పులివెందుల జగన్ చేజారినట్లేనా? | jagan defeat fear in pulivendula| viveka| murder| avinash| support| vijayamma| distance| sunita
posted on Nov 17, 2023 6:28AM
పులివెందుల.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేది వైఎస్ కుటుంబమే. నాలుగున్నర దశాబ్దాలుగా పులివెందుల నుంచి పోటీ చేస్తున్నదీ, విజయం సాధిస్తున్నదీ కూడా వైఎస్ కుటుంబమే. 1978 నుంచి పులివెందుల నుంచి వైఎస్ జగన్ కుటుంబం పోటీ చేస్తున్నది. గెలుస్తున్నది. పులివెందుల నుంచి 1978, 1983, 1985లో వైఎస్ రాజశేఖరరెడ్డి విజయం సాధించారు. 1989లో వైఎస్సార్ కడప ఎంపీగా పోటీ చేస్తే, ఆయన సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1994లోనూ వివేకానే గెలుపొందగా.. మళ్ళీ 1999, 2004, 2009ల్లో వైఎస్సార్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్సార్ మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికలో వైఎస్ సతీమణి విజయమ్మ గెలుపొందారు. ఆ తరువాత కూడా వైసీపీ నుంచి మరోసారి విజయమ్మ పోటీ చేశారు. విజయం సాధించారు.
ఇక 2014, 2019ల్లో జగన్ పులివెందులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుకే పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట. నిన్నమొన్నటి వరకూ అందరూ ఆఖరికి ప్రతిపక్షాలతో సహా ఈ విషయమే చెప్పేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారిందా? ఇప్పుడు వైఎస్ కుటుంబం కంచుకోట పులివెందుల బద్దలు అవుతుందా? పులివెందులలో జగన్ ఓటమి ఖాయమైందా అంటే రాజకీయవర్గాలు, పరిశీలకులు అవును ఆ పరిస్థితి ఉందని అంటున్నారు. విపక్షాలైతే పులివెందుల ఇంకెంత మాత్రం వైఎస్ కుటుంబ కంచుకోట కాదని ఖరాకండీగా చెప్పేస్తున్నారు.
2019 ఎన్నికల తర్వాత కడప జిల్లా రాజకీయాలు వేగంగా మారిపోయాయి. ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య తర్వాత ప్రజల దృష్టి, ఆలోచనా మారిందన్న అభిపాయాలు వ్యక్తమౌతున్నాయి. బాబాయిని హత్యచేసింది అబ్బాయేననే బలమైన ఆరోపణలు ఉండగా.. ఆ అబ్బాయితో సహా నిందితులకు జగన్ కొమ్ముకాస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివేకా హత్య కేసులో నిందితులు ఎవరన్నది న్యాయదేవత ఇంకా తేల్చకపోయినా, నిజం ఏంటన్నది పులివెందుల ప్రజలకు స్పష్టంగా అర్ధమైంది. సాక్షాత్తు వివేకా కుమార్తె డాక్టర్ సునీత.. అన్న జగన్ పై తనకు నమ్మకం లేదంటూ.. నాన్నను చంపిన వాళ్ళని నా అనుకున్న వాళ్ళే కాపాడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు, తనకు న్యాయం చేయాలని ఇతర రాష్ట్రాల కోర్టుల చుట్టూ తిరగడం, కూతురు అల్లుడే ఆస్తి కోసం వివేకాను చంపారనేలా వైసీపీ నుంచి రివర్స్ ప్రచారం చేయడం పులివెందుల ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ కేసులో పలువురు అప్రూవర్లు గా మారడంతో ఈ కేసులో అసలు నిజా నిజాలు ఏంటన్నది పులివెందుల నియోజకవర్గం మొత్తం రచ్చబండ మీద చర్చగా బయటపడిపోయాయి.
ఇక వైఎస్ సొంత కుటుంబంలో వివాదాలు కూడా ఇక్కడ జగన్ కు మైనస్ గా మారాయి. తల్లి విజయమ్మ, సోదరి షర్మిలను కూడా జగన్ దూరం చేసుకోవడం సొంత నియోజకవర్గం మీద ప్రభావం చూపిందంటున్నారు. తల్లి విజయమ్మ ఇప్పుడు జగన్ తాడేపల్లి నివాసంతో పాటు సొంత గడ్డ పులివెందులకు కూడా దూరం అయ్యారు. హైదరాబాద్ కూతురు షర్మిల వద్దనే ఆమె ఉంటున్నారు. అందుకు జగనే కారణమని పులివెందుల ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఆస్తులు, పదవుల కోసమే జగన్ తల్లి, చెల్లిని తరిమేశారన్న సంకేతాలు బలంగా ప్రజలలోకి వెళ్లిపోయాయి. నియోజకవర్గంలో అటు తండ్రి, ఇటు బాబాయ్ తో దగ్గరి సంబంధాలు ఉన్న వారంతా ఇప్పుడు జగన్ పై నమ్మకం కోల్పోయారు. ఆ విషయాన్ని బాహాటంగానే చెబుతున్నారు. అసలే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసంతృప్తికి, సొంత నియోజకవర్గంలో నెలకొన్న ఈ పరిస్థితులు కూడా తోడయ్యాయి.
ఇలా ఎన్నో అంశాలతో సొంత గడ్డపై కూడా జగన్ కు వ్యతిరేకత ఎదురౌతోంది. మరోవైపు తెలుగుదేశం పులివెందుల ఇంచార్జి బీటెక్ రవి సైతం పులివెందుల నియోజకవర్గంలో దూకుడు పెంచారు. పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేశారు. పార్టీ కార్యాలయాలను ప్రారంభించి చాప కింద నీరులా విస్తరించారు. దీంతో జగన్ కంచుకోట గేట్లు బద్దలయ్యాయని అంటున్నారు. ఈ విషయం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని చెబుతున్నారు. కానీ అప్పట్లో ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రి.. పట్టభద్రులు కాదు.. తమ ఓటర్లు వేరే ఉన్నారంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. మరి ఇప్పుడు నిఘా వర్గాలు హెచ్చరించాయో.. సొంత సర్వేలలో ఫలితాలు షాక్ కొట్టేలా చేశాయో కానీ ఇప్పటికిప్పుడు జగన్ పులివెందుల మీద ఫోకస్ పెంచినట్లు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే బీటెక్ రవిని సీఎం జగన్ అక్రమంగా అరెస్టు చేయించారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఈ తరుణంలో భూ పంపిణీ కోసం ప్రత్యేక జీవో జారీ చేయడం ఆ ఆరోపణలు వట్టి ఆరోపణలు కావని తేలుస్తోంది. పులివెందులలో ఓటమి భయంతోనే జగన్ ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.