Leading News Portal in Telugu

Cyclone Midhili: 24 గంటల్లో బంగాళాఖాతంలో “మిధిలి తుఫాన్”..



Cyclone Midhili

Cyclone Midhili: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరో 24 గంటల్లో తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. తుఫానుగా మారిన తర్వాత బంగ్లాదేశ్ లో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. బలమైన అల్పపీడనం ఉత్తర-ఈశాన్య దిశగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని, ఇది తుఫానుగా మారిన తర్వాత ‘మిధిలీ’గా పేరు పెట్టనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ పేరున మాల్దీవులు సూచించింది. మిధిలీ తుఫాన్ శనివారం ఉదయం బంగ్లాదేశ్ లోని ఖేపుపరా, మోంగ్లా మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది.

Read Also: Tamil Nadu: సుప్రీం వ్యాఖ్యల తర్వాత కూడా.. 10 బిల్లులను తిప్పిపంపిన గవర్నర్ ఆర్ఎన్ రవి..

గురువారం ఉదయం 8.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 390 కిలోమీటర్లు, ఒడిశాలోని పారాదీప్‌కి దక్షిణం ఆగ్నేయంగా 320 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ వ్యవస్థ కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండీ తన ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ.. 24 గంటల్లో తుఫానుగా బలపడి బంగ్లాదేశ్ తీరాన్ని మోంగ్లా, ఖేపుపరా మధ్య 60-70 కిలోమీటర్ల వేగంతో దాటే అవకాశం ఉందని, తెల్లవారుజామున 80 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

తుఫాను ప్రభావంతో ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40 కి.మీ నుంచి 70కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. పశ్చిమబెంగాల్ లోని కోస్తా జిల్లాల్లో గురు,శుక్ర వారాల్లో, ఉత్తర ఒడిశాలోని కోస్తా జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, దక్షిణ అస్సాం, తూర్పు మేఘాలయ ప్రాంతాల్లో గురువారం నుంచి శనివారం వరకు తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురసే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు శనివారం వరకు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. ప్రస్తుతం ఉన్న నమూనాల ప్రకారం తుఫాన్ బంగ్లాదేశ్ తీరం వైపు కదులుతున్నట్లు ఐఎండీ తెలిపింది.