భట్టి విక్రమార్కకే తెలుగుదేశం జై! | tdp unanimous support to bhatti| madhira| constituency| congress| candidate
posted on Nov 16, 2023 9:47AM
మధిర నియోజకవర్గ తెలుగుదేశం శ్రేణులు ఆ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టివిక్రమార్కకే జై కొట్టారు. ఈ మేరకు దెందుకూరు శ్రీరస్తు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. మధిర లో పోటీచేస్తున్న మల్లు భట్టి విక్రమార్కకు మద్ధతు యిచ్చి ఆయన గెలుపుకు సంపూర్ణ సహకారం అందించాలని మధిర నియోజకవర్గ తెలుగుదేశం మండలపార్టీ నాయకులు, గ్రామ శాఖ నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు.
తెలుగుదేశం తెలంగాణ ఉపాధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం అధ్యక్షతన నియోజకవర్గ మండలాధ్యక్షులు, కార్యదర్శులు, గ్రామ కమిటీ, వార్డు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం బుధవారం (నవంబర్ 15) జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టివిక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమ్మేళనంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తెలంగాణాలో తెలుగుదేశం ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదనీ, ఈ నేపథ్యంలో నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే మల్లు భట్టి విక్రమార్కకు సంపూర్ణ మద్ధతు యిచ్చి అధిక మెజారిటీ తో గెలిపించాలని తీర్మానించినట్లు డాక్టర్ రామనాథం చెప్పారు. నాయకులు, కార్యకర్తల అభీష్టానికి అనుగుణంగా భట్టి విక్రమార్క గెలుపుకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందన్నారు.
మధిర, బోనకల్, చింతకాని, ముదిగొండ, ఎర్రుపాలెం మండలాధ్యక్షులు ఐటిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర ప్రచార కార్యదర్శి యలమంచిలి శివ, మధిర టౌన్ టిడిపి కార్యదర్శి చెరుకూరి కృష్ణారావు, వంగాల రామకోటి మేడేపల్లి రాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన తెలుగుదేశం నేతలకు, శ్రేణులకు భట్టి విక్రమార్క కృతజ్ణతలు తెలిపారు.
తాను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానని, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో కూడిన నియోజకవర్గ స్థాయి, మండలస్థాయి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని, కమిటీ నిర్ణయం ప్రకారం అభివృద్ధి పనులు చేసుకుందామని అన్నారు. మధిరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజి, అవుటర్ రింగ్ రోడ్, రెవిన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషిచేస్తానని హామీ యిచ్చారు.తెలుగుదేశం పార్టీ మొదటినుంచి తనను కూడా కుటుంబసభ్యునిగా చూస్తున్నదని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ పరిస్థితి అంటే తెలుగుదేశం కాంగ్రెస్ కు మద్దతు నివ్వడం ఒక్క మధికకే కాకుండా రాష్ట్రం అంతటా కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.