాయి. వీరే కాదు.. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా, కీలకంగా పని చేసిన ఉద్యమ కారులు కూడా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పని చేయడానికి ముందుకు వస్తున్నారు. వీరంతా ఇక చాలు బీఆర్ఎస్ టైం అయిపోయింది. బీజేపీతో రహస్య మైత్రితో తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగేలా వ్యవహరిస్తోందని బాహాటంగా చెబుతూ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఒక ఆంగ్ల వెబ్ సైట్ ఖమ్మం నియోజకవర్గంలో ప్రజానాడి తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నంలో తుమ్మలకు భిన్న భావజాలాలు, బిన్న వృత్తులలో ఉన్నవారంతా బేషరతు మద్దతు ప్రకటిస్తున్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అధికార అహంకారంతో స్వార్థ ప్రయోజనాల కోసం కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను విస్మరించేశారనీ, కుటుంబపాలన, అవినీతి తెలంగాణలో పెచ్చరిల్లాయనీ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తు అయితే ప్రభుత్వ ఉద్యోగులలో కూడా కేసీఆర్ పట్ల, బీఆర్ఎస్ సర్కార్ పట్ల విముఖత కనిపిస్తున్నది. తమ పేర్లు బయటపెట్టడానికి ఇష్టపడని పలువురు ఉద్యోగులు కేసీఆర్ సర్కార్ పట్ల తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ సారి తమ మద్దతు తుమ్మలకేనని కుండబద్దలు కొట్టారు. మొత్తంగా తోమ్మిదేళ్ల కేసీఆర్ పాలన పట్ల తెలంగాణలో ప్రజా వ్యతిరేకత ఓ స్థాయిలో ఉందని పరిశీలకులు చెబుతున్నారు.