
కలిగినోళ్ల కలికి మేడ.. మేడకెదురుగా మురికి వాడ అని ఓ కవి అన్నట్లు.. దేశానికి స్వాతంత్రం వచ్చి 7 పదులు దాటినా ఇప్పటికీ అభివృద్ధి నోచుకోని కొన్ని గ్రామాలు ఉన్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనీస సదుపాయాలు కూడా లేక ఎన్నో గ్రామాల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆ కోవలోకే వస్తుంది ఛత్తీస్‌గఢ్‌లో రిహంద్ నదీతీరాన ఉన్న సూరజ్‌పుర్ జిల్లాలోని బిహార్‌పుర్ క్షేత్ర. ఈ క్షేత్రం ప్రస్తావన వస్తే అక్కడి నేతలు కూడా వణికిపోతారు. ఇందుకు కారణం వన్య ప్రాణులు. వివరాలలోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లో రిహంద్ నదీతీరాన ఉన్న సూరజ్‌పుర్ జిల్లాలోని బిహార్‌పుర్ క్షేత్రం చుటూ అటవీ ప్రాంతం ఉంది. ప్రదేశంలో పదికి పైగా గ్రామాలకు రోడ్డు సదుపాయం లేదు.
Read also:China: చైనాలో ఘోర అగ్నిప్రమాదం.. 26 మంది దుర్మరణం
ఓటు హక్కును వినియోగించుకోవాలి అనుకున్న కనీసం 5 నుండి 10 కి.మీ.లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. అయితే చుట్టూ అడవి కావడంతో ఇక్కడ 50 అడవి ఏనుగులు నివసిస్తున్నాయి. దీనితో ఇక్కడ ప్రజలు పగటి పూట బయట తిరిగేందుకు కూడా భయపడతారు. ఇక రాత్రి వేళలో అసలు బయటకు రారు. ఈ ప్రాంతం గురించి నేతలు కూడా పట్టించుకోరు. అందుకే ఇక్కడ ప్రజలు ఈ నెల 17న జరగనున్న తాజా ఎన్నికల పోలింగుకు వెళ్లడం కష్టంగానే కనిపిస్తోందని గ్రామస్థులు అంటున్నారు. గతంలో రోడ్డు సదుపాయం, ఇతర కనీస వసతులు కల్పించాలంటూ స్థానిక ఓటర్లు 2018 ఎన్నికలను బహిష్కరించారు, అయినా పరిస్థితుల్లో ఏ మార్పు రాలేదు అని అక్కడి ఖోహిర్ పంచాయతీ సర్పంచి ఫూల్ సాయ్ పండో తెలిపారు.