Leading News Portal in Telugu

Cyclone Midhili: రాత్రి తీరం దాటనున్న ‘మిధిలీ తుఫాన్’.. బెంగాల్, ఒడిశాలో హైఅలర్ట్..


Cyclone Midhili: రాత్రి తీరం దాటనున్న ‘మిధిలీ తుఫాన్’.. బెంగాల్, ఒడిశాలో హైఅలర్ట్..

Cyclone Midhili: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది బంగ్లాదేశ్ తీరం వైపు ప్రయాణిస్తోంది. ఈ తుఫానుకు ‘మిధిలీ’ అని పెట్టారు. మిధిలీ తుఫాన్ బంగ్లాదేశ్ తీరం వైపు ప్రయాణించి నవంబర్ 17, అంటే ఈ రోజు రాత్రి సమయంలో బంగ్లాదేశ్ లోని ఖేపుపరా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం తుఫాన్ ఈశాన్య దిశగా కదులుతున్నట్లు వెల్లడించింది.

తుఫాన్ తీరం దాఠే సమయంలో గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం ఖేపుపరాకు ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలో ఉందని ఐఎండీ తెలిపింది. ఈ తుఫానుకు మిధిలీ అనే పేరును మాల్దీవులు పెట్టింది.

అయితే ఈ తుఫాన్ భారతదేశంపై పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదు. అయినా కూడా ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు హై అలర్ట్‌లో ఉన్నాయి. త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లో ఈ రోజు రాత్రి అతిభారీ వర్షాలు కురుస్తాయని, రెడ్ అలర్ట్ ప్రకటించింది. మణిపూర్, నాగాలాండ్, దక్షిణ అస్సాం, మేఘాలయలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తుఫాన్ ప్రభావం వల్ల ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లోని తీర ప్రాంత జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఒడిశాలోని కేంద్రపారా, జగత్ సింగ్ పూర్ వంటి తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. బెంగాల్ లోని పుర్బా మేదినీపూర్, దక్షిణ 24 పరగణ, ఉత్తర 24 పరగణ జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తుఫాన్ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచనలు జారీ చేసింది. బెంగాల్ తీరం చుట్టూ గాలుల వేగం గంటకు 50 కి.మీ నుంచి 70 కి.మీ వరకు ఉంటుందని తెలిపింది. నెల రోజుల వ్యవధిలో బంగాళాఖాతంలో ఏర్పడిన రెండో తుఫాన్ ఇది. అక్టోబర్ 21న ‘హమూన్’ తుఫాన్ ఏర్పడింది. ఇది కూడా బంగ్లాదేశ్ తీరాన్ని తాకింది.