జగన్ కు పులివెందుల టెన్షన్! | pulivendula tenssion to jagan| btech| ravi| arret| old| case| special| go| land
posted on Nov 16, 2023 3:43PM
అభద్రతా? భయమా?.. తెలియదు కానీ.. జగన్ ఇప్పుడు నీడను చూసినా ఉలిక్కిపడుతున్నారు. సింహం సింగిల్ గా వస్తుంది.. భయం మీనింగే తెలియని బ్లడ్.. కొండను సైతం ఢీ కొట్టగల మొనగాడు.. ఎంతటి శక్తులనైనా ఎదురించగల మొనగాడు. సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి వైసీపీ నేతలు నిన్న మొన్నటి వరకూ చెప్పిన డైలుగులు ఇవి. అయితే, ఇలాంటి డైలాగులు సినిమాలలో పేలుతాయేమో కానీ కానీ రాజకీయాలలో మాత్రం కామెడీ పీసులుగా మిగిలిపోతాయి. అందునా ఇలాంటి డైలాగులు జగన్ రెడ్డిని ఉద్దేశించి చెప్పినవైతే.. మరీ ఓవర్ చేస్తున్నారు కదా అని పార్టీ శ్రేణులే సెటైర్లు వేసుకుంటాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండి కూడా జగన్ రాజధాని ప్రాంతంలో రోడ్ల మీదకి వెళ్లేందుకు కూడా బిక్కు బిక్కు మంటూ కాసంత దూరానికి కూడా హెలికాఫ్టర్లో వెడుతున్నారు. సొంత ప్రాంతం పులివెందులలో పర్యటనలకూ రోడ్లు బ్లాక్ చేయించుకుంటున్నారు. ఆయన రోడ్డు మీదకు వస్తున్నారంటే మనుషులెవరూ ఎదురుపడకుండా బ్యారికేడ్లు, పరదాలు.. ఇలాంటివి చూశాక కూడా వైసీపీ నేతలు జగన్ గురించి ఆహా ఓహో అంటూ చెబుతున్న డైలాగులు వినేవారికి పొగడ్డలుగా కాకుండా ఎగతాళి చేస్తున్నారా అన్న సందేహం వచ్చేలా చేస్తున్నాయి. అది భయమా, అతి జాగ్రత్తా అన్నది పక్కన పెడితే.. ఇప్పుడు రాజకీయంగా కూడా జగన్ అభద్రతకు లోనవుతున్నారా? ప్రతిపక్ష పార్టీల నేతలంటే భయపడుతున్నారా అన్న చర్చ జనంలోనే కాదు.. పార్టీ శ్రేణుల్లో కూడా జరుగుతోంది.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు దగ్గర నుండి తాజాగా బీటెక్ రవి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వరకూ విపక్ష నేతలను అడుగడుగునా అడ్డగించి పోలీసులతో అక్రమ అరెస్టులు చేయిస్తున్నది. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి నిరసనా తెలిపేందుకు అనుమతి లేదంటూ అనధికారికంగా 144వ సెక్షన్ విధిస్తున్నారు. తెలుగుదేశం నేతలు కదిలితే చాలు అనుమతి లేదంటూ పోలీసులు కట్టడి చేసేస్తున్నారు. అసలు కేసేంటి? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించినా పోలీసుల దగ్గర సమాధానం ఉండడం లేదు. పై అధికారులు చెప్పారు.. మేం చేస్తున్నాం.. అనుమతి లేదు కదలొద్దు అంటూ పోలీసులు ఎక్కడివాళ్ళని అక్కడే నిర్బంధిస్తున్నారు. అందుకు ఉదాహరణలు కోకోల్లలు. తాజాగా బీటెక్ రవి అరెస్ట్ మరో ఉదాహరణ. సీఎం జగన్ రాజకీయ ప్రత్యర్థి, పులివెందుల తెలుగుదేశం ఇన్చార్జ్ బీటెక్ రవి వ్యక్తిగత పనిమీద మంగళవారం సాయంత్రం పులివెందుల నుంచి కడప వెళ్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని వల్లూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. అప్పటికప్పుడు కడప ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించి కడపలో జడ్జి ఎదుట హాజరుపరచగా రవికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.
నిజానికి రవి తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని కోరినా పోలీసుల దగ్గర సమాధానం లేదు. కనీసం ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నామో చెప్పకుండానే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. జడ్జి ఎదుట హాజరు పరిచాక కానీ ఆ కేసు బయటపడలేదు. లోకేష్ యువగళం యాత్ర కోసం కడప జిల్లాకు వచ్చినప్పుడు ఎయిర్ పోర్ట్ లో జరిగిన తోపులాట కేసులో ఇప్పుడు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇది ఎప్పుడో పది నెలల క్రితం కేసు. అప్పుడు ఈ కేసులో రవికి బెయిల్ దక్కగా.. ఇప్పుడు దాన్ని నాన్ బెయిలబుల్ గా మార్చినున్నట్లు తెలుస్తుంది. ఇది ఒక్కటే కాదు.. బీటెక్ రవిపై చాలా రకాల కేసులు నమోదు చేయడానికి పోలీసులు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ పై పోటీ చేసేందుకు ప్రత్యర్థి లేకుండా చేయాలని చూస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరి తన సొంత గడ్డ పులివెందుల విషయంలో కూడా కూడా జగన్ ఎందుకింత అభద్రతా భావంతో ఉన్నారన్నది ఆసక్తిగా మారింది. రాజకీయ పునాదులు కదులుతుండడంతోనే బీటెక్ రవిని అరెస్టు చేసినట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు పులివెందులపై జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. ప్రభుత్వ స్థలాల పంపిణీ విషయంలో జగన్ సర్కార్ తాజాగా ఓ ప్రత్యేక జీవో తీసుకొచ్చింది. పులివెందుల పురపాలక సంఘం పరిధిలోని మూడు గ్రామాల్లో 1100 ఎకరాల ప్రభుత్వ భూములను 1100 మందికి ఎకరా చొప్పున అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, నగరాలు, పట్టణాలు, మేజర్ పంచాయతీలకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను పంపిణీ చేయకూడదని గతంలో అంటే 2012లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిషేధం విధించింది. దాని నుండి ఇప్పుడు జగన్ పులివెందుల మండలాన్ని మినహాయింపు ఇస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. అంటే సొంత నియోజకవర్గం, సొంత మండలంలో ఇప్పుడు భూములు పంచి ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తున్నారని భావించాల్సి వస్తుంది. ఒకవైపు బీటెక్ రవి అరెస్ట్, మరోవైపు ప్రత్యేక జీవోలు తెచ్చి మరీ భూముల పందేరం వంటివి చూస్తే జగన్ కు పులివెందుల టెన్షన్ పట్టుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.