Leading News Portal in Telugu

కల చెదిరింది.. కానీ కథ మారలేదు.. వరల్డ్ కప్ చేజారింది. | india loose final| world| cup| cricket| australia| man| of| the| tourney


posted on Nov 20, 2023 6:20AM

అబేధ్యమైన జట్టు.. వరల్డ్ కప్ టోర్నీ ఆరంభమైన తరువాత మ్యాచ్ మ్యాచ్ కూ టీమ్ ఇండియాపై అంచనాలు ఆకాశమే హద్దుగా పెరిగిపోయాయి. టాప్ ఆర్డర్ అందరూ ఫామ్ లో ఉన్నారు. బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఫీల్డింగ్ పైతం వేరే లెవెల్ లో ఉంది. టీమ్ ఇండియా ఈ సారి వరల్డ్ కప్ కొట్టేస్తుంది. 140 కోట్ల మంది ఇండియన్స్ తో పాట్.. క్రికెట్ ప్రపంచం అంతటా ఇవే అంచనాలు. దీనికి తోడు వరల్డ్ కప్ టోర్నీకి వేదిక భారత్. సొంత గడ్డపై ఆడటం కూడా కలిసొచ్చేదే. అన్నిటికీ మించి టోర్నీకి ఆతిథ్యమిచ్చిన జట్టే విజయం సాధిస్తుందన్న సెంటిమెంట్ ఒకటి గత కొంత కాలంగా క్రికెట్ ప్రపంచంలో ఉంది. ఇలా ఈ సారి కప్పుకూ, ఇండియాకూ మధ్య ఎవరూ, ఏ జట్టూ రాలేదన్న భావన క్రికెట్ లవర్స్ లో బలంగా ఏర్పడింది. అందుకు తగ్గట్టే.. లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది విజయాలు. ఫైనల్ లో టీమ్ ఇండియాపై పూర్తి ఆధిపత్యంతో విజయం సాధించిన ఆస్ట్రేలియానే  లీగ్ దశలో చిత్తుగా ఓడించిన రికార్డు కూడా ఉంది. దీంతో ఫైనల్ లో ఆస్ట్రేలియాతో తలపడాలి అనగానే..ఆ ఏముంది..లీగ్ దశలో మన విజయాల బోణీయే ఆసీస్ తో కదా అన్న ధీమా అందరిలో వ్యక్తం అయ్యింది. 

అన్నిటికీ మించి సెమీస్ లో న్యూజిలాండ్ గండం దాటగలమా? అని అభిమానుల్లో ఏమూలో ఉన్న శంకను కూడా టీమ్ ఇండియా తన సాధికార ఆటతీరుతో పటాపంచలు చేసేసింది. బలంగా పుంజుకున్న న్యూజిలాండ్ ను ఒక్క సారిగా కుప్ప కూల్చి అజేయ జట్టుగా ఫైనల్ కు అడుగుపెట్టిన టీమ్ ఇండియా.. ఫైనల్ లో చతికిల పడింది. దానినీ అలవోకగా గెలిచేస్తాం.. మూడోసారి ప్రపంచ కప్‌ చేజిక్కించుకుంటామన్నదే.. టీమ్ ఇండియాపై అందరిలోనూ వ్యక్తమైన విశ్వాసం.  అయితే  ఆదివారం (నవంబర్ 19) అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ లో అంచనాలు తారుమారయ్యాయి. భారత్ కల చెదిరింది. ఫైనల్ లో ఆసీస్ చేతిలో ఓటమి అన్న కథ మాత్రం మారలేదు. 2003లో కూడా వరల్డ్ కప్ ఫైనల్ లో ఆసీస్ చేతిలోనే పరాజయం పాలైన.. నాటి కథే.. పదేళ్ల తరువాత 2023లోనూ పునరావృతమైంది.  

ఆటలో గెలుపు ఓటములు సహజం. ప్రతి మ్యాచ్ గెలవాలన్న తపన, పట్టుదల మంచిదే కానీ.. ఓటమి కూడా పొంచే ఉంటుంది. ఆసీస్ తో వరల్డ్ కప్ ఫైనల్ లో అదే జరిగింది. ప్రపంచ వరల్డ్ కప్ 2023 టోర్నెమెంట్ ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసిన టీమ్ ఇండియా కచ్చితంగా అభినందించాల్సిందే. చివరి మెట్టుమీద బోల్తా పడిందంటే.. అది బ్యాటర్ల వైఫ్యలమనో, బౌలర్లు తేలిపోయారనో విశ్లేషణలు, విమర్శలు చేయడం సరికాదు. క్రికెట్ లో ఆటదే ఆధిపత్యం కావాలి కానీ, వాతావరణానికి దాసోహం  అన్నట్లుగా గెలుపు ఓటములు ఉండటం సరికాదు.

భారత్ లో వింటర్ లో మంచు ప్రభావం గురించి తెలియనిది కాదు. అటువంటిది వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలో జట్ల జయాపజయాలు ఆటగాళ్ల ప్రదర్శన మీద కాకుండా మంచు ప్రభావం మీద ఆధారపడి ఉండటం దారుణం. ఇక నుంచి ఇటువంటి టోర్నీలలో ఈ విషయాన్ని కూడా పరిగణనలోనికి తీసుకుని డే నైట్ మ్యాచ్ ల నిర్వహణను ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆదివారం (నవంబర్ 19)న జరిగిన వరల్డ్ కప్ టోర్నీనే తీసుకుంటే తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా పిచ్ పై బంతి నెమ్మదిగా వస్తుండటం ఇబ్బంది పెట్టింది. ఓకే ఆసీస్ బౌలర్లు కూడా పూర్తి డిసిప్లిన్ తో వేశారు. అందులో సందేహం లేదు. అయితే ఆసీస్ బ్యాటింగ్ చేసే సమయానికి  మంచు ప్రభావం ఎంతగా ఉందంటే.. తొలుత టీమ్ ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పూర్తిగా బౌలర్లకు సహకరించిన పిచ్.. ఆ తరువాత బ్యాటింగ్ కు స్వర్గధామంగా మారిపోయింది. బంతి చక్కగా బ్యాట్ మీదకు వచ్చింది. ఆట తేలిక అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ బౌలర్ అయినా, ఏ జట్టైనా చేయగలిగిందేముంది. అందుకే టీమ్ ఇండియా వరల్డ్ కప్ దక్కించుకోలేకపోయింది. కానీ కోట్లాది మంది క్రికెట్ లవర్స్ హృదయాలను గెలుచుకుంది. 

ఫైనల్ లో ఒటమిని పక్కన పెడితే.. ఈ టోర్నీలో టీమ్ ఇండియా పది విజయాలను సాధించింది. అన్నీ సాధికార విజయాలే. వాటిలో ఆస్ట్రేలియా కూడా ఉంది. లీగ్ దశలో టీమ్ ఇండియా ఆడిన తొలి మ్యాచ్ లోనే ఆస్ట్రేలియాను ఓడించింది. అలాగే టోర్నీలో పది జట్లు ఇండియాతో సహా పాల్గొంటే ఇండియా ఆ తొమ్మిది జట్లనూ ఓడించింది. అంతేనా..టోర్నీలో . అత్యధిక పరుగుల రికార్డు విరాట్ కోహ్లీది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కూడా కోహ్లీయే. 11 మ్యాచ్ లలో ఆరడజను అర్ధశతకాలు, మూడు సెంచరీలతో కోహ్లీ అనితర సాధ్యుడిగా నిలిచాడు. సచిన్ పేరిట ఉన్న అత్యధిక వన్డే సెంచరీల రికార్డును తిరగరాసి భళా అనిపించుకున్నాడు. ఆ తరువాత అత్యధిక వికెట్ల రికార్డు మహ్మద్ షమీది. కెప్టేన్ గా అత్యధిక పరుగుల రికార్డు రోహిత్ శర్మది. ఇన్ని ఘనతలు సాధించిన టీమ్ ఇండియాకు అభినందనలు.