Leading News Portal in Telugu

Israel-Hamas War: దక్షిణ గాజాపై ఇజ్రాయిల్ దాడుల్లో 32 మంది మృతి.. అల్ షిఫా నుంచి పారిపోతున్న రోగులు..



Israel

Israel-Hamas War: ఇన్నాళ్లు ఉత్తర గాజా ప్రాంతాన్ని మాత్రమే టార్గెట్ చేసిన ఇజ్రాయిల్ ఆర్మీ, ఇప్పుడు హమాస్‌ని పూర్తిగా నిర్మూలించడానికి దక్షిణ గాజాపై కూడా ఫోకస్ చేసింది. దక్షిణ గాజా లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దళం దాడులు చేసింది. శనివారం జరిగిన ఈ దాడుల్లో 32 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. గతంలో ఉత్తరగాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ గాజా ప్రజలను హెచ్చరించింది. లక్షలాది మంది ప్రాణాలు చేత పట్టుకుని దక్షిణ ప్రాంతానికి వెళ్లారు. అయితే ఇప్పడు దక్షిణ గాజాపై కూడా దాడులు మొదలయ్యాయి. 4 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ఖాన్ యూనిస్ లోని ప్రజల పరిస్థితి, మానవతా సంక్షోభం మరింత దిగజారే అవకాశం ఉంది. ‘‘మేము ప్రజల్ని వేరే ప్రాంతాలకు వెళ్లాలని కోరాము, వారిలో చాలా మందికి అది సులభం కానది తెలుసు. కానీ ఎదురుకాల్పుల్లో ప్రజలు చిక్కుకోవడం చూడకూడదని అనుకుంటున్నాము’’ అని ఇజ్రాయిల్ పీఎం బెంజిమిన్ నెతన్యాహు సహాయకుడు మార్క్ రెగెవ్ శుక్రవారం అన్నారు.

Read Also: World Cup 2023: ఆనాటి విధ్వంసకర ఇన్నింగ్స్‌ని గుర్తుచేసుకున్న రికీ పాంటింగ్..

గాజా స్ట్రిప్‌లోని 23 లక్షల జనాభాలో సగం మంది ఇప్పటికే వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు. ముఖ్యంగా హమాస్ కు పట్టు ఉన్న గాజా నగరంలో పాటు ఉత్తరగాజాపై ఇజ్రాయిల్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. కీలక హమాస్ కమాండర్లను, వారి స్థావరాలను మట్టుబెడుతున్నాయి. ఇప్పటి వరకు ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 12 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇందులో 5 వేల మంది పిల్లలు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే గాజాలోని ఆస్పత్రులను హమాస్ కమాండ్ సెంటర్లుగా, షెల్టర్లుగా, ఆయుధ కేంద్రాలుగా ఉపయోగించుకుంటున్నట్లు ఇజ్రాయిల్ బహిర్గతం చేసింది. దీంతో గాజా నగరంలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్ షిఫా ఆస్పత్రిని టార్గెట్ చేసింది. ఈ ఆస్పత్రి కంప్యూటర్లలో బందీలకు సంబంధించిన ఫుటేజ్ లభించింది. దీంతో పాటు ఆస్పత్రి కింద సొరంగాలను ఇజ్రాయిల్ ఆర్మీ కనుగొంది. యుద్ధం తీవ్రరూపం దాలుస్తున్న తరుణంలో అల్ షిఫా ఆస్పత్రిలోని రోగులు బయటకు వెళ్తున్నారు. శనివారం ఇజ్రాయిల్ సైన్యం ఆస్పత్రిని ఖాళీ చేయమని చెప్పిందని ఆస్పత్రి డైరెక్టర్ చెప్పిన నేపథ్యంలో రోగులు కాలినడకన వేరే ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అయితే ఇజ్రాయిల్ సైన్యం మాత్రం ఈ ప్రకటనను ఖండించింది.