Leading News Portal in Telugu

వందల కోట్లతో పార్టీ ప్రచారం.. సొమ్ము మాత్రం ప్రజలదే.. జగన్మాయ కొత్త పుంతలు! | ycp party campaign with public money| jagan| violating| stipulate| terms| conditions


posted on Nov 22, 2023 1:55PM

ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ పుణ్యమో లేక గత ఎన్నికలలో గట్టెక్కించిన  గోబెల్స్ ప్రచారమే మళ్లీ  గట్టెక్కిస్తుందన్న ఆశో తెలియదు కానీ  ఏపీలో వైసీపీ ఇప్పుడు కూడా పూర్తిగా సోషల్ మీడియా ప్రచారాన్నే నమ్ముకుంది. సీఎంగా జగన్ ప్రజల మధ్యకు రావడం ఎప్పుడో మానేశారు. కనీసం పార్టీ అధ్యక్షుడి హోదాలో కూడా జనం మధ్యకు వచ్చే పరిస్థితే లేదు. ఇక అధినేతే అలా జనాలకు మొహం చాటుస్తుంటే నాయకులు మాత్రం జనాలను ఎలా ఫేస్ చేయగలరు? సో ఏపీలో అధికార పార్టీకి ప్రజలతో కనెక్షన్ కట్ అయిపోయి చాలా కాలమైంది. అధవా ఏదో కార్యక్రమం పేరు చెప్పుకుని నేతలు జనంలోకి వచ్చినా వారికి నిరసనలు, ప్రతిఘటనలే ఎదురౌతున్నాయి. దీంతో వైసీపీ ఇప్పుడు ఇక పార్టీ ప్రచారానికి పూర్తిగా సోషల్ మీడియాపైనే ఆధారపడింది. దానినే నమ్ముకుంది.  వాస్తవాల సంగతి పక్కన పెట్టేసి.. తనకు కావాల్సినట్లుగా ప్రజలను నమ్మించడమే వైసీపీ  సోషల్ మీడియా విభాగం పని.  గత ఎన్నికలకు ముందు ఏపీలో పీకే ఐ ప్యాక్ టీం భారీ ఎత్తున వైసీపీ కోసం సోషల్ మీడియా క్యాంపైన్ చేసింది. జరగబోయే ఎన్నికలకు కూడా ఐ ప్యాక్ టీం జగన్ మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నది. అయితే, ఈ సారి గత ఎన్నికలకు చేసినంత చేస్తే సరిపోదనీ, అంతకు మించి చేయాలని జగన్ ఆయన నమ్ముకున్న ఐప్యాక్ భావిస్తున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.  ఆ మధ్య జనసేన తెలుగుదేశం పొత్తుకు సిద్దమవుతుందన్న ఊహాగానాల సమయం నుండే వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్ అయింది. ముందుగా పొత్తును దెబ్బతీసేందుకు రకరకాల ఎత్తులు వేసిన వైసీపీ.. తన సోషల్ మీడియాలో  శృతి మించి అబద్ధాల ప్రచారానికీ, అనుచిత వ్యాఖ్యల ద్వారా ప్రత్యర్థులను ట్రోల్ చేయడానికీ, ఇంకా చెప్పాలంటే ఆ పొత్తు పొసగకుండా ఇరు పార్టీల మధ్యా గ్యాప్ పెంచడానికీ శతథా కృషి చేసింది. అయినా ఫలితం ఇల్లే అవ్వడంతో ఇప్పుడు ఇంకాస్త డోస్ పెంచాలని నిర్ణయించింది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే  వందల కోట్లు ఖర్చు పెట్టైనా సరే.. టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టి పొత్తు ఫలితం లేకుండా చేయాలని భావిస్తున్నది. పరిశీలకులు వైసీపీ సామాజిక మాధ్యమం ద్వారా సాగిస్తున్న ప్రచారం సరళిని ఇలాగే విశ్లేషిస్తున్నారు. 

ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలల సమయం ఉంది. కానీ  వైసీపీ ఇప్పటికే సామాజిక మాధ్యమం ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ఓ రేంజ్ లో మొదలు పెట్టేసింది.  గతంలో జనసేన-టీడీపీ పొత్తును దెబ్బతీసేందుకు మొదలు పెట్టిన పెయిడ్ క్యాంపైన్ ను ఇప్పుడు ఎన్నికల ప్రచారంగా మార్చేసిందని పరీశీలకులు అంటున్నారు. ఇప్పటికే వందల కొద్దీ యూట్యూబ్ చానెళ్లు, వేలసంఖ్యలో సోషల్ మీడియా ఖాతాలు కొనుగోలు చేసిన వైసీపీ డిజిటల్ విభాగం..  ఇప్పుడు ఆయా చానెళ్లు, ఖాతాలలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేసినట్లు పరిశీలకులు సోదాహరణంగా వివరిస్తున్నారు..  ఏపీ వ్యాప్తంగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల యాడ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా యూట్యూబ్ లలో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

యూట్యూబ్ లో మనం ఎలాంటి కంటెంట్ చూసినా వీడియోపై యాడ్స్ రావడం చాలా కామన్ .  వీటిలో కొన్నిటిని కనీసం 5 సెక‌న్లు ఇష్టమున్నా లేకున్నా చూడాల్సి ఉంటుంది. తర్వాత కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. మరి కొన్ని యాడ్స్ అయితే పూర్తి అయ్యేవ‌ర‌కు చచ్చినట్లు వేచి ఉండాల్సిందే.   యూట్యూబ్ వీడియోపై ఇలాంటి యాడ్స్ ఇవ్వాలంటే డైరెక్ట్ గా యూట్యూబ్ తోనే ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఒప్పందం చేసుకుంటే ఎలాంటి వీడియోలపై యాడ్స్ రావాలి.. ఏ లొకేషన్ లో ఉన్న యూజర్స్ యాడ్స్ చూడాలి..  ఏ సమయంలో ఈ యాడ్స్ రావాలి వంటివి యూట్యూబ్ మానిటర్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఏపీలో ప్రజల ఫోన్లలో యూట్యూబ్ లో వీడియో కంటెంట్ చూసే క్రమంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై ప్రకటనలు ఇస్తున్నారు. ముఖ్యం నవరత్నాలలోని పథకాలపై ప్రకటనలు వస్తున్నాయి. పథకాలపై ప్రజలు గొప్పగా చెప్పినట్లుగా   ప్రకటనలు ఉంటున్నాయి. ఇక మ‌రికొన్ని అడ్వర్టైజ్ మెంట్లు చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై విమర్శలతో నిండి ఉంటున్నాయి. 

సాధారణంగా యూట్యూబ్ ఏదైనా ప్రోడక్ట్, కంపెనీ గురించి ప్రకటనలకు ఒక స్థాయి ఛార్జి చేస్తే.. రాజకీయ ప్రకటనల కోసం మరో స్థాయిలో వసూళ్లు చేస్తుంది.  ఈ స్థాయిలో యూట్యూబ్ యాడ్స్ ఇవ్వాలంటే కనీసంలో కనీసం వందల కోట్లలో ఖర్చు ఉంటుంది. అలా వందల కోట్లు వ్యయం చేసి మరీ ప్రకటనలు గుప్పిస్తున్న వైసీపీ ఇందు కోసం పార్టీ సొమ్మును కూకుండా ప్రజల సొమ్మును అంటే ప్రభుత్వ సొమ్మును వ్యయం చేస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేసే లెక్కలో ప్రభుత్వ నిధులతోనే ఈ ప్రకటనలు ఇస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నాయి. అయితే, ఈ ప్రకటనలలో కొన్ని గత తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలతో నిండి ఉంటున్నాయి. దీంతో సామాజిక మాధ్యమంలో ప్రకటనల కోసం ప్రభుత్వం ఇష్టారీతిగా, అడ్డగోలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేస్తోందన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.  

వైసీపీ  వర్గాల   సమాచారం మేరకు ఇప్పటి నుండి మరో నాలుగు నెలల పాటు ప్రకటనలు ఇచ్చేలా యూట్యూబ్ తో  వైసీపీ ఒప్పందం చేసుకుంది.  దీనిని బట్టి చూస్తే ఈ నాలుగు నెలలకు ప్రకటనల ఖర్చు అంటే పార్టీ ప్రచార వ్యయం వందల కోట్లలోనే ఉంటుందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.  వైసీపీ పార్టీ నుండి ఈ నిధులు ఖర్చు చేసి ఉంటే దానిపై ఎన్నికల కమిషన్ నిఘా పెట్టి చర్యలు తీసుకోవలసి ఉంటుంది. అలా కాకుండా  ప్రభుత్వ నిధులు కేటాయిస్తే అది ముమ్మాటికీ  అధికార దుర్వినియోగమే అవుతుంది. అంటే ఎలా చూసిన సామాజిక మాధ్యమం ద్వారా వైసీపీ ప్రకటనల రూపేణా చేస్తున్న వ్యయం ఎలా చూసినా నిబంధనలకు తిలోదకాలు వదిలేసి చేస్తున్నదేనన్ని పరిశీలకులు  నిశ్చితాభిప్రాయం.