Leading News Portal in Telugu

ప్రజాక్షేత్రంలోకి బాబు లోకేష్.. ఇక జగన్ కు చుక్కలే! | regular bail to babu| down| fall| ycp| chandrababu| tours| lokes| yuvagalam| people| tdp


posted on Nov 22, 2023 6:16AM

ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉంది. నాలుగున్నరేళ్ల పాలన కాలంలో కక్షసాధింపుకు ప్రాధాన్యమిచ్చిన సీఎం జగన్.. చివరి ఆరు నెలలలో దాన్ని  తారస్థాయికి తీసుకెళ్లే పనిలో పడ్డారు.   దీంతో అసలే అసంతృప్తితో ఉన్న ప్రజలలో ఇప్పుడు ఆ అసంతృప్తి స్థాయి కూడా తీవమైంది. ఇక్కడా అక్కడా అని లేకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో, అన్ని వర్గాలలో వైసీపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నది. దీంతో ప్రతిపక్షాలను అణచివేయాలనో.. లేక అసలు అడ్డు లేకుండా చేయాలనో  కానీ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించారు. అర్ధరాత్రి వేళ ఆయన బస చేసిన చోట నుండే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్ట్ చేశారు. అది కూడా కనీసం చార్జ్ షీటులో పేరు కూడా లేకుండా అరెస్టుకు తెగబడ్డారు. ఆ తర్వాత ఆయన  జైలు నుండి బయటకి రాకుండా ఉంచేందుకు కూడా తీవ్రంగా శ్రమించారు. కానీ ఎట్టకేలకు చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది. అది బేషరతుగా. స్కిల్ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలూ సీఐడీ చూపించలేదని కోర్టు విస్పష్టంగా తేల్చేసింది. దీంతో వైసీపీకి మళ్ళీ బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

 చంద్రబాబు అరెస్టుకు ముందు అధికార పార్టీ వైసీపీ తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి ఉండేది. ఒకవైపు టీడీపీ అధికార ప్రతినిధి నారా లోకేష్ యువగళం పాదయాత్ర, చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలన, బస్సు యాత్ర, జనసేన అధినేత పవన్ కళ్యాణ్   వారాహీ యాత్ర  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టాయి. ప్రతిపక్షాలు సంధించే ఒక్కో ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేక వైసీపీ నేతలు తెల్ల మొహాలు వేసేవారు. అయితే, చంద్రబాబుఅరెస్టు  తరువాత   వైసీపీకి కొద్దిగా ఊపిరి పీల్చుకుని ఉక్కిరిబిక్కిరి పరిస్థితి నుంచి బయటపడే అవకాశం వచ్చింది.తెలుగుదేశం నిరసనలు, ధర్నాలు హోరెత్తినా.. తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దేశ, విదేశాలలో కూడా చంద్రబాబుకు సంఘీభావంగా జనం బయటకు వచ్చి ఆందోళనలు చేసినా.. ప్రభుత్వ అక్రమాలు, అరాచక పాలన వంటి అంశాల నుంచి ప్రజలను ఏమార్చేందుకు ప్రభుత్వానికి అవకాశం లభించింది. అయితే ఎప్పుడైతే చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై బయటకి వచ్చారో మళ్ళీ టీడీపీ, జనసేనలు కలిసికట్టుగా ప్రభుత్వంపై దాడి మొదలు పెట్టారు. ఇక ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు కావడంతో ప్రతిపక్ష నేతలు అప్పుడు ఎక్కడ ప్రజా సమస్యలపై పోరాటం ఆపారో.. మళ్ళీ ఇప్పుడు అక్కడి నుండే మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మునుపటి కంటే జోష్ తో తెలుగుదేశం, జనసేన కలిసి ఇప్పుడు ఈ పోరాటం మొదలు పెట్టనున్నారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ తో లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక బ్రేకిచ్చిన సంగతి తెలిసిందే.   హైకోర్టులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ దక్కింది.. సుప్రీంలో క్వాష్ పిటిషన్ కూడా ఈ నెలాఖరుకి తేలిపోయే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే నిలిచిపోయిన లోకేష్ యువగళం పాదయాత్రను కొనసాగించేందుకు నిర్ణయించారు.    రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర ఎక్కడ అయితే తాత్కాలికంగా నిలిచిందో అక్కడ నుంచే కొనసాగించనున్నారు. ముందుగా అనుకున్నట్లు శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగింపు సభ పెట్టాలా.. లేక వైజాగ్ నగరంలోనే భారీ సభతో ముగించాలా అని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. యువగళం ముగింపు సందర్భంగా సభ నిర్వహించే విషయమై ఇప్పటికే ఉత్తరాంధ్ర నేతలతో లోకేష్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

 కాగా, ఇక ఈ నెలాఖరు నుండి చంద్రబాబు కూడా ప్రజల మధ్యకి వెళ్లనున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని మళ్లీ తిరిగి ప్రారంభించనున్నారు.  తర్వాత, సాధ్యమైనంత త్వరలో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీంతో పాటు చంద్రబాబు కోసం మరో కొత్త కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, దాదాపు మూడు నెలల తర్వాత మళ్ళీ ప్రజల మధ్యకి రానున్న చంద్రబాబు ఏం మాట్లాడతారు? ప్రజలకు ఏం చెప్పనున్నారన్నది రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. తనపై అక్రమ కేసులు పెట్టి ఎలా వేధిస్తున్నారన్నది చంద్రబాబు ప్రజలకి వివరిస్తే వైసీపీకి మరింత నష్టం తప్పదనే భావన ఉంది. చంద్రబాబు అక్రమ అరెస్గు తరువాత ఆబాలగోపాలానికి బాబు వ్యక్తిత్వ ఔన్నత్యం తెలిసింది. చంద్రబాబు విజన్, చంద్రబాబు గొప్పతనం గురించి ఊరూరా చర్చ జరిగింది. రాజకీయాలతో సంబంధం లేని వారు కూడా బయటకు వచ్చి బాబు రాష్ట్రానికి, దేశానికి చేసిన మేలు గురించి వివరించారు. దీంతో ఇప్పుడు జనం చంద్రబాబు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఏర్పడింది.  అందుకే చంద్రబాబు పర్యటనలకు జనం పోటెత్తడం ఖాయమన్న అంచనాలున్నాయి. అలాగే ప్రజా సమస్యలపై తెలుగుదేశం, జనసేన ఉమ్మడి కార్యాచరణ మొదలైంది. మొత్తంగా చూస్తే చంద్రబాబుకు పూర్తి స్థాయి బెయిల్ దక్కడంతో ఇక వైసీపీకి డౌన్ ఫాల్ ప్రారంభమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.