
తెలంగాణలో ఎన్నికల ప్రచారాలు కాకరేపుతున్నాయి. అయితే.. ప్రజలను ఆకర్షించేందుకు ఆయుధమైన ఎన్నికల మేనిఫెస్టోలను ఆయా పార్టీలు విడుదల చేయగా ఆయా పార్టీల నేతలు వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. ఎన్టీవీ నిర్వహిస్తున్న క్వశ్చన్ అవర్‌కు నేడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీవీ జర్నలిస్టులు అడితే ప్రశ్నలకు భట్టి విక్రమార్క సమాధానంగా.. ‘ఇచ్చిన హామీలను 100 శాతం అమలు చేస్తాం. కర్నాటకలో ఐదు గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. గత కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన విద్యుత్ ప్రాజెక్టుల వల్లే ఇప్పుడు కరెంట్ ఇవ్వగలుగుతున్నారు. గతంలో కౌలు రైతు చట్టం తీసుకువచ్చాం. అన్ని అంచనాలు వేసే మేనిఫెస్టోను ప్రకటించాం. పెన్షన్లను ఉచితాలు అని నేను భావించను. ఆదాయం పెంచే వ్యవస్థలను వ్యవస్థీకృతం చేస్తాం. తీసుకొచ్చిన అప్పులను సరైన విధానంలో పెట్టుబడి పెట్టుంటే ఆదాయం వచ్చేది. పంచడం వల్ల ఆదాయం తగ్గుతుందనుకుంటే పొరపాటు.
పంచడం వల్ల కొనుగోలు శక్తి పెరుగుతుంది. కౌలు రైతులకు ఖచ్చితంగా ఎకరాకు రూ.12 వేలు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ మహిళలకు మొదటి నుంచి ప్రాధాన్యత ఇస్తోంది. కల్యాణలక్ష్మి కంటే ముందే బంగారు తల్లి పథకం తెచ్చాం. ధరణి అనేది ఓ సాఫ్ట్వేర్. ధరణి అనే సాఫ్ట్‌వేర్‌లో పట్టాదారు కాలం ఒక్కటే పెట్టారు. ధరణి సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తాం, కొత్త కాలాలను చేరుస్తాం. తెలంగాణ ప్రజల పోరాటం అంతా భూమి కోసం. సీఎల్పీ నేతగా నేను నూటికి నూరుపాళ్లు ప్రభుత్వాన్ని నిలదీశాను. ఎన్నికలయ్యాక సీఎల్పీ సమావేశంలో సీఎల్పీ లీడర్‌ను ఎన్నుకుంటారు. బీఆర్ఎస్కు ఓటేస్తే.. ఇక్కడి ఎంపీలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేస్తున్నారు. బీజేపీ చెబుతుంది, బీఆర్ఎస్ చేస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే. తన ఇంట్లో పెట్టిన సమావేశం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పెట్టింది కాదు. కాంగ్రెస్ పార్టీ గెలవడం ఇప్పుడు చారిత్రక అవసరం. గెలిచేవాళ్లకే టికెట్లు ఇచ్చాం. ఆరు గ్యారెంటీలను అమలు చేయడమే మా గోల్. బీఆర్ఎస్ అభివృద్ధి చేసిందని అంటే నేను ఒప్పుకోను. ఈ పదేళ్లలో ఒక్క ఎయిర్పోర్ట్ అయినా కట్టించారా..?. తెలంగాణకు ఒక్క పెద్ద సంస్థ అయినా తీసుకొచ్చారా.? 10 ఏళ్లలో వారు చేసింది ఒక్క కాళేశ్వరమే, అది కుంగిపోయింది.’ అని భట్టి విక్రమార్క అన్నారు.