Leading News Portal in Telugu

ఓటమి మాట.. బెదరింపు బాట.. కేసీఆర్ ఎందుకిలా? | kcr talks of defeat| emotional| warning| people| impatience| angry


posted on Nov 17, 2023 2:53PM

తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతున్నది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీల నేతలు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇక ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అయితే రోజుకి మూడు నాలుగు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. బహిరంగ సభలలో మాట్లాడుతున్నారు. 18 రోజుల్లో 43 నియోజకవర్గాల్లో మొదటి విడత ప్రచారం పూర్తి చేశారంటే  కేసీఆర్ ఏ స్థాయిలో  ఉరుకులెత్తుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. కేసీఆర్‌ ఇప్పటి వరకు దాదాపు 50 ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. రెండు విడతల ప్రచారం పూర్తి చేసుకుని చివరిదైన మూడో విడత ప్రచారం కూడా మొదలు పెట్టారు. అయితే  గతంలో ఎన్నడూ లేనంతగా కేసీఆర్ సభల ప్రసంగాలలో మాటలు మీరుతున్నారు. అయోమయమో, టెన్షనో కానీ ఎన్నికల బహిరంగసభల్లో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్ధం కాకుండా పోతున్నది. కేసీఆర్ అంటే మంచి వక్త. తెలంగాణ సమాజం మూలాల్లోకి వెళ్లి మాట్లాడగల సత్తా ఉన్న నేత. ఇంకా చెప్పాలంటే తన ప్రసంగాలతోనే ప్రజలను ఆకట్టుకోగలరు, ప్రత్యర్థులను బెంబేలెత్తించగలరు. కానీ ఈసారి కేసీఆర్ ఎందుకో తడబడుతున్నారు. ఆయన ప్రసంగాలలో అది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

తాజాగా కేసీఆర్ నిజామాబాద్, మెదక్, బోధ్ బహిరంగసభల్లో మాట్లాడుతూ జాతీయ పార్టీలకు కాలం చెల్లిందన్నారు. భవిష్యత్తంతా ప్రాంతీయపార్టీలదేనని చెప్పారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రాంతీయపార్టీలదే హవా అని పదేపదే చెప్పారు. అయితే  ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి మరీ జాతీయ పార్టీ చేసిన సంగతి కేసీఆర్ ఎలా మర్చిపోయారో  అర్థం కావడం లేదని ఆ సభకు హాజరైన జనం చర్చించుకోవడం కనిపించింది. మహారాష్ట్ర, ఒడిస్సా, కర్నాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో  పర్యటించి చాలా రోజులు ఢిల్లీలోనే మకాం వేసిన సంగతి.. వివిధ రాష్ట్రాలకు చెందిన రైతుసంఘాల నేతలతో సమావేశాలు, రైతులకు పంచిన చెక్కుల సంగతి  మర్చిపోయారా అని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఇక నల్లగొండ, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నిర్వహించిన సభల్లో అయితే కేసీఆర్‌ సహనం కోల్పోయారు.  సభలో ఈలలు వేస్తున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్‌ సభలో అయితే ఈలలు వేస్తున్న యువకులపై తిట్ల దండకం అందుకున్నారు.  హైలాగా.. తలకాయ లేదా.. వాన్ని పట్టుకోండి.. అంటూ అసహనంతో ఊగిపోయారు.  

పలు చోట్ల అయితే అభ్యర్థులను కాదు పార్టీలను చూసి ఓటేయాలని కేసీఆర్ కోరుతున్నారు. అంటే తమ ఎమ్మెల్యే అభ్యర్థి పనికిరాడని ఆయనే  జనాల ముందు ఒప్పుకున్నట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక ఉచిత విద్యుత్‌, రైతు బంధు పథకాలను ప్రజలను ఆకట్టుకొనేలా వివరించడంలో విఫలమయ్యారు.  ధరణి తీసేస్తరట, ఆలోచించాలి.. చర్చకు పెట్టాలి అంటూ మాట్లాడారు. ధరణి పోర్టల్ ఫెయిల్యూర్ అని నిపుణులు ఎప్పుడో తేల్చారు. ఈ క్రమంలో అలాంటి వాటి జోలికి వెళ్లకపోతేనే మంచిది. కానీ, అది తీసేస్తే నష్టం అనేలా కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇక అన్నిటికీ మించి మేము ఓడిపోతే మాకేం నష్టం లేదు.. ప్రజలకే నష్టం అని బెదరింపులకు దిగుతున్నారు.  అసలు ఓడిపోతే అనే మాట కేసీఆర్ నోట ఎందుకు వచ్చిందన్న చర్చ  ఇప్పుడు రాజకీయ వర్గాలలో  జరుగుతోంది. బీఆర్ఎస్ గెలుపుపై కేసీఆర్ కు నమ్మకంలేకనే ఫైనల్ గా ఇలా మమ్మల్ని ఓడిస్తే   మీకే నష్టం అంటూ  వార్నింగ్ ఇస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

 ఇప్పటి వరకు నిర్వహించిన 50 సభల్లో మూస ధోరణి ప్రసంగమే కావడంతో కేసీఆర్‌ సభలకు రావడానికి జనం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో పలు చోట్ల ప్రజలు లేక వెలవెలబోతున్న సభలను చూసి కేసీఆర్ అసహనానికి గురవుతున్నట్లు కనిపిస్తున్నది. దాదాపుగా అన్ని పార్టీలకు ఇప్పుడు జనసమీకరణ అవసరమే. అయితే బీఆర్ఎస్ మీద ఉన్న అసంతృప్తికి తోడు స్థానికంగా అభ్యర్థుల మీద అసంతృప్తి వెరసి చాలా చోట్ల  బీఆర్ఎస్ సభలు జనం లేకవెలవెల పోతున్న పరిస్థితి కనిపిస్తోంది.  డబ్బులు వెదజల్లినా జనసమీకరణ భారమవుతోంది. అలాంటి సభలలో కేసీఆర్ లో మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.   అందుకే జనాలను హెచ్చరిస్తున్నట్లుగా  మేము ఓడిపోతే మీరే నష్టపోతారని మాట్లాడుతున్నారు. గతంలో కేసీఆర్ స్పీచ్ అంటే పంచులు, చురకలు,  పిట్ట కథలతో సాగేది. అందుకే మీడియా కూడా ఫోకస్ చేసేది. కానీ ఈసారి అవేవీ లేకపోగా కేసీఆర్ లో ఆగ్రహం, అసహనం కనిపిస్తుంది. అందుకే ఆయన నోట ఓడిపోతే అనే మాట వినిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.