ఉన్న ఓట్లు పోయి.. దొంగ ఓట్లు వచ్చె.. ఏపీ ఓటరు జాబితాలో చిత్ర విచిత్రాలు! | ap voters list full of mistakes| fake| remove| form7| ycp
posted on Nov 18, 2023 10:35AM
లేని వారికి ఓట్లు.. ఉన్న వారికి తొలగింపులు.. ఒకే అడ్రస్ లో ఒకే వ్యక్తికి పదుల సంఖ్యలో ఓట్లు.. ఒకే పేరు..ఒకే ఫొటోతో పెద్ద సంఖ్యలో ఓట్లు ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితాలో వింతలు, విశేషాలకు కొదవే లేదు. జగన్ చేత, జగన్ కొరకు, జగనే ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మొత్తం ఓట్ల నమోదు కార్యక్రమాన్ని ఒక ప్రహసనంగా మార్చేశారు. ఏపీలో ఉన్న వారు తమ ఓటు నమోదు చేసుకోవాలంటే కోర్టుల వరకూ వెళ్లాల్సిందే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పని చేసిన నిమ్మగడ్డ రమేష్ కోల్పోయిన తన ఓటును పునరుద్ధరించుకునేందుకు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. అదే ఆంధ్రప్రదేశ్ లో బతికి ఉన్న వందల మంది ఓట్లు గల్లంతు.. అసలు లేని వారికి వేల సంఖ్యలో ఓట్లు ఉన్న విచిత్ర పరిస్థితి ఉంది. ఒటర్ల జాబితా తనిఖీలలో ఎన్నో ఎన్నెన్లో చిత్ర విచిత్రాలు బయటపడుతున్నాయి. ఉమ్మడి కృష్ణా మైలవరం గ్రామంలో ఒకే వ్యక్తికి 12 ఓట్లు ఉన్న చిత్రం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి పేరు బండారు యుగంధర్ . బండారు యుగంధర్ అనే వ్యక్తికి మైలవరంలోని బూత్ నంబర్ 1లో, అలాగే బూత్ నంబర్ 2, బూత్ నంబర్ 178లో నాలుగేసి ఓట్లు ఉన్నాయి. అదే ఫొటో, అదే ఇళ్లు, అదే డేట్ ఆప్ బర్త్ తో అదే చిరునామాతో ఆయనకు 12 ఓట్లు ఉన్నాయి. తల్లిదండ్రులూ వాళ్లే. మరి ఒకే ఇంట్లో, ఒకే జంటకు, ఒకే సమయంలో బండారు యుగంధర్ డజను సార్లు ఎలా జన్మించారో ఆయన ఓటును అన్ని సార్లు నమోదు చేసిన ఎన్నికల సిబ్బందికే తెలియాలి. బండారు యుగంధర్ 12 ఓట్ల బాగోతం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ ట్రోల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో అధికార జగన్ పార్టీ కేవలం దొంగ ఓట్ల నమోదు, ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా ఉన్న వారి ఓట్ల తొలగింపు ద్వారానే వచ్చే ఎన్నికలలో విజయం సాధించేయగలమన్న ధీమాతో ఉంది. అందుకే క్షేత్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతున్న సంగతి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నా వైనాట్ 175 అన్న ధీమానే వ్యక్తం చేస్తున్నది.
ఏపీలో ఓటర్ల నమోదు, తొలగింపు అడ్డగోలుగా జరుగుతున్నాయనీ, తమ సానుభూతి పరుల ఓట్లు తొలగించేస్తున్నారనీ, దొంగ ఓట్ల నమోదును ఒక మహోద్యమంలా చేపట్టారనీ, తెలుగుదేశం, జనసేనలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులూ చేశారు. అలా ఫిర్యాదులు చేయడంతో కదిలిన కేంద్ర ఎన్నికల సంఘం తనిఖీలకు ఆదేశించింది. ఆ తనిఖీలలో చిత్ర విచిత్రాలు బయటపడుతున్నాయి. ఓటర్ల జాబితాను ట్యాంపర్ చేయడం ఇంత సులువా.. అధికారులను బెదరించో, బెల్లించో, బతిమాలో, బామాలో ఓటరు జాబితాలో ఎవరి ఓట్లు ఉండాలో, ఎవరి ఓట్లు తొలగించాలో అధికార పార్టీ నాయకులు నిర్ణయించేస్తారా అనిపించేలా ఈ అక్రమాలు ఉన్నాయి.
అసలు వైసీపీ వైనాట్ 175 ధీమాకు ఓటర్ల జాబితా తమకు అనుకూలంగా రూపొందుతోందన్న కారణమని ఏపీలో ఓటర్ల జాబితా తనిఖీలను చూస్తే అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాజయం తరువాత జగన్ సర్కార్ సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి తమ ఓటర్లు వేరే ఉన్నారని చెప్పిన దానికి కూడా అర్ధం ఏమిటో బోధపడుతోంది. ఒక అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచీ కనీసం పది వేల తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తొలగించేయడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకున్నదనీ, ఆ దిశగానే ఆ పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు అడుగులు వేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించి పక్కా ప్రణాళిక రూపొందించి, పకడ్బందీగా అములు చేయిస్తున్నది సజ్జల రామకృష్ణారెడ్డేనని తెలుగుదేశం ఆరోపిస్తున్నది. అందుకే ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారుల బదిలీలపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించినా కూడా బదలీలు యథేచ్ఛగా సాగుతున్నాయని చెబుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలలో ఈ ఓట్ల తొలగింపు భారీగా ఉంటోందనీ, అక్కడి తెలుగుదేశం నేతలు ఆందోళనలు వ్యక్తం చేయడంతో పాటు ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సజ్జల నేతృత్వంలో ఏర్పాటైన ఓ టీమ్.. వాలంటీర్ల ద్వారా ఓటర్ల సమాచారం సేకరించి ఎన్నికల వ్యూహాలను రచించే ఐ ప్యాక్ టీంకి అందించిందనీ, ఎక్కడెక్కడ ఓట్లు తీసేయాలో ఐప్యాక్ టీం ఒక ప్లాన్ సిద్ధం చేసి వైసీపీకి అందించిందనీ అంటున్నారు. అందుకు అనుగుణంగా వైసీపీ నేతలు ఫామ్ 7లతో దరఖాస్తులు ఇవ్వడం.. వాటిని అధికారులు ధృవీకరించి తొలగించడం జరిగిందని తెలుగుదేశం ఆరోపిస్తున్నది. పలు నియోజకవర్గాలలో ఈ ఓట్ల గల్లంతు వ్యవహారం బయటపడడంతో రంగంలోకి దిగిన కేంద్ర ఎన్నికల సంఘం దర్యాప్తు చేసి అధికారులపై వేటు వేసింది. బదిలీలను నిలిపివేసింది. అయినా ఈసీ ఆదేశాలను ఖాతరు చేయకుండా ఎడాపెడా బదిలీలు సాగుతున్నాయి. మరోవైపు సమయం చూసి ఇప్పుడు మరోసారి ఓట్ల గల్లంతు వ్యవహారాన్ని వైసీపీ ఆచరణలోకి పెట్టిందని తెలుగుదేశం, జనసేనలు ఆరోపిస్తున్నాయి. ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదుపై తెలుగుదేశం సీరియస్ గా దృష్టి పెట్టడంతో ఒకింత నెమ్మదించిన ఈ ప్రక్రియ.. చంద్రబాబు అక్రమ అరెస్టు తరువాత జోరందుకుందని అంటున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులు అందరూ ఆ అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆందోళనలు, ఉద్యమ బాట పట్టిన పరిస్థితిని అనువుగా చేసుకుని వైసీపీ మళ్లీ ఓట్ల తొలగింపు, నమోదు ప్రక్రయిను వేగవంతం చేసిందని అంటున్నారు. ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు విషయంలో వైసీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా ఈసీ కేవలం ఆదేశాలకు మాత్రమే పరిమితమవుతున్నది తప్ప చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.