పుట్టినిల్లు తెలుగుదేశం.. మెట్టినిల్లు కాంగ్రెస్.. రేవంత్ రెడ్డి బోల్డ్ స్టేట్మెంట్! | revanth bold ststement| gains| tdp| support| telangana| congress| brs
posted on Nov 14, 2023 6:29AM
తెలంగాణ ఎన్నికలలో తెలుగుదేవం హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. ఆ పార్టీ తెలంగాణ ఎన్నికల బరిలో నిలబడకపోవడంతో ఇక్కడ ఇప్పుడు అన్ని పార్టీలకు తెలుగుదేశం అవసరం వచ్చి పడింది. అందుకే ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరూ తెలుగు దేశం నామస్మరణ చేస్తున్నారు. ఏపీలో జనసేన తెలుగుదేశంతో కలిసి పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో మాత్రం జనసేన బీజేపీతో కలిసి వెళ్ళింది. అయితే, ఇక్కడ తెలుగుదేశం పోటీలో లేకపోవడంతో బీజేపీ వయా జనసేన తెలుగుదేశం పార్టీని దగ్గర చేసుకొనే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ జనసేన నేతలను తెలుగుదేశం నేతలతో సంప్రదింపులకు పంపుతూ వారి ద్వారా మద్దతు కోసం ప్రయత్నిస్తున్నది. ఇక బీఆర్ఎస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికల తేదీ ప్రకటన వెలువడడంతోనే బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ, ఆయనకు సంఘీభావం ప్రకటిస్తూ ఆ పార్టీకి దగ్గరయ్యే కార్యక్రమం మొదలు పెట్టారు. మంత్రి కేటీఆర్ అయితే ఏకంగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తెలుగుదేశంపై విమర్శలకు అవకాశమే లేదని.. లోకేష్ తనకు తమ్ముడంటూ వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం తనకు పుట్టినింటితో సమానమంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు.
తెలుగుదేశం తన పుట్టిల్లు అని.. కాంగ్రెస్ తనకు అత్తిల్లు అంటూ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. తాను తెలుగుదేశం కూతురుని, కాంగ్రెస్ కోడలిని అంటూ కొత్త భాష్యం చెప్పారు. కూతురు పుట్టింట్లో తల్లిదండ్రుల పక్షాన ఉంటూ.. అత్తింటికి రాగానే ఆ ఇంటి గౌరవాన్ని కాపాడుతుందని.. అలాగే తాను ఇపుడు కాంగ్రెస్ గౌరవాన్ని కాపాడే కీలక పాత్రలో ఉన్నానని చెప్పారు. అదే టైంలో తాను తన పుట్టింటి గొప్పలు చెప్పలేను అని కూడా అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఎదురు దాడి మొదలు పెట్టారు. రాజకీయాలు అన్నాక ఎదురుదాడి సహజం. ఎన్నికల వేళ ఇది మరింత ఎక్కువగా ఉండటం సహజమే. కనుక ఆ విషయం పక్కన పెడితే తెలంగాణలో తెలుగుదేశం సానుభూతిపరులు ఏ పార్టీకి అండగా ఉంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. చాలా నియోజకవర్గాలలో తెలుగుదేశం కార్యకర్తలు బహిరంగంగానే కాంగ్రెస్ కు జైకొట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థుల ర్యాలీలలో కూడా తెలుగుదేశం జెండాలను రెపరెపలాడుతున్నా యి.
బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశ్యంతోనే తెలుగుదేశం తెలంగాణలో పోటీ నుండి తప్పుకున్నట్లు రాజకీయ వర్గాలలో బలమైన ప్రచారం జరుగుతుండగా.. ఇప్పటికే తెలుగుదేశం శ్రేణులు కాంగ్రెస్ తో మమేకమైపోయారు. అయితే ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ మాత్రం తెలుగుదేశం సానుభూతిపరులకు గాలం వేస్తూనే ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి ఓ స్ట్రాంగ్ మెసేజ్ పాస్ చేశారు. చంద్రబాబు అంటే తనకు ఇష్టం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా అంటూ మాట్లాడిన రేవంత్.. తన మనసులో ఎప్పటికీ చంద్రబాబు ఉంటారని చెప్పుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయి జైలులో ఉన్న సమయంలో.. ఓ మీడియా ప్రతినిధి చంద్రబాబు అరెస్ట్ ని ఎలా చూస్తున్నారని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దానికి రేవంత్ అరెస్ట్ గానే చూస్తున్నాను అని బ్యాలాన్స్డ్ గా సమాధానం చెప్పారు. అయితే, ఆ తర్వాత వ్యూహాత్మకంగా టీడీపీ పోటీ నుంచి వైదొలిగిన తరువాత ఇలా చంద్రబాబుపై తన ప్రేమను, అభిమానాన్ని, గౌరవాన్ని చాటారు. మొత్తంగా రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో తెలంగాణ తెలుగుదేశం శ్రేణులు అవుట్ రేటెడ్ గా రేవంత్ కు మద్దతుగా నిలవడం గ్యారంటీ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రేవంత్ తన బోల్డ్ కామెంట్స్ తో తెలంగాణలో తెలుగుదేశం శ్రేణుల మనసు గెలుచుకున్నారని అంటున్నారు.