Leading News Portal in Telugu

Top Headlines@5PM : టాప్ న్యూస్



Top Headlines @ 5 Pm

కాంగ్రెస్ లో అగ్ర కులాల వారే సీఎం అవుతారు.. ఈటల ఇంట్రెస్టింగ్‌ కమెంట్‌

కాంగ్రెస్ పార్టీలో కూడా అగ్ర కులాల వారే సీఎం అవుతారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట్రెస్టింగ్ కమెంట్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు వాళ్ళ కుటుంబ సభ్యులే తప్ప ఇతరులు సీఎం కాలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని మోడీ చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి దళితులను, గిరిజనులని, బీసీలను ముఖ్యమంత్రి చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో కూడా అగ్ర కులాల వారే సీఎం అవుతారని తెలిపారు. ప్రధాని మోడీ బీసీని సీఎం చేస్తా అంటే మీకు కోపమెందుకు? అని ప్రశ్నించారు. నేను గజ్వేల్‌లో ఎన్నికల్లో పోటీ చేస్తే హరీశ్‌రావుకు కోపం వస్తుందని ఈటల రాజేందర్ అన్నారు. గజ్వేల్ ప్రజల సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరించలేదన్నారు. పదేళ్లు గడిచినా తెలంగాణలో కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు.

నేను మంత్రిగా ఉన్నానంటే అది జగన్ పుణ్యమే..

నేను ఈ రోజు మంత్రిగా ఉన్నానంటే అది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పుణ్యమే అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్‌.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా 16వ రోజు కర్నూలు జిల్లా పత్తికొండలో ఆ బస్సు యాత్ర నిర్వహించారు.. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు.. ఇదే సమయంలో సీఎం వైఎస్‌ జగన్‌పై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఓట్లకోసమే వాడుకున్నారు అని ఆరోపించారు. చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఆర్థిక, విద్య, వైద్య, రాజకీయ, సామాజిక, సాధికారతలో న్యాయం చేయలేదని దుయ్యబట్టారు. వైఎస్‌ జగన్ హయాంలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీవర్గాలకు సామాజిక సాధికారత దక్కిందని స్పష్టం చేశారు. నేను మంత్రిగా ఉన్నానంటే అది జగన్ పుణ్యమేనన్న ఆయన.. డిప్యూటీ సీఎం, మంత్రి పదవులు.. మైనార్టీ, బీసీలకు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌దే అన్నారు. మంచి జరిగి ఉంటేనే మరోసారి వైఎస్‌ జగన్ ను ఎన్నుకోండి అంటూ పిలుపునిచ్చారు మంత్రి ఆదిమూలపు సురేష్‌.

కామారెడ్డిలో కేటీఆర్‌ రోడ్ షో.. రేవంత్‌రెడ్డికి మంత్రి కౌంటర్‌

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలోని పెద్ద మల్లారెడ్డిలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. టీపీసీసీ ఛైర్మన్‌ రేవంత్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీలు తెలంగాణ కరెంట్‌పై చేసిన కామెంట్స్‌కి కౌంటర్‌ ఇచ్చారు. రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీలు విద్యుత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్‌ హయాంలో కరెంట్‌ కష్టాలు ఉండేవన్నారు. కామారెడ్డిలో పోటీ చేస్తున్న రేవంత్‌ రెడ్డి నియోజకవర్గంలో విద్యుత్‌ తీగలు పట్టుకుంటే కరెంట్‌ ఉందో లేదో తెలుస్తుందని కౌంటర్‌ ఇచ్చారు.

తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుతు కష్టాలు తీర్చామన్నారు. అందువల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని, బీడీ కార్మికులకు కాంగ్రెస్ ఏనాడు పట్టించుకోలేదని.. మేము పెన్షన్ ఇచ్చి ఆదుకున్నామన్నారు. కేసీఆర్ కామారెడ్డి నుండి గెలిచి హ్యాట్రిక్ సీయం కాబోతున్నారని, వచ్చే ప్రభుత్వంలో కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. రాహుల్ గాంధీకి, మోడీకి తెలంగాణపై ప్రేమ లేదని, కేసిఅర్‌ని కామారెడ్డిలో గెలిపిస్తే నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు.

సీఎం, మంత్రులు అందుబాటులో లేని సెక్రటేరియేట్ ఎందుకు..?

సీఎం, మంత్రులు అందుబాటులో లేని సెక్రటేరియేట్ ఎందుకు..? అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నిక దొర తెలంగాణకు.. ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతోన్న యుద్దం అన్నారు. ముదిగొండ మండలం ఖానాపురం గ్రామంలో భట్టి కార్నర్ మీటింగ్ లో పలువురు బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భట్టి తెలంగాణ సీఎం కావాలంటూ ఖానాపూర్ గ్రామస్తుల ఆకాంక్ష అని అన్నారు. జలగం వెంగళరావు తర్వాత ఖమ్మం జిల్లా నుంచి భట్టికే అవకాశం ఉందన్న ఖానాపూర్ వాసులు తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలో ఎన్నికల ప్రచారంలో భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చి పదేళ్లు కావస్తోన్నా.. సీఎం, మంత్రులు సెక్రటేరీయేట్టుకు రావడం లేదని అన్నారు. సీఎం, మంత్రులు అందుబాటులో లేని సెక్రటేరీయేట్ ఎందుకు..? అని ప్రశ్నించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కుంగిపోతున్నాయని తెలిపారు. కాళేశ్వరం పేరుతో రూ. 1లక్ష కోట్లు.. మిషన్ భగీరధ పేరుతో రూ. 50 వేల కోట్లు నిరుపయోగం చేశారని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీ జరుగుతోందని మేం గొంతు చించుకుని అరిచాం.. గళమెత్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదిలించుకోకుంటే రాష్ట్రానికే భవిష్యత్తే ఉండడదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించుదాం.. టీఆర్ఎస్ నేతలను దంచుదాం.. సంపదను ప్రజలకు పంచుదామన్నారు.

ఎంత పెద్ద మొగోడైన ప్రజా తీర్పుకు తల వంచాల్సిందే..

ఎంత పెద్ద మొగోడైన ప్రజా తీర్పుకు తల వంచాల్సిందే అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో అనేక గ్రూప్ లు ఉన్నాయని అన్నారు. అందరం ఐక్యతతో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అహంకారంకు పోకుండా పని చేయాలని పిలుపునిచ్చారు. 10 ఏళ్లుగా ఈ ప్రాంతానికి పట్టిన దరిద్రంను పోగొట్టేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలన్నారు. 10 రోజులలో 18 గంటలు కష్టపడి ఓటర్లను బూత్ ల వరకు తీసుకు వెళ్ళాలని అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తుందన్నారు. అధికారంలో ఉన్న వ్యక్తికి హుజూరాబాద్ లో వందల కోట్లు ఖర్చు పెట్టిన అధికార పార్టీకి ఫలితం దక్కలేదని.. అక్కడ వచ్చిన ఫలితమే సత్తుపల్లి లో వస్తుందన్నారు. డబ్బుతో రాజకీయం చేయలేం..అది సాధ్యం కాదన్నారు. బడా బాబులు వచ్చి డబ్బుల సంచులు ఇచ్చినంత మాత్రాన సత్తుపల్లి ప్రజలు మోసపోరని తెలిపారు. కరోనా సమయంలో నీళ్ల ఇంజక్షన్ లు చేసి డబ్బులు పోగేసి ఆ డబ్బులు ఇప్పుడు ఖర్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేను ఆ మాటలు చెప్పలే.. ఫిర్యాదు చేయలే..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ చెబుతున్నట్లుగా రైతుబంధు ఆపాలని తాను ఎక్కడా ఫిర్యాదు చేయలేదన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నామినేషన్ ప్రక్రియకు ముందే రైతు బంధు, ఇతర పథకాలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుబంధు నిధిని పెంచాలన్నారు. రైతుబంధును ఆపాలని తానుగానీ, కాంగ్రెస్‌ నేతలుగానీ కోరలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టులు 70 ఏళ్లుగా లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్నా చెక్కు చెదరలేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నాసిరకం నిర్మాణం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయిందని ఆరోపించారు.

చారిత్రక ఘట్టం సత్తుపల్లితో మొదలవుతుంది

ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. చారిత్రక ఘట్టం సత్తుపల్లితో మొదలవుతుందన్నారు. సొంతంగా ఖర్చు పెట్టి అభ్యర్థులను గెలిపించే ఓటర్లు ఉన్న ఏకైక నియోజకవర్గం సత్తుపల్లి మాత్రమేనని, నేను, శ్రీనివాస్ రెడ్డి వేరు కాదన్నారు తుమ్మల నాగేశ్వర రావు. అహంకారం కు అతమాభిమనం మధ్య ఇప్పుడు పోటీ జరుగుతుందని, ప్రజల కోసం చిత్తశుద్దితో యజ్ఞం ల రాజకీయం చేశానన్నారు. సీతారామ ఇస్తనంటేనే ప్రభుత్వం లో చేరాననని తుమ్మల వ్యాఖ్యానించారు. చిన్నప్పుడే ఎన్టీఆర్‌ మంత్రి పదవి ఇచ్చారు.. మంత్రి పదవి అవసరం లేదు.. మంత్రి పదవి కోసం పార్టీలో చేరలేదన్నారు తుమ్మల.

నాడు నీళ్ళ కోసం ఎంతో గోస.. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా

నిజామాబాద్ అర్బన్ రోడ్ షో లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… గులాబీ జెండా రాకముందు ఎలా ఉండే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందని, నాడు నీళ్ళ కోసం ఎంతో గోస. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా అని ఆయన ప్రశ్నించారు. రేషన్ షాపుల ద్వారా పాత బియ్యం, సన్నబియ్యం ఇవ్వబోతున్నామని ఆయన వెల్లడించారు. మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి పథకం అమలు చేయబోతున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. బీజేపీ వాళ్ళు పేదల కోసం ఒక్క మంచి పని అయినా చేశారా? అని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాగానే మళ్లీ 400 లకే సిలిండర్ ఇవ్వ్వబోతున్నామని హరీష్‌ రావు వెల్లడించారు. రైతు బీమా లాగా కోటి కుటుంబాలకు 5 లక్షల బీమా అందించబోతున్నామని, కేసీఆర్ రాకముందు నిజామాబాద్ ఎంత మారిందన్నారు మంత్రి హరీష్ రావు.

అమరావతి రాజధాని అని బీజేపీ కట్టుబడి ఉంది..

విజయవాడలో శక్తి కేంద్ర ప్రముఖులు, బూత్ అధ్యక్షులతో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హాజరయ్యారు. సంస్థాగతంగా‌ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తల అభిప్రాయాల మేరకు రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపడుతున్నానని ఆమె వెల్లడించారు. పార్టీ పునాది బాగుంటే గాలి అనే మాట ఉండదు.. ఏ పార్టీ వైపు గాలి వీచినా మనం ఎంత బలంగా ఉన్నామో తెలుస్తుందన్నారు. హోం మంత్రి వనిత వేధింపులతో ఓ ఎస్సీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని.. సామాజిక బస్సు యాత్ర వైసీపీ చేపడుతోందని.. మరి ఆ కుర్రోడికి సామాజికంగా ఏం చేశారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రజల్లో రాజకీయ పార్టీలు ఒక అపోహ సృష్టించారని.. ఆ సమయంలో బీజేపీని దోషిగా చూపించడంలో సఫలమయ్యారని మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నా తమ సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆమె విమర్శించారు. అమరావతి రాజధాని అని బీజేపీ కట్టుబడి ఉందన్నారు. విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజికి, రోడ్లకు 500 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించిందన్నారు. రాజధానిలో మౌళిక సదుపాయాల కోసం కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించిందని ఆమె చెప్పారు. రాష్ట్రంలో అరాచక, విధ్వంస‌పాలన సాగుతోందన్నారు.

కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే కేసీఆర్ గంపకింద కమ్ముతాడు

భైంసా అంటే జోష్.. సీఎం కేసీఆర్‌ ఏడికి పోయినా బీజేపి తిట్టడం తప్పా ఏం అభివృద్ధి చేశారో చెప్పడంలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఔట్ అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయితడని బండి సంజయ్‌ జోష్యం చెప్పారు. కేసీఆర్ పాస్ పోర్టు ల బ్రోకర్ అని ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్, కేసీఆర్ కుటుంబం ఏం చేసిందని, ఎన్నికల ముందు కేటీఆర్ కు బండి సంజయ్ అంటే లాగు తడుస్తదన్నారు. నన్ను గెలుకుతే.. నేను ఊరుకోనని, 14 వందల మంది బలి తీసుకున్నాక కాంగ్రెస్ బిల్లు పెట్టిందన్నారు. కేసీఆర్ నటించుడు కాదు. జీవిస్తాడని, తెలంగాణ రావద్దు అని కోరుకున్నాడు కేసీఆర్ అని ఆయన విమర్శించారు.

కేటీఆర్‌ని సీఎం చేయడానికి సీఎం కేసీఆర్ ఏమైనా చేస్తారు

సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. కేటీఆర్ ని సీఎం చేయడానికి సీఎం కేసీఆర్ ఏమైనా చేస్తారనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్ళు కేసీఆర్ అడుగులో అడుగేసిన తనని అడ్డు వస్తానని బయటికి గెంటేశారని, మంత్రి హరీష్ రావును కూడా అదే గతి పట్టేదన్నారు. అల్లుడు కాబట్టి బచాయించిండు.. బయటివాన్ని కాబట్టి నన్ను నెట్టేసిండని ఈటల రాజేందర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు సిద్ధమయ్యారని, వారు డబ్బు ఇస్తే తీసుకోండి.. ఓటు మాత్రం బీజేపీకి వేయండని ప్రజలను కోరారు. బస్తీ ప్రజలకు డబుల్‌ బెడ్‌రూం ఇచ్చే దమ్ము కేసీఆర్‌కు లేదని, పేదలు గుడిసెలు వేసుకున్న భూములను లాక్కొని, పేద్దోళ్లకు కట్టపెడుతున్నాడని ధ్వజమెత్తారు.