
Jharkhand: ఉద్యోగం ఈ రోజు కాకపోతే ఏదో రోజు వస్తుంది. కాని ప్రాణం పోతే తిరిగి రాదు. అలాంటిది ఉద్యోగం కోసం అల్లారు ముద్దుగా గుండెల మీద పెట్టుకుని పెంచిన తండ్రినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. ఈ ఘటన జార్ఖండ్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ లోని రామ్‌గఢ్ జిల్లాకు చెందిన రామ్‌జీ ముండా అనే వ్యక్తి సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ (సిసిఎల్) లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా అతని కొడుకు నిరుద్యోగిగా ఉన్నాడు. అయితే సిసిఎల్ సంస్థలో పని చేసే ఎవరైనా హఠాత్తుగా మరణిస్తే ఆ వ్యక్తి పైన ఆధార పడిన సదరు కుటుంభసభ్యుల్లో ఎవరికైనా కారుణ్య నియామకం కింద ఉద్యోగాన్ని కల్పిస్తారు. దీనితో ఉద్యోగం కోసం తండ్రినే చంపాలి అని నిర్ణయించుకున్నాడు రామ్‌జీ కొడుకు.
Read also:Pawan Kalyan: తెలంగాణలో పవన్ ప్రచారం.. ఈనెల 22న వరంగల్ లో రోడ్ షో..?
దీని కోసం ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌ని కూడా నియమించుకున్నాడు. నవంబర్ 16వ తేదీనా రామ్‌గఢ్‌లో బైక్‌పై వెళ్తున్న రామ్‌జీపై గుర్తుతెలియని దుండగులు పట్ట పగలు కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రామ్‌జీ ని రామ్‌గఢ్ లోని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కాగా రామ్‌జీ పరిస్థితి విషమించడంతో అతన్ని రాంచీకి తరలించారు. అయితే ఈ ఘటన గురించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో రామ్‌జీ హత్యా యత్నం వెనుక రామ్‌జీ కుమారుడు అమిత్ ముండా హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు అమిత్‌ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దాడి చేసిన వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు.