Leading News Portal in Telugu

Blood Money: ఉరిశిక్ష నుంచి కేరళ నర్సును రక్షించాలంటే ‘బ్లడ్ మనీ’ ఒక్కటే మార్గం..



Kerala Nurse

Blood Money: కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్ కోర్టు మరణశిక్ష విధించింది. యెమెన్ దేశ పౌరుడిని హత్య చేసిన కేసులో 2017లో ఆమెకు శిక్ష విధించింది. అక్కడి సుప్రీంకోర్టు కూడా ఆమె చేసుకున్న అప్పీల్‌‌ని తిరస్కరించింది. అయితే ఇండియాలో ఉన్న ఆమె తల్లి మాత్రం కూతురు ప్రాణాల కోసం పోరాడుతోంది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో తాను యెమెన్ వెళ్లేందుకు అవకాశం కల్పించాలని ఈ ఏడాది ప్రారంభంలో ప్రియ తల్లి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు కేంద్రాన్ని కోరింది.

ఇదిలా ఉంటే ఈ కేసు నుంచి ప్రాణాలతో నిమిష ప్రియ బయటపడాలంటే కేవలం ‘బ్లడ్ మనీ’తో మాత్రమే సాధ్యమని న్యాయవాది సుభాష్ చంద్రన్ తెలిపారు. యెమెన్‌లో షరియా చట్టాన్ని పాటిస్తారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే బాధిత కుటుంబంతో నేరుగా చర్చలు జరపడమే మార్గమని, వారికి నష్టపరిహారానికి ఒప్పుకుని క్షమాభిక్ష పెడితేనే ప్రియ మరణశిక్ష నుంచి తప్పించుకోగలదని చెప్పారు.
అయితే అది అనుకున్నంత సులభం కానది చంద్రన్ వెల్లడించారు. 2016 నుంచి యెమెన్‌కి ప్రయాణ నిషేధం ఉంది. భారత ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడికి వెళ్లలేం. దీని కారణంగానే ప్రియ తల్లి యెమెన్ వెళ్లి భాదిత కుటుంబంతో చర్చించలేకపోతోందని అన్నారు.

Read Also: Israel-Hamas War: దక్షిణ గాజాపై ఇజ్రాయిల్ దాడుల్లో 32 మంది మృతి.. అల్ షిఫా నుంచి పారిపోతున్న రోగులు..

‘బ్లడ్ మనీ’ అనేది హత్య చేసిన వ్యక్తి, హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి ఇచ్చే నష్టపరిహారం. దీనిపై శిక్ష పడిన వ్యక్తి కుటుంబ సభ్యులు, బాధిత కుటుంబంతో చర్చించాల్సి ఉంటుంది. అయితే గురువారం ఢిల్లీ హైకోర్టు ప్రియ తల్లి యెమెన్ వెళ్లే అంశంపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది.

కేసు వివరాలు ఇవే:

కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియా కుటుంబం కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం యెమెన్ వెళ్లింది. 2014లో ఆమె భర్త, కూతురు తిరిగి ఇండియాకు వచ్చారు. అయితే నిమిష మాత్రం ఉద్యోగరీత్యా అక్కడే ఉండిపోయింది. ఆ దేశానికి చెందిన తలాల్ మహ్దీ సాయంతో అక్కడే ఓ క్లినిక్ ప్రారంభించింది. కాగా కొన్ని రోజులకే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. నిమిష ప్రియను అతను శారీరకంగా, మానసికంగా వేధించడమే కాకుండా ఆమె పాస్‌పోర్టును లాక్కున్నాడు. తన పాస్ పోర్టును తిరిగి పొందాలనే ఉద్దేశంతో నిమిష అతనికి మత్తుమందు ఇచ్చింది. ఇది ఓవర్ డోస్ కావడంతో అతను మరణించాడు. ఏం చేయాలో తెలియక హత్య విషయాన్ని వేరే వ్యక్తికి చెప్పింది. ఇద్దరూ కలిసి మృతదేహాన్ని మాయం చేశారు. నాలుగు రోజుల తర్వాత వారి నేరం బయటకు రావడంతో ఇద్దర్ని అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో యెమెన్ కోర్టు నిమిష ప్రియకు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.